స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు (ఫైల్ ఫోటో)
ముంబై : అమెరికా స్టాక్‌మార్కెట్లు ఇచ్చిన దెబ్బకు సెషన్ ప్రారంభంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ సూచీలు... చివరి వరకు ఆ నష్టాల కొనసాగిస్తూ వచ్చాయి. మధ్యలో కొంత కోలుకుని నష్టాలు తగ్గించుకున్నప్పటికీ, చివరికి మాత్రం మళ్లీ భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 407 పాయింట్లు కుదేలై 34,005 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంలో 10,454 వద్ద క్లోజయ్యాయి. ఫిబ్రవరి 1 ముగింపు నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 5.7 శాతం పతనమై భారీగా నష్టాలను మూటకట్టుకుంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతుందనే భయాందోళనతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి.
డోజోన్స్ పతనం మార్కెట్లలో ప్రకంపనాలను సృష్టిస్తోంది. అటు ఆసియన్ మార్కెట్లు కూడా భారీగానే నష్టాలు పాలయ్యాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్లపై విపరీతంగా పడుతోంది. రోజంతా సెన్సెక్స్ 34వేల మైలురాయి దిగువనే ట్రేడవడం గమనార్హం. చివరికి మాత్రమే 34వేల పైన 5 పాయింట్ల తేడాలో ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ స్వల్పంగా 0.3 శాతం లాభాలు పండించింది. ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోగా.. మెటల్ మాత్రమే 1.3 శాతం మెరిసింది. బ్యాంకు నిఫ్టీ దాదాపు 2 శాతం, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం నుంచి 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 12 పైసలు బలహీనపడి 64.38 గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 91 రూపాయల నష్టంలో రూ.30,016గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment