
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్ షేర్లు, ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు, ఎంపిక చేసిన ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజు కూడా విజయ పరంపరను కొనసాగించాయి.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 262 పాయింట్ల లాభంతో 76,996 వద్ద ప్రారంభమైంది. చైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే దిగుమతులపై 245 శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
సెన్సెక్స్ నష్టాలను పూడ్చుకుని 556 పాయింట్ల లాభంతో 77,110 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 309 పాయింట్లు (0.4 శాతం) లాభంతో 77,044 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో 3,197 పాయింట్లు లాభపడింది.
అలాగే నిఫ్టీ 50 సూచీ 23,273 వద్ద కనిష్టాన్ని, ఆ తర్వాత 23,452 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 104.60 పాయింట్లు (4.5 శాతం) లాభంతో 23,433 వద్ద ముగిసింది. నిఫ్టీ గత మూడు రోజుల్లో 1,038 పాయింట్లు పెరిగింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్ గా నిలిచింది. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో గుర్తించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడానికి నియమించిన బాహ్య సంస్థ పీడబ్ల్యుసి తన నివేదికను సమర్పించిన తరువాత ఈ స్టాక్ దాదాపు 7 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 4 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐటీసీ 1 - 2 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు మారుతి 1.5 శాతం క్షీణించింది.
అదేసమయంలో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. విస్తృత సూచీలు ఈ రోజు బెంచ్ మార్క్ ను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ 0.9 శాతం పెరిగాయి.