భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Published Tue, Dec 6 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
దేశానికి అత్యవసరమైన చమురు ఇంధనాలు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగనున్నాయట. గ్లోబల్గా చమురు ధరలు బ్యారెల్కు 60 డాలర్లకు ఎగిస్తే, దేశీయంగా పెట్రోల్ ధర రూ.80ను, డీజిల్ ధర రూ.68ను టచ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. చమురు మార్కెట్ను సమతుల్య పరచడానికి ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) సభ్యులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ ధరలు బ్యారల్కు సుమారు 55 డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది.
అంతర్జాతీయంగా మూడో వంతు చమురు ఉత్పత్తిని ఈ ఒపెక్ దేశాలే చేస్తుండటంతో వారు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని వెల్లడించింది.. నవంబర్ 28న ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు సంచలన ప్రకటన విడుదల చేశాయి. జనవరి 1 నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోత పెట్టేలా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద కోత. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 19 శాతం ఎగిశాయి. నాన్-ఒపెక్ సభ్యులు కూడా వియెన్నాలో డిసెంబర్ 10 మీటింగ్ తర్వాత మరో 0.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని కోత పెట్టనున్నట్టు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 80గా, లీటర్ డీజిల్ ధర రూ.68కు పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. 2017 మార్చికు బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధరలు 50-55 డాలర్లకు పెరుగనున్నట్టు వివరించింది. ఈ ధరలు 60 డాలర్లకు పెరుగనున్నట్టు తాము విశ్వసిస్తున్నామని, దీంతో దేశీయంగా కూడా రేట్లు పెరుగనున్నట్టు వెల్లడించింది.
Advertisement