అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఇటీవల నాలుగు పదాల ట్వీట్ చేసింది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సెబీ చైర్‌పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపైన అదానీ గ్రూప్, సెబీ చైర్‌పర్సన్ ఇద్దరూ స్పదించారు.
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మా హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ.. అనేక పబ్లిక్ డాక్యుమెంట్‌లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తులను లేదా మా స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పేర్కొన్న వ్యక్తులతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. మేము పారదర్శకత మరియు అన్ని చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా కట్టుబడి ఉంటామని కంపెనీ వివరించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు భారతీయ చట్టాలను పూర్తిగా దిక్కరిస్తున్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధి అన్నారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చీఫ్ కూడా స్పందించారు. 2024 ఆగష్టు 10న హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మా జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం వంటివి. అవసరమైన అన్ని విషయాలను ఇప్పటికే సెబీకి అందించాము. వారు కోరే అన్ని ఆర్థిక పత్రాలను ప్రతి అధికారానికి బహిర్గతం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment