
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్‌కు క్లోజ్ కానున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్‌లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.
ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.
మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment