సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆయా శాఖలకు పూర్తిస్థాయిలో రాకపోవడం సాధారణంగా జరిగేదే. అత్యంత ప్రాధాన్యరంగాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేటాయింపుల కంటే ఎక్కువ నిధులివ్వడం జరుగుతుంది. అయితే ఈఎస్‌ఐకి అదనంగా నిధులు రావడం, అవి పక్కదారి పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఎస్‌ఐ విభాగానికి అదనపు నిధులు కావాలని కార్మికశాఖ ప్రభుత్వాన్ని కోరడం.. ప్రభుత్వం కూడా అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయడం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.
2015 నుంచి 2019 వరకు ఈఎస్‌ఐకి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి రూ.1278.22 కోట్లు కేటాయించింది. కానీ ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.1616.93 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంటే బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.338.71 కోట్లు విడుదల చేసిందని ఈఎస్‌ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయనే సందేహాలు, మంత్రి కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. గతంలో కార్మికశాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆ మాజీ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
బిల్లులు ఇవ్వకుండా సతాయించి...
వాస్తవానికి ఈఎస్‌ఐకి చెంది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కార్మికుల కోసం ఏటా మందులు కొనుగోలు చేస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రొక్యూర్‌మెంట్ కమిటీ ముందు ఆసుపత్రికి ఎన్ని మందులు కావాలి? ఏయే మందులు, పరికరాలు కావాలి? అన్న విషయాలపై నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం.. ఆర్‌సీ (రేటెడ్ కంపెనీలు) కంపెనీల నుంచి బహిరంగ టెండర్లు ఆహ్వనించాలి. వచ్చిన టెండర్లలో మార్కెట్ రేటు కంటే తక్కువకు ఎవరు కోట్ చేస్తే వారికి టెండర్ అప్పగించాలి. కానీ, ఐఎంఎస్ అధికారులు ఈ ప్రక్రియను పాటించలేదు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ పద్మలు సరఫరా అయిన మందుల్లో 30 శాతం ఆర్‌సీ కంపెనీల నుంచి, మిగిలిన 70 శాతం ఎన్‌ఆర్‌సీ (నాన్ రేటెడ్ కంపెనీ)ల నుంచి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆర్‌సీ కంపెనీల నుంచి సింహభాగం మందులు కొనుగోలు చేయాలి. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆర్‌సీ కంపెనీలకు బిల్లులు చెల్లించేవారు కాదని, దీంతో సదరు కంపెనీలు మందుల సరఫరా నిలిపివేయగానే.. ఆ సాకుతో ఎన్‌ఆర్‌సీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఈఎస్‌ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఎన్‌ఆర్‌సీకి ఎప్పుడు వెళ్లాలి?
జీవో నెం 51 ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో, ఆర్‌సీ కంపెనీలు సరఫరా చేయలేని మందుల కోసం మాత్రమే ఎన్‌ఆర్‌సీ కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. దానికి సైతం ప్రొక్యూర్ కమిటీ నివేదిక, బహిరంగ టెండర్లు, కంపెనీల ఎంపిక నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ, ఐఎంఎస్‌లో ఇవేమీ జరగలేదు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పగించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. రేటెడ్ కంపెనీలు అధికారులకు ఎలాంటి ముడుపులు, కమీషన్లు ఇవ్వవు. అదే, ఎన్‌ఆర్‌సీ కంపెనీలైతే అడిగినంత ఇస్తాయి. అందుకు బదులుగా కాంట్రాక్టు దక్కించుకున్నవారు ధరలు పెంచుకునే వీలును గతంలో అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇష్టానుసారంగా అప్పగించిన టెండర్లకు ప్రొక్యూర్ కమిటీని ఏర్పాటు చేయనేలేదని ఈఎస్‌ఐ కార్మికులు ఆరోపిస్తున్నారు. వారే డొల్ల కంపెనీలను సృష్టించి, తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని కథ నడిపారని, అందుకే అదనపు నిధులు విడుదల అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడుతున్నారు.
అదృశ్య శక్తులపై ఈడీ ఆరా
వాస్తవ బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది? అందుకు, ఐఎంఎస్ అధికారులు ఏం కారణం చూపారు? ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఏ పరిస్థితుల్లో ఆమోదించారు? దీని వెనక అదృశ్య రాజకీయశక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఐఎంఎస్ ఆడిట్ పుస్తకాలు, ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తదితరాలపై ఈడీ అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్లలో కేటాయింపుల కంటే రూ.338 కోట్లు అధికంగా తీసుకొని ఖర్చుపెట్టి ఏం సేవలు అదనంగా అందించారు? ఎక్కడ సేవలు మెరుగుపరిచారు? అన్న విషయాలపైనా ఈడీ తవ్వడం మొదలుపెడుతోంది.
( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం )
Comments
Please login to add a commentAdd a comment