అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఇంధన ఉత్పత్తి పెంపు
అమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్‌ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్‌లో అమెరికాను టాప్‌లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అంతర్జాతీయ ధరలపై ప్రభావం
యూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్‌లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment