ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే
♦ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల సునామీ...
♦ ఇంట్రాడేలో 1,100 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
♦ దేశీ సంస్థల కొనుగోళ్లతో కొంత కోలుకున్న భారత్ సూచీలు
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తాజా రెఫరెండంలో బ్రిటన్ ప్రజలు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. బ్రిటన్ పౌండు, యూరోలతో సహా వర్ధమాన కరెన్సీలు దశాబ్దాల కనిష్టస్థాయికి పడిపోయాయి. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం రివ్వున ఎగిసింది.
భారత్ సూచీలు ఇంట్రాడేలో దాదాపు 5 శాతం వరకూ పడిపోయాయి. బ్రెగ్జిట్ జరగకపోవచ్చంటూ సర్వేలు వెల్లడికావడంతో క్రితం రోజు 27,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 26,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. 25,911 పాయింట్ల స్థాయికి పడిపోయిన సందర్భంలో దేశీయ సంస్థలు కనిష్టస్థాయి వద్ద లభ్యమవుతున్న షేర్లను కొనుగోలు చేయడం, బ్రెగ్జిట్‌తో మన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం లేదంటూ కేంద్రం, ఆర్‌బీఐ భరోసానివ్వడంతో ముగింపులో సూచీలు కొంతవరకూ కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 605 పాయింట్ల క్షీణతతో 26,398 పాయింట్ల వద్ద ముగిసింది. 7,927 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ముగింపులో కోలుకుని, 182 పాయింట్ల నష్టంతో 8,089 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలు దాదాపు 2.25 శాతం క్షీణించాయి.
టాటా గ్రూప్ షేర్లకు దెబ్బ...
యూరప్, బ్రిటన్‌లలో వ్యాపారాలు చేస్తూ, అక్కడ్నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీల షేర్లు బాగా క్షీణించాయి. వాటిలో టాటా గ్రూప్‌నకు చెందిన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్‌లు ఉన్నాయి. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా టాటా మోటార్స్ 8.5 శాతం పడిపోగా, టాటా స్టీల్ 7 శాతం వరకూ నష్టపోయింది. ఇంట్రాడేలో ఈ రెండు షేర్లూ 11-12 శాతం వరకూ పతనమయ్యాయి. టాటా మోటార్స్‌కు బ్రిటన్‌లో లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్‌రోవర్ ప్లాంటు, టాటా స్టీల్‌కు కోరస్ ప్లాంటు వున్న సంగతి తెలిసిందే. టీసీఎస్ 2.5 శాతం నష్టంతో ముగిసింది. టీసీఎస్‌కు యూరప్ నుంచి 15 శాతంపైగా ఆదాయం సమకూరుతుంది. ఇదే ప్రాంతంతో వ్యాపార సంబంధాలున్న టెక్ మహీంద్రా 5 శాతం, మెటల్ కంపెనీ వేదాంత సైతం 7 శాతం చొప్పున పడిపోయాయి.
రూ.1.8 లక్షల కోట్ల సంపద నష్టం
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.1.8 లక్షల కోట్ల విలువైన సంపదను కోల్పోయారు. ఒకదశలో ఈ నష్టం రూ. 4 లక్షల కోట్లవరకూ చేరినప్పటికీ, ముగింపులో మార్కెట్ రికవరీ వల్ల నష్టాలు తగ్గాయి. మార్కెట్లో లిస్టయిన మొత్తం షేర్ల విలువ క్రితం రోజు రూ.101.38 లక్షల కోట్లు కాగా, గురువారం ఈ విలువ రూ. 99.60 లక్షల కోట్లకు తగ్గింది.
జపాన్ నుంచి అమెరికా వరకూ ...
బ్రెగ్జిట్ రిఫరెండం తొలి కౌంటింగ్ ఫలితాలు జపాన్ లో సూర్యుడు ఉదయించేసరికే వెల్లడికావడంతో ఆ దేశంలో మార్కెట్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆసియాలో అన్ని మార్కెట్లకంటే అధికంగా జపాన్ నికాయ్ సూచీ 7.92 శాతం పతనమయ్యింది. తూర్పున ఇతర ప్రధాన మార్కెట్లయిన ఆస్ట్రేలియా, కొరియా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్ సూచీలు 2-3 శాతం మధ్య పడిపోయాయి. మన మార్కెట్లానే హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ సైతం 5 శాతంపైగా పతనమైనప్పటికీ, ముగింపులో కొంతవరకూ రికవరీ అయ్యింది.
చైనా షాంఘై సూచి మాత్రం 1.3 శాతమే తగ్గింది. సంక్షోభానికి కేంద్ర బిందువైన బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండెక్స్ ఒకదశలో 8 శాతంపైగా పడి పోయింది. కానీ బ్రెగ్జిట్ కోసం అక్కడి ఆర్థిక సంస్థలు సంసిద్ధంగా వుండటంతో బ్రిటన్ మార్కెట్ నష్టాలు చివరకు 3 శాతానికి పరిమితయ్యాయి. జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ కాక్ సూచీలు 6-8 శాతం మధ్య పడిపోయాయి. ఇక అమెరికా సూచీలు కడపటి సమాచారం అందేసరికి 2 శాతంపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచంలో అన్నింటికంటే భారీగా గ్రీసు మార్కెట్ 14 శాతం పతనమయ్యింది. గ్రీసు కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.