గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు క్రాష్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : గ్లోబల్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లను దడదడలాడిస్తోంది. చిన్న చితకా ఇన్వెస్టర్ల నుంచి బడా ఇన్వెస్టర్ల వరకూ అందరూ ఈ తాటిని తట్టుకోలేక, భారీ మొత్తంలో సొమ్మును పోగొట్టుకుంటున్నారు. మూడు రోజుల కిందటి నుంచి అమెరికా స్టాక్ మార్కెట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నేడు కూడా మరోసారి ఢమాల్‌మన్నాయి. దీంతో ప్రపంచంలో అత్యంత ధనికవంతులు దాదాపు తమ నికర సంపద నుంచి సుమారు 100 బిలియన్ డాలర్ల(రూ.6,43,065 కోట్లకు పైగా) సంపదను కోల్పోయారు. వీరిలో 20 మంది అయితే ఏకంగా ఒక్కొక్కరు 1 బిలియన్ డాలర్ల మేర(రూ.6432 కోట్లను) పోగొట్టుకున్నారు.
ప్రపంచంలో అత్యంత ధనికవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 5.3 బిలియన్ డాలర్లు(రూ.34,092 కోట్లు) పడిపోయి 113.2 బిలియన్ డాలర్లు(రూ.7,28,045 కోట్లు)గా నమోదైందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. స్టాక్‌మార్కెట్ల పతనంతో అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు 4.7 శాతం పడిపోయాయి. బెర్క్‌షైర్ హాత్‌వే ఇంక్ చైర్మన్ వారెన్ బఫెట్ సంపద కూడా 3.5 బిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ ఇంక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. ఎలన్ మాస్క్ 1.1 బిలియన్ డాలర్లను కోల్పోయారు. అన్నింటి కంటే ఎక్కువగా టెస్లా షేర్లు 8.6 శాతం కుదేలయ్యాయి.
కాగ, డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లు నవంబర్ నాటి కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతుందని అంచనాలు, ద్రవ్యోల్బణం పెరుగబోతుందనే అంచనాలు అమెరికా స్టాక్‌మార్కెట్లను పడగొడుతున్నాయి. అమెరికా స్టాక్‌మార్కెట్‌లో నెలకొన్న ఈ ముసలం ప్రపంచస్థాయి స్టాక్‌మార్కెట్లన్నింటిపై ప్రభావం చూపుతోంది. మన స్టాక్ మార్కెట్లలో ఒకటైన సెన్సెక్స్ కూడా ప్రారంభంలో 500 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 445 పాయింట్ల నష్టంలో 33,967 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment