World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..! | World Gold Council 2023: India gold demand dips 3percent to 747. 5 tons in 2023 on high prices | Sakshi
Sakshi News home page

World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..!

Published Thu, Feb 1 2024 1:34 AM | Last Updated on Thu, Feb 1 2024 1:34 AM

World Gold Council 2023: India gold demand dips 3percent to 747. 5 tons in 2023 on high prices - Sakshi

ముంబై: భారత్‌ బంగారం డిమాండ్‌ 2023లో 3 శాతం క్షీణించి 747.5 టన్నులకు చేరుకుంది. అయితే ధరలు తగ్గుముఖం పట్టి, అస్థిర పరిస్థితులు తొలగిపోయిన పక్షంలో డిమాండ్‌ రానున్న కాలంలో 800–900 టన్నుల మధ్య ఉండవచ్చు.  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన 2023 ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌’ నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 2022లో భారత్‌ మొత్తం పసిడి డిమాండ్‌ 774.1 టన్నులు. నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే...

► పెరుగుతున్న బంగారం ధరలకు తోడు ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు 2023 డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కొనుగోళ్లపట్ల వినియోగదారుల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాణిజ్య సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. 2023 మే 4వ తేదీన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర కొత్త గరిష్టం రూ.61,845కు చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఔన్స్‌ 2,083 డాలర్లకు ఎగసింది. ఇక దేశీయ మార్కెట్‌లో ధర నవంబర్‌ 16న మరో కొత్త గరిష్టం రూ.61,914కు చేరింది.  
► 2019 నుండి బంగారం డిమాండ్‌ 700–800 టన్నుల శ్రేణిలోనే ఉంటోంది.  తగ్గిన డిమాండ్, నిరంతర ధరలు అలాగే సుంకాల పెరుగుదల, స్టాక్‌ మార్కెట్‌ పనితీరు, సమీప కాల ఎన్నికల ఖర్చు ప్రభావం దీనికి కారణం. అయితే భవిష్యత్తులో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ధరలు అధిక స్థాయిలోనే ఉంటాయన్న విషయాన్ని మార్కెట్‌ జీరి్ణంచుకుంటుండడం ఈ సానుకూల అంచనాలకు కారణం.  
► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్‌ 6 శాతం తగ్గి 562.3 టన్నులకు పడింది. 2022లో ఈ పరిమాణం 600.6 టన్నులు.  
► పెట్టుబడుల డిమాండ్‌ మాత్రం 7 శాతం పెరిగి 173.6 టన్నుల నుంచి 185.2 టన్నులకు ఎగసింది.  

 దిగుమతులు 20 శాతం అప్‌
కాగా మొత్తం పసిడి దిగుమతులు 2023లో 20 శాతం పెరిగి 650.7 టన్నుల నుంచి 780.7 టన్నులకు ఎగశాయి. 2024లో డిమాండ్‌కన్నా పసిడి దిగుమతులు అధికంగా ఉండే అవకాశం ఉందని అవుట్‌లుక్‌ ఆవిష్కరణ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) పీఆర్‌ సోమశేఖర్‌ పేర్కొన్నారు. భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) దీనికి కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  ఇక  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో 26.7 శాతం పెరిగి 35.95 బిలియన్‌ డాలర్లకు పసిడి దిగుమతులు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. భారీ డిమాండ్‌ దీనికి కారణం.

ప్రపంచ డిమాండ్‌ కూడా 5 శాతం డౌన్‌
ఇదిలావుండగా, 2023లో ప్రపంచ పసిడి డిమాండ్‌ 5 శాతం తగ్గి 4,448.4 టన్నులకు పడినట్లు నివేదిక పేర్కొంది. ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)  భారీ ఉపసంహరణలు దీనికి కారణం. నివేదిక ప్రకారం ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది మూడవ సంవత్సరం.  ఈటీఎఫ్‌ల ఉపసంహరణల పరిమాణం 2022లో 109.5 టన్నులు. అయితే 2023లో ఈ పరిమాణం ఏకంగా 244.4 టన్నులకు ఎగసింది. కాగా సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు 2022లో 1,082 టన్నులు అయితే 2023లో ఈ పరిమాణం 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు పడింది. అయితే సెంట్రల్‌ బ్యాంకుల అత్యధిక కొనుగోళ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాలూ రికార్డుగా నిలిచాయి. ఇక భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తన పసిడి నిల్వలను 2022లో 32 టన్నులు పెంచుకుంటే, 2023లో 16.2 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్‌ దాదాపు 600 బిలియన్‌ డాలర్లకుపైగా  విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా  48 బిలియన్‌ డాలర్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement