Fake companies
-
హిండెన్‌బర్గ్ ఆరోపణలు... నిరాధారం
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్ అక్రమాల్లో సెబీ చీఫ్ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్ పెద్ద బాంబ్ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్ ఆరోపణ. స్వయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది. బిజినెస్ మోడల్ ఇదీ.. అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్ చెప్పడం విశేషం! బ్లాక్‌స్టోన్‌లో ధవళ్ పదవిపై...బ్లాక్‌స్టోన్ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్ నియామాకానికి ముందే 2019లో ధవళ్ బచ్ను బ్లాక్‌స్టోన్ తమ సీనియర్ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్ మేనేజ్మెంట్లో ధవళ్ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్పర్సన్ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు. బచ్‌పై ఆరోపణలు ఇవీ... ‘2017లో సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా బచ్ నియమాకానికి ముందే 2015లో బచ్ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో (ఇది మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ట్రేడింగ్ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్ఎల్) మేనేజ్ చేసిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఫండ్స్‌లో వినోద్ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్ కూడా. 2022లో బచ్ సెబీ చైర్పర్సన్ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. అదానీ గ్రూప్‌నకు పవర్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఇన్వాయిస్లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ భారత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్–2019 అక్టోబర్ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.దురుద్దేశపూరితం: అదానీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.జరిగింది ఇదీ... అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్ విలువను అదానీ గ్రూప్ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. గత నెలలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్ బ్యాంక్ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్ హెడ్జ్ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్. -
స్కిల్ స్కాం: అంతా చంద్రబాబు కనికట్టు
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. స్కిల్ సెంటర్స్ పేరుతో డొల్ల కంపెనీల ద్వారా డబ్బు ఎలా తరలించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే ఏపీఎస్ఎస్డీసీని తెరపైకి తెచ్చి.. సీమెన్స్ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లు దొంగ ఇన్వాయిస్లను సృష్టించి రూ.241 కోట్లు కాజేశారు. ఈ బాగోతమంతా ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ ఇంటిలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్ ఆడిట్స్‌లో పక్కా ఆధారాలతో బయటపడింది. ఇందుకోసం అప్పటికప్పుడు కొన్ని షెల్ కంపెనీలను పుట్టించగా, హవాలా మార్గంలో నగదును సరఫరా చేసే కొన్ని షెల్ కంపెనీలను ఎంచుకున్నారు. మొత్తం ఈ కుంభకోణంలో సీమెన్స్ ముసుగులో డిజైన్‌టెక్ కీలకంగా వ్యవహరించింది. డిజైన్ టెక్ నుంచి రెండు షెల్ కంపెనీలకు మొత్తం నగదును పంపించి, అక్కడ నుంచి అనేక షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఆ నగదు చంద్రబాబు సూచించిన వ్యక్తులకు చేరినట్లు దర్యాప్తులో షెల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. రూ.లక్షతో రూ.241 కోట్లు నగదును తరలించడం కోసం స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు) పేరుతో ఒక డొల్ల కంపెనీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే 2015 మార్చి30న స్కిలర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు రిజాస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) డేటా స్పష్టం చేస్తోంది. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రతిక్ రమన్భాయ్ పటేల్, అబ్దుల్ రఫుల్ హాయ్ కేవలం లక్ష రూపాయల మూల ధనంతో స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఏకంగా రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. 717 దొంగ ఇన్వాయిస్లను సృష్టించి వాటి ద్వారా డబ్బులు కొట్టేశారు. స్కిలర్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కిల్ ల్యాబ్స్‌కు రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసి డబ్బులు తీసుకున్నట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కానీ ఆ వివరాలను ఎక్కడా ఆ కంపెనీ అకౌంట్స్‌లో చూపించలేదు. 2016–17 సంవత్సరానికి స్కిలర్ కంపెనీ ఆర్వోసీకి సమర్పించిన ఆర్థిక స్టేట్మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సంవత్సరంలో కేవలం రూ.99.03 కోట్ల విలువైన పరికరాలు మాత్రమే సరఫరా చేసినట్లు దొంగ లెక్కలు చూపించారు. వాస్తవానికి ఒక్క రూపాయి విలువైన పరికరాలు కూడా సరఫరా చేయలేదు. స్కిల్ కుంభకోణంపై సీఐడీ విచారణ ప్రారంభించిన తర్వాత స్కిలర్ తన దుకాణం మూసేసినట్లు ఆర్వోసీ రికార్డులు సూచిస్తున్నాయి. 2021లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్లు సమర్పించిన స్కిలర్ గత రెండేళ్ల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఆర్వోసీకి ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చాక దుకాణం బంద్ స్కిలర్ చేతికి వచ్చిన రూ.241.49 కోట్లను పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు గూటికి తరలించేశారు. ఈ కంపెనీలు కేవలం స్కిల్ కుంభకోణం సమయంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయని, ఆ తర్వాత పని చేయలేదని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రూ.లక్ష మూలధనంతో 2012లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీని 2016లో నగదు తరలించిన తర్వాత మూసేశారు. 2016లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్ సమర్పించిన ఈ కంపెనీ ఆ తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ప్రస్తుతం ఇది మూతపడిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో పేర్కొన్నారు. మరో డొల్ల కంపెనీ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యూఢిల్లీ కేంద్రంగా రూ.లక్షతో మొదలైంది. స్కిల్ కుంభకోణం నిధుల తరలింపు పూర్తయిన తర్వాత 2018లో ఈ కంపెనీ మూతపడింది. 2018 తర్వాత ఈ కంపెనీ ఎటువంటి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదని, ప్రస్తుతం ఈ కంపెనీ మూసివేసిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో చూపిస్తోంది. రూ.లక్షతో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ 2018 డిసెంబర్ 10 తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆర్వోసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ డొల్ల కంపెనీలన్నీ నగదు తరలించాక కనుమరుగయ్యాయని స్పష్టమవుతోంది. ఇలా దొంగ ఇన్వాయిస్లతో నగదును తరలించడమే కాకుండా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కోరుతూ దరఖాస్తు చేయడంతో పూణేలోని జీఎస్టీ ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగి తీగ లాగితే మొత్తం డొంకంతా బయట పడింది. హవాలా నగదు తరలింపులో ఏసీఐ దిట్ట అల్లైయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఆసియా) లిమిటెడ్ (ఏసీఐ) నకిలీ ఇన్వాయిస్లతో నగదును తరలించడంలో దిట్ట. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ఈ కంపెనీకి ఈ విషయంలో పెద్ద రికార్డే ఉంది. 2013–14 నుంచి 2019–20 వరకు ఈ కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ను పరిశీలిస్తే స్కిల్ కుభంకోణం సమయంలో ఏసీఐ ద్వారా ఎంత నగదు తరలించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణం ముందు, తర్వాత ఏడాదికి రూ.లక్షల్లో మాత్రమే ఆదాయాన్ని చూపిన ఈ కంపెనీ.. కుంభకోణం సమయంలో రూ. కోట్లల్లో ఆదాయం చూపించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరం అంటే 2015–16లో రూ.30.52 కోట్లు, 2016–17లో రూ.35.77 కోట్లు, 2018–19లో రూ.9.77 కోట్లు ఆదాయాన్ని చూపించిన ఈ కంపెనీ 2019–20కి వచ్చే సరికి కేవలం రూ.2 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించింది. ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2017లో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ వారికి సమాచారమిస్తే వారు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ సందర్భంగా కంపెనీకి, కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేయగా, వారు నిజాలను ఒప్పేసుకున్నారు. ఎటువంటి వస్తువులు సరఫరా చేయకుండానే చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించి డిజైన్ టెక్ నుంచి నగదును తీసుకొని వాటిని వివిధ రూపాల్లో తిరిగి వారికే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఏసీఐ ఎండీ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో రూ.241 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా కొట్టేస్తూ సాక్ష్యాలతో బటయపడినా టీడీపీ మీడియా మా బాబు నిప్పు అంటూ అడ్డుగోలుగా వాదనలు చేయడం వారికే చెల్లింది. -
వెలుగులోకి మరో వందల కోట్ల ‘GST’ స్కాం.. కుంభకోణం చేసింది వీళ్లే
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ స్కాంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లను సృష్టిస్తున్న ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) మీరట్ జోనల్ యూనిట్ అరెస్ట్ చేసింది. రూ.3,100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు జారీ చేయడం, రూ.557 కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడం వెనుక నిందితులు సూత్రధారులని తేలింది. నిందితులకు మీరట్ ఎకనమిక్స్ అఫెన్స్ కోర్టు ఆగస్ట్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నోయిడా పోలీసుల సమాచారంతో డీజీజీఐ విస్తృతంగా డేటాను తనిఖీలు చేసింది. తనిఖీలు అనంతరం ఆనంద్ కుమార్, అజయ్ కుమార్, విక్రమ్ జైన్లను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కంపెనీల పేరుతో అకౌంట్లను తెరవడంలో బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు గుర్తించారు. అసలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనప్పటికీ 240 షెల్ కంపెనీలకు బ్యాంక్ ఖాతాలను తెరించేందుకు అనుమతించిన కొన్ని బ్యాంకులపై డిజీజీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 246 డొల్ల కంపెనీల ప్రమేయం ఉంది. రూ.2,142 కోట్ల నకిలీ ఇన్ వాయిస్ లను వెల్లడించే పత్రాలను డీజీజీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సిండికేట్లు రూపొందించిన ఇన్వాయిస్లను నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న 1,500 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఈ రెండు సిండికేట్లు 3 నకిలీ సంస్థల ద్వారా రూ.142 కోట్ల ఐటీసీతో కలిపి రూ.557,246 కోట్ల పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్ కలిగిన ఇన్వాయిస్లను 1,500కు పైగా లబ్ధిదారుల సంస్థలకు జారీ చేసినట్లు డీజీజీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రధాన లబ్దిదారుల సంస్థలు ఢిల్లీలో ఉన్నాయని, మరికొన్ని ఇతర 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. ఈ సిండికేట్ ఏజెంట్ల నెట్ వర్క్ తో పనిచేస్తూ పేదల ఆధార్, పాన్ కార్డులను సేకరించి వారికి కొద్ది మొత్తం చెల్లిస్తున్నట్లు తేలింది. చదవండి👉 'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO అలర్ట్ -
కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు
హైదరాబాద్: కార్వీ షేర్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణహరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
గప్ చుప్‌గా ఈఎస్ఐ నిధులను సర్దేశారు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా శాఖలకు పూర్తిస్థాయిలో రాకపోవడం సాధారణంగా జరిగేదే. అత్యంత ప్రాధాన్యరంగాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేటాయింపుల కంటే ఎక్కువ నిధులివ్వడం జరుగుతుంది. అయితే ఈఎస్ఐకి అదనంగా నిధులు రావడం, అవి పక్కదారి పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఎస్ఐ విభాగానికి అదనపు నిధులు కావాలని కార్మికశాఖ ప్రభుత్వాన్ని కోరడం.. ప్రభుత్వం కూడా అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయడం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. 2015 నుంచి 2019 వరకు ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి రూ.1278.22 కోట్లు కేటాయించింది. కానీ ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.1616.93 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంటే బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.338.71 కోట్లు విడుదల చేసిందని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయనే సందేహాలు, మంత్రి కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. గతంలో కార్మికశాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆ మాజీ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. బిల్లులు ఇవ్వకుండా సతాయించి... వాస్తవానికి ఈఎస్ఐకి చెంది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కార్మికుల కోసం ఏటా మందులు కొనుగోలు చేస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రొక్యూర్మెంట్ కమిటీ ముందు ఆసుపత్రికి ఎన్ని మందులు కావాలి? ఏయే మందులు, పరికరాలు కావాలి? అన్న విషయాలపై నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీలు) కంపెనీల నుంచి బహిరంగ టెండర్లు ఆహ్వనించాలి. వచ్చిన టెండర్లలో మార్కెట్ రేటు కంటే తక్కువకు ఎవరు కోట్ చేస్తే వారికి టెండర్ అప్పగించాలి. కానీ, ఐఎంఎస్ అధికారులు ఈ ప్రక్రియను పాటించలేదు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ పద్మలు సరఫరా అయిన మందుల్లో 30 శాతం ఆర్సీ కంపెనీల నుంచి, మిగిలిన 70 శాతం ఎన్ఆర్సీ (నాన్ రేటెడ్ కంపెనీ)ల నుంచి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆర్సీ కంపెనీల నుంచి సింహభాగం మందులు కొనుగోలు చేయాలి. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆర్సీ కంపెనీలకు బిల్లులు చెల్లించేవారు కాదని, దీంతో సదరు కంపెనీలు మందుల సరఫరా నిలిపివేయగానే.. ఆ సాకుతో ఎన్ఆర్సీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్ఆర్సీకి ఎప్పుడు వెళ్లాలి? జీవో నెం 51 ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో, ఆర్సీ కంపెనీలు సరఫరా చేయలేని మందుల కోసం మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. దానికి సైతం ప్రొక్యూర్ కమిటీ నివేదిక, బహిరంగ టెండర్లు, కంపెనీల ఎంపిక నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ, ఐఎంఎస్‌లో ఇవేమీ జరగలేదు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పగించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. రేటెడ్ కంపెనీలు అధికారులకు ఎలాంటి ముడుపులు, కమీషన్లు ఇవ్వవు. అదే, ఎన్ఆర్సీ కంపెనీలైతే అడిగినంత ఇస్తాయి. అందుకు బదులుగా కాంట్రాక్టు దక్కించుకున్నవారు ధరలు పెంచుకునే వీలును గతంలో అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇష్టానుసారంగా అప్పగించిన టెండర్లకు ప్రొక్యూర్ కమిటీని ఏర్పాటు చేయనేలేదని ఈఎస్ఐ కార్మికులు ఆరోపిస్తున్నారు. వారే డొల్ల కంపెనీలను సృష్టించి, తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని కథ నడిపారని, అందుకే అదనపు నిధులు విడుదల అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడుతున్నారు. అదృశ్య శక్తులపై ఈడీ ఆరా వాస్తవ బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది? అందుకు, ఐఎంఎస్ అధికారులు ఏం కారణం చూపారు? ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఏ పరిస్థితుల్లో ఆమోదించారు? దీని వెనక అదృశ్య రాజకీయశక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఐఎంఎస్ ఆడిట్ పుస్తకాలు, ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తదితరాలపై ఈడీ అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్లలో కేటాయింపుల కంటే రూ.338 కోట్లు అధికంగా తీసుకొని ఖర్చుపెట్టి ఏం సేవలు అదనంగా అందించారు? ఎక్కడ సేవలు మెరుగుపరిచారు? అన్న విషయాలపైనా ఈడీ తవ్వడం మొదలుపెడుతోంది. ( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం ) -
వయసు 25ఏళ్లు.. చేసిన మోసం రూ. 50 కోట్లు
అహ్మదాబాద్: ఇరవై ఐదేళ్ల సీఏ విద్యార్థిని వడోదరలో జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. టాక్స్ ఎగ్గొట్టడానికి ఫేక్ కంపెనీలను సృష్టించి 50.2 కోట్ల రూపాయల మేరకు తప్పుదారి పట్టించాడు. దీంతో అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన మనీష్ కుమార్ ఖత్రీ 115 షల్ కంపెనీలు సృష్టించి, వివిధ రూపాలలో పన్ను ఎగ్గొట్టాడు. అనుమానాస్పద టాక్స్ పేయర్స్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఖత్రీ వ్యవహారం రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టికి వచ్చింది. ఖత్రీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి టాక్స్ కట్టాల్సిన డబ్బును వివిధ కంపెనీలకు తరలించి 50 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాహుద్ అనే చిన్న గ్రామంలో ఉన్న అమాయకుల నుంచి వారి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని వారి పేరు మీద ఈ కంపెనీలు సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. వారికి నెలకు కొంత మొత్తం చెల్లిస్తానని ఖత్రీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించేందుకుఫేక్ వెబ్‌సైట్‌తో నకిలీ కంపెనీలు సృష్టించినట్లు ఖత్రీ అంగీకరించాడు. చదవండి: గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి -
ఎవరా ఐఏఎస్?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లల్లో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. ఈ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణకు ముందు సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ కార్యాలయంలోని రికార్డు రూముల్లో లెక్కలు తారుమారు చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటే జీని పరిశీలిస్తే మరిన్ని విష యాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బోరబండ, పటాన్చెరు, చర్లపల్లి డిస్పెన్సరీల్లోనే రూ.100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని సమాచారం. నాలుగేళ్లలో రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్లకుపైగా మింగేశారని ఆరోపిస్తున్నారు. ఎలా నడిపారంటే? 2015 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో డైరెక్టర్ దేవికారాణిది కీలక పాత్ర. ఈమె నేతృత్వంలో జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కూరపాటి వసంత ఇందిరా, ఫార్మాసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ ఒగ్గు హర్షవర్ధన్, ఆమ్ని ఫార్మాకు చెందిన చెరుకూరి నాగరాజు, కంచర్ల హరిబాబు అలియాస్ బాబ్జీలతో కథ నడిపారు. వాస్తవానికి మందుల కొనుగోళ్లలో నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి జీవో నంబర్ 51ను ప్రభుత్వం 2012లోనే విడుదల చేసింది. దాని ప్రకారం.. రిజిస్టర్డ్ కంపెనీల నుంచే కొనుగోళ్లు చేయాలి. రిజిస్టర్ కంపెనీలు అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో మాత్రమే గుర్తింపులేని ప్రైవేటు కంపెనీల నుంచి కొనుక్కోవచ్చన్న వెసులుబాటు ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని జాయింట్ డైరెక్టర్ పద్మతో కలసి దేవికారాణి కథ మొత్తం నడిపింది. నలభైకి పైగా నకిలీ కంపెనీలు దేవికా రాణికి చెందినవేనని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొత్తం 140 కంపెనీలను అప్పటికప్పుడు సృష్టించి నకిలీ బిల్లులు పెట్టి కోట్లు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని, ముందే ఖాళీ బిల్లులపై, ఇండెట్లపై ముందుగానే సంతకాలు చేసి ఉంచేవారు. దేవికారాణి ఎంత చెబితే అంత వేసి డబ్బు డ్రా చేసుకునేవారు. దీంతో ఈ ముఠాలోని సభ్యులంతా హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు, అపార్ట్మెంట్లు, నగలు, బంగారం బిస్కెట్లు కొన్నారని సమాచారం. సీఎం నాకు బంధువు.. జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ అక్రమాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ ఉండేదనిసిబ్బంది చెబుతున్నారు. ‘నా ఇంటి పేరు తెలుసా? సీఎం కేసీఆర్‌ది నాదీ ఒకే ఇంటిపేరు. ఆయన నాకు బంధువు’ అంటూ నేమ్ ప్లేట్ చూపించి బెదిరించేదని వాపోతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రంజెంటేటివ్ వరకు అంతా పాత్రధారులే కావడంతో కథ సాంతం సాఫీగా సాగేది. ఎక్కడైనా కొత్త సిబ్బంది వస్తే.. వారిని ప్రలోభ పెట్టడం, లేకపోతే బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఐఎంఎస్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ ఓ డాక్టర్‌ను ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాల్సిందిగా ప్రలోభపెట్టిన ఆడియో టేపులు లీకవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో దేవికారాణి ముఠా ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను తమతో కలుపుకొన్నారని ఉద్యో గ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు భారీగా లంచం ముట్టజెప్పడంతో ఆడిట్ రికార్డులను చెరిపేందుకు వచ్చాడని ఆరోపిస్తున్నారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో బ్యాంకు మేనేజర్లతో పెద్ద మొత్తంలో కమీషన్ మాట్లాడుకుని కొత్త నోట్లు మార్చుకున్నారని సమాచారం. దారి మళ్లించి దండుకున్నారు! మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులతో మందుల కొనుగోళ్లు బీమా వైద్య సేవల సంచాలక (డీఐఎంఎస్) విభాగంలో ఉన్నతాధికారుల అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈఎస్ఐ నిబంధనలకు తూట్లు పొడిచి భారీగా నిధులను స్వాహా చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం డీఐఎంఎస్‌కు విడు దల చేసిన నిధులను నిర్దేశిత కార్యక్రమాల కోసం కాకుండా అక్రమాలకు వినియోగించిన తీరు బహిర్గతమైంది. రాష్ట్రంలో ఈఎస్ఐ ఖాతాదారులు 18.5 లక్షల మంది ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 58 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సేవల లభ్యత కష్టమైనప్పుడు ఈఎస్ఐసీ గుర్తింపు పొందిన ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో లబ్ధిదారులు చికిత్స పొందొచ్చు. వీరికి నిబంధనల ప్రకారం ఈఎస్ఐసీ వైద్య ఖర్చును రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా డీఐఎంఎస్‌లకు విడుదల చేస్తుంది. అక్కడ వైద్య బిల్లులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత చెల్లింపులను ఖరారు చేసి లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తుంది. ఇలా మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను క్రమం తప్పకుండా ఈఎస్ఐసీ విడుదల చేస్తుండగా... డీఐఎంఎస్ మాత్రం వీటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడింది. ఐదేళ్లలో రూ.110 కోట్ల మళ్లింపు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన ఈఎస్ఐ ఖాతాదారులు రీయింబర్స్మెంట్ కోసం డీఐఎంఎస్‌కు పెట్టుకున్న అర్జీల పరిశీలన, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు ఐదేళ్లుగా వీటి చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. అత్యవసర కార్యక్రమం కింద మందుల కొనుగోలుకు మళ్లించారు. గత ఐదేళ్లలో దాదాపు 110 కోట్లను ఇలా మందులు కొనుగోలు చేయడం గమనార్హం. డీఐఎంఎస్‌లో మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరుకుపోయాయి. దాదాపు లక్ష బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులను పూర్తిస్థాయిలోచెల్లించాలంటే రూ.178 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మోసాల ‘కొలువు’
ఉద్యోగం... మూడక్షరాల ఈ పదం.. ఏటా వందలాది మంది నిరుద్యోగులను మోసపోయేలా చేస్తోంది. రూ.లక్షలు కోల్పోవడానికి కారణమవుతోంది. కొంతమందిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది. ఉద్యోగాలు కావాలనే ఆశతో ఎంతోమంది నిరుద్యోగులు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. భారీ వేతనాలు వస్తాయనే నమ్మకంతో చేతిలో ఉన్న డబ్బును వదిలించుకుంటున్నారు. వాస్తవాన్ని గుర్తించేసరికి నడిరోడ్డుపై నిలుస్తున్నారు. వీరిని మోసగిస్తున్నవారు మాత్రం రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. - దగా పడుతున్న నిరుద్యోగులు - రూ.కోట్లు కొల్లగొడుతున్న నకిలీ సంస్థలు - 8 రోజుల్లో మూడు ఘటనలు - వెలుగు చూడనివి ఎన్నో... సాక్షి, సిటీబ్యూరో: మొన్న గ్రామీణ్ స్వరోజ్‌గార్ యోజనలో ప్రభుత్వ ఉద్యోగాలు... నిన్న విదేశాల్లో కొలువులు... నేడు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం... ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపుతూ రూ.కోట్లకు కోట్లు దండుకుంటున్నాయి వివిధ నకిలీ సంస్థలు. రూ.వేలల్లో జీతాలిస్తామని మభ్యపెట్టి సులభ రీతిలో డబ్బులు లాగేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు 8 రోజుల్లో మూడు వెలుగులోకి వచ్చాయి. వివిధ కారణాలతో బయట పడని సంఘటనలు ఎన్నో ఉన్నట్టు సమాచారం. ఉద్యోగం ఇప్పించకపోతారా? అన్న చిన్ని ఆశ నకిలీ సంస్థలను నమ్మేలా చేస్తోంది. ఇంట్లో పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయాలనే ఒత్తిళ్లు... చదువయ్యాక ఖాళీగా కూర్చుండలేక మరికొందరు...ఇలా వివిధ కారణాలతో ఉద్యోగం కోసం భారీ మొత్తంలో డబ్బు సమర్పించుకుంటున్నారు. తీరా సంస్థ నకిలీదని తెలిశాక లబోదిబోమంటున్నారు. పక్కా ప్రణాళికతో... కొన్ని సంస్థలు తమపై ఎటువంటి అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో మోసాలకు తెర తీస్తున్నాయి. తియ్యనైన మాటలతో నిరుద్యోగులను నమ్మిస్తున్నాయి. ఈ కోవలోనే గ్రామీణ్ స్వరోజ్‌గార్ యోజనలో ఉద్యోగాలంటూ ఢిల్లీకి చెందిన రమేశ్‌సింగ్, రాకేశ్ సింగ్ ముఠా జ్ట్టిఞ://ఠీఠీఠీ. జటటడజీఛీజ్చీ.