
ట్రంప్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాలు మినహాయింపు
ఆటోమొబైల్స్‌పై టారిఫ్‌ల సవరణ వార్తల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
సూచీలు రెండు శాతం ర్యాలీ
బ్యాంకులు, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులను మినహాయించడంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం 2% ర్యాలీ చేశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 65 డాలర్లకు దిగిరావడం, డాలర్ ఇండెక్స్ బలహీనత అంశాలూ కలిసొచ్చాయి.
ఫలితంగా సెన్సెక్స్ 1,578 పాయింట్లు పెరిగి 76,735 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 500 పాయింట్లు బలపడి 23,329 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 1,695 పాయింట్ల లాభంతో 76,852 వద్ద, నిఫ్టీ 539 పాయింట్లు పెరిగి 23,368 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. విస్తృత స్థాయిలో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాలు నిలుపుకోలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,907 వద్ద, నిఫ్టీ 23,368 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి. రంగాల వారీగా సూచీలు రియల్టీ 6%, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్ 4%, ఆటో, కన్జూమర్ డిస్క్రిషనరీ, ఫైనాన్సియల్ సర్విసెస్, మెటల్ షేర్లు మూడుశాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 3% ర్యాలీ చేశాయి.
లాభాల బాటలో అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియాలో సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్, తైవాన్ వెయిటెడ్ 2%, జపాన్ నికాయ్, కొరియా కోస్పీ, ఇండోనేషియా జకార్తా ఒకశాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై అరశాతం రాణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్ సీఏసీ 1%, జర్మనీ డాక్స్ 1.50%, బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ 1.5% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బ్యాంకింగ్ షేర్ల దన్ను: ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని బ్రోకరేజ్ సంస్థ జెఫ్ఫారీస్ అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3%, ఇండస్‌ఇండ్ బ్యాంకు 7%, యాక్సిస్ బ్యాంక్ 4 శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్ల ఈ నాలుగు షేర్ల వాటాయే 750 పాయింట్లు కావడం విశేషం.
ఆటో షేర్ల పరుగులు: ఆటో మొబైల్స్ పరిశ్రమపై గతంలో విధించిన సుంకాలు సవరించే వీలుందని ట్రంప్ సంకేతాలతో ఆటో షేర్లు పరుగులు పెట్టాయి. సంవర్ధన మదర్శన్‌సుమీ 8%, భారత్ ఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 7%, టాటా మోటార్స్, ఎంఆర్‌ఎఫ్ 4.50% ర్యాలీ చేశాయి. హీరో మోటోకార్ప్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, టీవీఎస్ మోటార్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో 3% లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, మారుతీ 2% పెరిగాయి.
రూపాయి రెండోరోజూ ర్యాలీ
దేశీయ ఈక్విటీ మార్కెట్ అనూహ్య ర్యాలీ, అమెరికా కరెన్సీ బలోపేతంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 30 పైసలు బలపడి 85.50 వద్ద స్థిరపడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు భారత కరెన్సీ బలపడేందుకు తోడ్పడ్డాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.85 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.59 స్థాయి వద్ద గరిష్టాన్ని తాకింది.
2 రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లు
దలాల్ స్ట్రీట్‌లో రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.