
స్టాక్ మార్కెట్‌లు ఇటీవల భారీగా పతనమై చిన్నగా కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో గడిచిన వారంలో వచ్చిన మార్కెట్ ర్యాలీ నాలుగేళ్లలో ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ 3,000 పాయింట్లు ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని చూసింది. ఈ బుల్లిష్ రన్‌తో ఇన్వెస్టర్ల సంపద అదనంగా రూ.22 లక్షల కోట్లు పెరిగింది. ఇటీవల కాలం వరకు భారీగా పతనమైన మార్కెట్లు వారంలో ఇంతటి ర్యాలీని అందించడంతో లాభాలను నమోదు చేసుకోవడానికి ఇది సరైన సమయమా లేదా మరింత కాలం వేచి చూడాలా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపై నిపుణులు కింది విధంగా సూచిస్తున్నారు.
మార్కెట్ ర్యాలీకి కారణాలు
సెన్సెక్స్ ఇటీవల పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వచ్చే త్రైమాసిక ఫలితాల్లో బలమైన కార్పొరేట్ రాబడులుంటాయనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరు ర్యాలీకి మరింత ఊపునిచ్చాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాలు ఈ పెరుగుదలకు కీలకంగా దోహదపడ్డాయి.
స్టాక్స్ అమ్మాలా? ఉంచాలా?
మార్కెట్లోని స్టాక్స్‌ను అమ్మి లాభాలు బుక్ చేయాలా లేదా మరిన్ని లాభాలను ఆశించి పెట్టుబడులను నిలుపుకోవాలా అనేది ప్రతి ఇన్వెస్టర్ మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే కింది అంశాలను పరిగణనలోని తీసుకోవాలి.
మార్కెట్ వాల్యుయేషన్: మార్కెట్ ప్రస్తుత వాల్యుయేషన్ కీలక అంశం. చారిత్రాత్మక కొలమానాలతో పోలిస్తే కొన్ని స్టాక్స్ ఇప్పటికీ అధిక వ్యాల్యూయేషన్లలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో దిద్దుబాటు ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో పాక్షికంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కూడా ఇలాంటి స్టాక్స్ ఉంటే వాటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.
పెట్టుబడి లక్ష్యాలు: ఇన్వెస్టర్లు తమ నిర్ణయాలను దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. భారతదేశం బలమైన ఆర్థిక మూలాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే వారు మరింత ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. తాత్కాలికంగా వచ్చే ర్యాలీకి ప్రభావితం చెంది ట్రేడ్‌లో నిర్ణయం తీసుకోకూడదు.
సెక్టార్-స్పెసిఫిక్ అనాలిసిస్: ఏ ర్యాలీలోనైనా అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ఒకేలా పెరగవు..తగ్గవు. సెక్టోరల్ వారీగా స్టాక్స్‌ను విశ్లేషించి ప్రస్తుతం మెరుగైన రాబడినిస్తున్న వాటిని కొనసాగించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీరేట్ల మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ ధోరణులను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలపై అప్‌డేట్లను నిత్యం పరిశీలిస్తుండాలి.
డైవర్సిఫికేషన్: ఆకస్మికంగా మార్కెట్‌లో వచ్చే ర్యాలీ మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడానికి, సరైన వైవిధ్యతను నిర్ధారించడానికి మంచి సమయం. రిస్క్ ఉన్న స్టాక్స్‌ను అమ్మేయడానికి ఈ ర్యాలీ తోడ్పడుతుంది. మంచి స్టాక్స్‌ను కొనసాగించేందుకు దోహదం చేస్తుంది.
ఇదీ చదవండి: ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..
మార్కెట్ ర్యాలీలో స్టాక్స్ అమ్మాలా లేదా ఉంచాలా అనేది పెట్టుబడిదారుల దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పరిధితో సహా వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment