నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
♦ అంతర్జాతీయ బలహీనతలకు తోడైన లాభాల స్వీకరణ
♦ సెన్సెక్స్‌కు 379 పాయింట్ల నష్టం
♦ 125 పాయింట్ల నష్టంతో 7,110కు నిఫ్టీ
ముడి చమురు ధరలు మళ్లీ పతనం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. అంతర్జాతీయ బలహీనతలకు లాభాల స్వీకరణ కూడా తోడవడంతో మంగళవారం మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,200 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 23,410 పాయింట్ల వద్ద ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 7,110 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి.
ఆ మూడు షేర్లకూ నష్టం: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 నుంచి వైదొలగనున్న మూడు షేర్లు-కెయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి. ఏప్రిల్ 1 నుంచి నిఫ్టీ సూచీలో చేరనున్న ఆరబిందో ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ (డీవీఆర్) ప్రారంభంలో మంచి లాభాలను సాధించాయి. చివరకు టాటా మోటార్స్ (డీవీఆర్) 2 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్‌లు స్వల్పంగా లాభపడగా, అరబిందో స్వల్పంగా నష్టపోయింది.
సెబీ పరిశీలనలో 16 ఎన్‌ఎఫ్‌ఓలు
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగా ఉంటుండటంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు న్యూ ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌ఓ) జోరుగా జారీచేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు 16 ఎన్‌ఎఫ్‌ఓల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదాయ పత్రాలను దాఖలు చేశాయి.