జీ వెబ్‌సైట్‌ను సృష్టించి స్థానికుల సహకారంతో పంచాయతీ సర్వేయర్, బ్లాక్ డెవలప్మెంట్ సర్వేయర్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సర్వేయర్, స్టేట్ డెవలప్మెంట్ సర్వేయర్ ఉద్యోగాలంటూ జాబ్సైట్లలో, తెలుగు దినపత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. వేలల్లో జీతాలంటూ ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షలు నిర్వహించారు. ఇంట ర్వ్యూల పేరిట ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు. వీరి వలలో దాదాపు 500 మందికిపైగా పడ్డారని సమాచారం. కింది సిబ్బంది దొరికినా.. సూత్రదారులు ఇంకా పోలీసులకు చిక్కలేదు. మరో కేసులో విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలంటూ మెహదీపట్నంలోని రేతిబౌలి ఈ-సేవ సమీపంలో ‘తలత్ మాన్ పవర్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టూర్ అండ్ ట్రావెల్స్’ పేరిట ఎమ్డీ షేక్ హాఫీజుద్దీన్ నిరుద్యోగులను మోసగించి పోలీసులకు దొరికిపోయాడు. ఇంకో కేసులో శిక్షణతో పాటు ఉపాధి చూపుతానంటూ ఏడాది క్రితం అమీర్‌పేటలోని కేఆర్ ఏన్క్లేవ్లో ఏఎంసీ స్వైర్ సంస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా అభ్యర్థులను ఆకర్షించాడు భూపతిరాజు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల వంతున ఫీజు వసూలుచేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇలా నకిలీ సంస్థల సూత్రధారులు పోలీసులకు చిక్కుతున్నా.. నిరుద్యోగులకు మాత్రం డబ్బులు తిరిగిరావడం లేదు. దీంతో వారంతా తాము చెల్లించిన డబ్బుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యావంతులే బురిడీ కొట్టిస్తున్నారు ఉన్నత చదువులు చదివిన వారే.. సులభ పద్ధతిలో డబ్బు సంపాదించేందుకు ఈ పద్ధతిని ఎన్నుకుంటున్నారు. మరికొందరు కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేసి... ఆ జీతం సరిపోక మోసపూరిత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నగరంలో జరిగిన ఈ సంఘటనల్లో ఢిల్లీవాసులు, హైదరాబాద్‌కు చెందినవారే ఉంటున్నారు. ఇలాంటి వారివిషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పాటు నిరుద్యోగుల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీసుల అదుపులో నిందితుడు సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి మోసగించిన మహమ్మద్ గజని (ఎంకే సమీర్ రెడ్డి)ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు చెందిన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ మంగళవారం అదుపులోకి తీసుకుంది. సంతోష్‌నగర్‌కు చెందిన సమీర్ రెడ్డి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ పడ్డాడు. హైకోర్టు అడ్వొకేట్నని నమ్మించి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు వసూలు చేశాడు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత వీరి ఫోన్‌కాల్స్ డైవర్ట్ చేయడంతో పాటు ఉంటున్న ఇల్లు కూడా మారిపోయాడు. తాము మోసపోయామని గ్రహించిన నలుగురు యువకులు పోలీసులను సంప్రదించారు. ఈమేరకు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్ల ఆధారంగా ఇతర బాధితుల వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా... విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కూకట్‌పల్లిలోని వివేక్‌నగర్‌లో జాబ్ కన్సల్టెన్సీ కార్యాలయం నడుపుతున్న రాజేశ్ కుమార్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాగ్రత్తలు అవసరం - ఆన్లైన్ ప్రకటనలను అంత సులువుగా నమ్మకూడదు. - సంస్థల పూర్వాపరాలు తెలుసుకోవాలి - బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అడుగరు. పేరున్న ఇలాంటి సంస్థల్లో బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఉండవు. అందుకని డబ్బు డిమాండ్ చేసే ఏ సంస్థనూ నమ్మకూడదు. - ఉద్యోగావకాశాల కోసం సంస్థల అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా సరిచూసుకోవాలి. - హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నందున అవసరమైతే అక్కడికి వెళ్లి క్రాస్‌చెక్ చేసుకోవాలి. - విదేశీ కంపెనీల్లో భారత వర్కర్లను నియమించేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి లెసైన్స్ ఉందో లేదో సరిచూసుకోవాలి. అన్నీ బాగుంటేనే ముందుకెళ్లాలి.