
2030 నాటికి అంచనా
వార్షికంగా 18 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ ఈ–రిటైల్ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధి చెందనుంది. 2030 నాటికి 170–190 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓ నివేదిక ప్రకారం స్థూల ఆర్థికాంశాలు, వినియోగంపరమైన సవాళ్ల కారణంగా 2024లో ఈ–రిటైల్ రంగ వృద్ధి చారిత్రక గరిష్టమైన 20 శాతం నుంచి నెమ్మదించి సుమారు 10–12 శాతానికి మందగించింది. అయితే, ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సరళతరం చేయడంతో వృద్ధి క్రమంగా పుంజుకోనుంది.
ముఖ్యంగా 2025 పండుగ సీజన్ నుంచి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ‘దీర్ఘకాలికంగా మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయి. ఈ–రిటైల్ రంగం వచ్చే ఆరేళ్లు 18 శాతం వృద్ధి చెంది 170–190 బిలియన్ డాలర్లకు చేరవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. ముఖ్యావసరయేతర ఉత్పత్తులు, సేవలపై ప్రజలు మరింతగా ఖర్చు చేయనుండటం ఇందుకు దోహదపడనుంది.
రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ గత దశాబ్దకాలంలో రిటైల్‌కి సంబంధించి భారత్ శక్తివంతమైన కేంద్రంగా మారింది. 2024లో అంతర్జాతీయంగా మూడో అతి పెద్ద రిటైల్ మార్కెట్‌గా ఎదిగింది.
→ ఇటీవలి కాలంలో వినియోగం, ముఖ్యావసరాలు కాకుండా ఇతరత్రాల ఉత్పత్తులు, సేవలపై ఖర్చు చేయడం కాస్త నెమ్మదించింది. ప్రైవేట్ వినియోగం కోవిడ్ పూర్వం (2017–19లో) 11 శాతంగా ఉండగా దానితో పోలిస్తే కోవిడ్ తర్వాత (2022–24) 8 శాతానికి తగ్గింది. వేతనాలు పెద్దగా పెరగకపోవడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం.
→ ఇటీవల ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంతో ఈ–రిటైల్ వృద్ధి మళ్లీ పుంజుకోనుంది. నిత్యావసరాలు, దుస్తులు.. ఎల్రక్టానిక్స్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు దోహదపడనున్నాయి. 2030 నాటికి ప్రతి మూడు డాల ర్లలో వీటి వాటా రెండు డాలర్లుగా ఉంటుంది.
→ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ–రిటైల్ వినియోగం పెరుగుతోంది. 2020 నుంచి చూస్తే కొత్తగా షాపింగ్ చేస్తున్న ప్రతి అయిదుగురిలో ముగ్గురు ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నారు. అలాగే, 2021 నుంచి చూస్తే కొత్త విక్రేతల్లో 60 శాతం మంది ద్వితీయ శ్రేణి లేదా అంతకన్నా చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు.
→ క్విక్ కామర్స్, హైపర్ వేల్యూ కామర్స్ మొదలైన విభాగాలు తదుపరి ఈ–రిటైల్ వృద్ధికి దోహదపడనున్నాయి.