Global Oil Rates
-
ఇజ్రాయెల్ యుద్ధం.. ఆయిల్ ధరలకు రెక్కలు!
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం (అక్టోబర్ 7) ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కల్పోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం (అక్టోబర్ 9) 4 శాతానికి పైగా పెరిగాయి. ముడి చమురు అధికంగా ఉన్న ప్రాంతంలో యుద్ధ వాతారణం నెలకొనడంతో చమురు సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఆసియా మార్కెట్లె బ్రెంట్ 4.7 శాతం పెరిగి 86.65 డాలర్లకు చేరుకోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.5 శాతం పెరిగి 88.39 డాలర్లకు చేరుకుంది. సర్వత్రా ఆందోళన హమాస్ ఆకస్మిక దాడి, దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన చేయడం వల్ల 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇరాన్లలో ఉద్రిక్తతలు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, సౌదీ అరేబియా ఉత్పత్తి కోతల కారణంగా సరఫరా తగ్గిపోవడంతో చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. తాజాగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ సంక్షోభం ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళలను మరింత పెంచుతోంది. -
దిగొస్తున్న చమురు ధర: రూపాయి పైపైకి
సాక్షి, ముంబై: ప్రపంచ ఇంధన ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయికి ఉత్సాహం వచ్చింది. డాలరు మారకంలో రూపాయి ఒక్కసారిగా 44 పైసలు జంప్ చేసింది. బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి 79.32 వద్దకు చేరింది. శుక్రవారం సెషన్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. (బుల్ దౌడు, 60వేల ఎగువకు సెన్సెక్స్) ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు ఆరు నెలల కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. బుధవారం 0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించి 106.44కి చేరుకుంది. అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఒక్క మంగళవారం ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ. 22,452 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. దీంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య దేశీయ ఈక్విటీలలో జోరు ఫారెక్స్ పెట్టుబడి దారుల దృష్టిని సానుకూలంగా మార్చిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొనుగోలుదారుల మద్దతుతో సెన్సెక్స్ 60వేల వద్ద, నిఫ్టీ 18 వేల వైపు పరుగులు తీస్తోంది. ఇండిపెండెన్స్‌డే, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లు వరుసగా సోమవారం, మంగళవారం పనిచేయలేదు. -
చమురు పైపైకి.. రూపాయి పాతాళానికి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఎఫ్ఐఐల అమ్మకాలు, ఎగిసిన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి గురువారం 77.81 వద్ద కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. రూపాయి 77.74 వద్ద ప్రారంభమైన రూపాయి ఆపై మరింత పడిపోయింది. బుధవారం 77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. స్టాక్మార్కెట్లో విదేశీపెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ డేటా ప్రకారం రూ.2,484.25 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాలు, ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడంతోపాటు భారతీయ షేర్ మార్కెట్లో ఎఫ్ఐఐలు అమ్మకాల జోరు రూపాయిని మరింత బలహీన పర్చాయని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. చైనాలో మేలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎగుమతులు 16.9 శాతం (సంవత్సరానికి) జంప్ చేయడం, అక్కడ లాక్డౌన్ పరిమితులను (షాంఘై ఇప్పటికీ కఠినమైన లాక్డౌన్) సడలింపు లాంటి పరిణామాల మధ్య చమురు ధరలు 13 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రాయిటర్స్ నివేదించింది. చమురు బ్యారెల్ ధర 123.43 డాలర్ల వద్దకు చేరింది. కాగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యం: ఆర్బీఐ జూన్ మానిటరీ పాలసీ రివ్యూలో 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ రెపో రేటును 4.9 శాతంగా ఉంచింది. ఏప్రిల్ 2022 నుండి రెపో రేటును పూర్తిగా 90 బేసిస్ పాయింట్లు పెంచడం రెండు నెలల్లో ఇది రెండవ పెంపు. అలాగే రానున్న సెప్టెంబరు రివ్యూలో కూడా వడ్డీ వడ్డింపు తప్పదనే భావన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఆహారం,ఇంధన ధరల కారణంగా, ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదైంది. అయితే ఇన్ఫ్లేషన్ను 4 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశానికి అత్యవసరమైన చమురు ఇంధనాలు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగనున్నాయట. గ్లోబల్‌గా చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు ఎగిస్తే, దేశీయంగా పెట్రోల్ ధర రూ.80ను, డీజిల్ ధర రూ.68ను టచ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. చమురు మార్కెట్‌ను సమతుల్య పరచడానికి ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) సభ్యులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ ధరలు బ్యారల్‌కు సుమారు 55 డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో వంతు చమురు ఉత్పత్తిని ఈ ఒపెక్ దేశాలే చేస్తుండటంతో వారు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని వెల్లడించింది.. నవంబర్ 28న ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు సంచలన ప్రకటన విడుదల చేశాయి. జనవరి 1 నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోత పెట్టేలా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద కోత. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 19 శాతం ఎగిశాయి. నాన్-ఒపెక్ సభ్యులు కూడా వియెన్నాలో డిసెంబర్ 10 మీటింగ్ తర్వాత మరో 0.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని కోత పెట్టనున్నట్టు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 80గా, లీటర్ డీజిల్ ధర రూ.68కు పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. 2017 మార్చికు బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధరలు 50-55 డాలర్లకు పెరుగనున్నట్టు వివరించింది. ఈ ధరలు 60 డాలర్లకు పెరుగనున్నట్టు తాము విశ్వసిస్తున్నామని, దీంతో దేశీయంగా కూడా రేట్లు పెరుగనున్నట్టు వెల్లడించింది.