
ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 317.93 పాయింట్లు (0.41 శాతం) పెరిగి 77,606.43 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 77,747.46-77,082.51 రేంజ్‌లో ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ 50 సూచీ 105.10 పాయింట్లు (0.45 శాతం) లాభంతో 23,591.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇంట్రాడేలో 23,646.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేయగా, ఇంట్రాడే కనిష్టాన్ని 23,412.20 వద్ద నమోదు చేసింది.
బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2.85 శాతం వరకు లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదేసమయంలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 5.38 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.15 శాతం లాభపడటంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 0.37 శాతం లాభంతో స్థిరపడింది.
నిఫ్టీ ఆటో, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికాలో తయారు చేయని అన్ని దిగుమతి కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఆటో షేర్లు అమ్మకాలను చవిచూశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ గురువారం 1.04 శాతం నష్టంతో స్థిరపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో స్థిరపడింది.