హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు... నిరాధారం | Adani Group, SEBI Chief, Industry Leaders Slam Discredited Hindenburg | Sakshi
Sakshi News home page

Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు... నిరాధారం

Published Mon, Aug 12 2024 5:00 AM | Last Updated on Mon, Aug 12 2024 8:01 AM

Adani Group, SEBI Chief, Industry Leaders Slam Discredited Hindenburg

కొట్టిపారేసిన సెబీ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ 

వ్యక్తిత్వ హననమంటూ వ్యాఖ్య 

సెబీ చీఫ్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్న అదానీ

న్యూఢిల్లీ:  అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్‌ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్‌ అక్రమాల్లో సెబీ చీఫ్‌ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్‌ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్‌ పెద్ద బాంబ్‌ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. 

ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్‌ ఆరోపణ. స్వయంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్‌ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్‌ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు.  

మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... 
హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్‌ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. 

కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్‌ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్‌పర్సన్‌ మాధవీ పురి బచ్‌ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది.  

హిండెన్‌బర్గ్‌ ఏం చేస్తుంది?
హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్‌ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్‌ ఆండర్సన్‌ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్‌ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్‌ హెల్త్, బ్లాక్‌ ఇంక్, కాండీ, లార్డ్స్‌టౌన్‌ మోటార్స్‌ వంటి కంపెనీలను ఇది టార్గెట్‌ చేసింది. 

బిజినెస్‌ మోడల్‌ ఇదీ.. 
అవకతవకలపై రీసెర్చ్‌ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్‌ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్‌ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్‌ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్‌ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్‌ చెప్పడం 
విశేషం!  

బ్లాక్‌స్టోన్‌లో ధవళ్‌ పదవిపై...
బ్లాక్‌స్టోన్‌ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్‌ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్‌ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్‌ నియామాకానికి ముందే 2019లో ధవళ్‌ బచ్‌ను బ్లాక్‌స్టోన్‌ తమ సీనియర్‌ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్‌ మేనేజ్‌మెంట్‌లో ధవళ్‌ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్‌పర్సన్‌ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు.  

బచ్‌పై ఆరోపణలు ఇవీ... 
‘2017లో సెబీలో హోల్‌టైమ్‌ మెంబర్‌గా బచ్‌ నియమాకానికి ముందే 2015లో బచ్‌ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫండ్‌) ఇన్వెస్ట్‌ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్‌ ఫండ్‌ 1లో (ఇది మారిషస్‌ ఆఫ్‌షోర్‌ ఫండ్‌) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) మేనేజ్‌ చేసిన ఈ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్స్‌లో వినోద్‌ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్‌ కూడా. 2022లో బచ్‌ సెబీ చైర్‌పర్సన్‌ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. 

అదానీ గ్రూప్‌నకు పవర్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోళ్లలో ఇన్వాయిస్‌లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ భారత్‌ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్‌ ఫండ్‌ 1 అదానీ గ్రూప్‌ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్‌ (గతంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్‌–2019 అక్టోబర్‌ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్‌ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.

దురుద్దేశపూరితం: అదానీ 
హిండెన్‌బర్గ్‌ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్‌ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్‌ పేర్కొంది.

 మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్‌ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.

జరిగింది ఇదీ... 
అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్‌ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. 

కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్‌ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. 

కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్‌ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్‌ విలువను అదానీ గ్రూప్‌ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. 

గత నెలలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్‌ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్‌ బ్యాంక్‌ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్‌ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్‌ హెడ్జ్‌ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement