
కూరగాయల ధరల పెరుగుదలతో 10% పెరిగిన భోజనం ధరలు
టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపలకు రెక్కలు
బియ్యం, కందిపప్పు ధరల్లో కూడా పెరుగుదల
ఇదే సమయంలో తగ్గిన మాంసాహార భోజన రేట్లు
నిత్యావసర ధరలపై ఆసక్తికర క్రిసిల్ నివేదిక
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం..
ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదల
గతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.
ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..
మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది.