non-vegetarian
-
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
ఇక రంగు పడకుండా చికెన్ పకోడా
బనశంకరి: హోటళ్లు, వీధుల్లో విక్రయించే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా కనిపించాలని వ్యాపారులు ఎరుపు, ఊదా వంటి కృత్రిమ రంగులను ఉపయోగిస్తుంటారు. ఆ రంగుల వల్ల ప్రజలకు అనారోగ్యం కలుగుతోందని ఆరోపణలు రావడంతో కృత్రిమ రంగుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నిషేధించింది. ఆహార తనిఖీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 39 చికెన్ పకోడా, కబాబ్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబోరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 కబాబ్ల్లో హానికారకమైన కృత్రిమ రంగులను వాడినట్లు తేలింది. దీంతో కృత్రిమ రంగుల వాడకాన్ని సర్కారు నిషేధించింది. ఉల్లంఘనకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్ష , రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశముందని ఆహార సురక్షత నాణ్యత ప్రమాణాల శాఖ కమిషనర్ తెలిపారు. -
మంత్రి విందు భోజనంలో తొక్కిసలాట
మైసూరు: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప తన కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన విందులో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసింపుర తాలూకా హెళవరహుండి సమీంపలో చోటు చేసుకుంది. మంత్రి బాధ్యతలు చేపట్టిన మహాదేవప్ప తన కార్యకర్తల కోసం మాంసాహార విందు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు పది వేల మందికి విందు ఏర్పాటు చేశారు. అంతకు మించి రావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ కాలు విరిగిపోయింది. ఆమెను కేఆర్ ఆస్పత్రికి తరలించారు. -
కండలు పెరిగి సిక్స్ ప్యాక్ రావాలంటే.....
న్యూయార్క్: నేడు సిక్స్ ప్యాక్‌లు పెంచుకోవడం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలకే పరిమితం కాలేదు. సిక్స్ ప్యాక్‌లను పెంచుకునేందుకు నేటి కుర్రకారంతా తహతహలాడుతున్నారు. అందుకోసం జిమ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. కండర గండులు కావాలంటే జిమ్ములకెళ్లి గంటల కొద్ది కసరత్తు చేయడం ఒక్కటే సరిపోదు. శరీరంలో కండలు పెరిగేందుకు పద్ధతిగా ప్రోటీన్లు తీసుకోవడం తప్పనిసరి. ప్రొటీన్లు మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయా లేదా శాకాహారంలో ఎక్కువ ఉంటాయా? మాంసాహారులైతే రెండూ తీసుకోవచ్చు. మరి శాకాహారాలు ఏం చేయాలి? ఈ అంశంపై ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదిలో మంసాహారంలోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని, మాంసాహారం తీసుకోవడమే మేలన్న వాదన కొనసాగేది. ఆ తర్వాత కాలంలో శాకాహారానికి ప్రోత్సాహం, ఆదరణ పెరిగాక శాకాహారంలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. శాకాహారాన్ని తీసుకోవడమే మంచిదన్న వాదన పుట్టుకొచ్చింది. ఒకరి వాదనను ఒకరు ఒప్పుకోకుండా ఈ అంశంపై మాంసాహారులు, శాకాహారులు రెండుగా చీలిపోయారు. ఎవరి వాదనలో నిజం ఎంతుందో శాస్త్రీయంగా తెలుసుకునేందుకు అమెరికాలోని ఓ న్యూట్రిషన్ బృందం ప్రాక్టికల్‌గా ఓ అధ్యయనం జరిపింది. ఇందుకోసం ఆ బందం కసరత్తు, ప్రోటీన్ల ద్వారా కండలు పెంచుకోవాలనుకుంటున్న మూడు ఏజ్ గ్రూపులకు చెందిన మూడు వేల మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వారిలో జిమ్ములకెళ్లి కసరత్తు ఎక్కువ చేయగలిగిన కుర్రవాళ్లను ఓ గ్రూపుగాను, మధ్యవయస్కులను మరో గ్రూపుగాను, పెద్ద వయస్కులను మరో గ్రూపుగాను విభజించింది. మళ్లీ ఈ మూడు గ్రూపులను శాకాహారులుగా, మాంసాహారులుగా విభజించింది. శాకాహారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలతో కూడిన ఆరు రకాల డైట్‌ను అందజేయగా, మాంసాహారులకు మేక, కోడి మాంసం, చేపలు, గుడ్డు, తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను డైట్‌ను అందజేసింది. ఎవరు ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటారు, ఎంత సేపు కసరత్తు చేస్తున్నారనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు. కొన్ని నెలల తర్వాత అన్ని గ్రూపుల వారి కండలను కొలిచి చూడగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. అన్ని గ్రూపుల్లోనూ మాంసాహారం తీసుకున్నవారిలోనే కండరాలే ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ మోతాదులో శాకాహారం తీసుకున్న వారికన్నా తక్కువ మోతాదులో మాంసాహారాన్ని తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. అంటే శాకాహారులు అత్యధిక పోషక విలువలు కలిగిన 60 గ్రాముల శాకాహారాన్ని తీసుకున్న వారికన్నా 20 గ్రాముల మాంసాహారాన్ని తీసుకున్న వారిలోనే మంచి ఫలితాలు వచ్చాయి, ఎందుకు అలా జరిగిందో నిపుణుల బృందం మళ్లీ అధ్యయనం జరిపింది. మనుషుల్లో కండరాలు పెరగడానికి, అవి బలోపేతం అవడానికి లూసినో లాంటి ఆమ్లో ఆసిడ్స్ కారణమని, అవి మాంసాహారుల్లో ఎక్కువ ఉండడం వల్ల వాటిని డైట్‌గా తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని తేలింది. లూసినో లాంటి కీలకమైన ఆమ్లో ఆసిడ్ మాంసాహారంలో 9 నుంచి 13 శాతం ఉండగా, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు లాంటి వెజిటేరియన్ డైట్లో ఆరు నుంచి ఎనిమిది శాతం ఉన్నాయి. మొక్కజొన్న, సజ్జలు, కొర్రల్లో మాత్రమే 12 శాతం వరకు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా మాంసహారంలో మొత్తం తొమ్మిది రకాల ఆమ్లో ఆసిడ్స్ ఉండగా, శాకాహారంలో రెండు రకాల ఆసిడ్స్ తక్కువగా ఉన్నాయని, అవి కూడా అధ్యయన ఫలితాలను ప్రభావితం చేసి ఉంటాయని నిపుణుల బృందం పేర్కొంది. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. -
ఆ తిండి విషయంలో మహిళలే ఎక్కువ
న్యూఢిల్లీ: ‘గోమాంసం లేదా మేక మాంసం కలిసిన తేనేరు (పోషక విలువల పేరిట గ్రీన్ టీలో గోమాంసం కలుపుతున్న విషయం తెల్సిందే) సేవించపోతే చనిపోతావని ఎవరైన వైద్యుడు సలహా ఇచ్చినా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. అది శాకాహారం పట్ల నాకున్న కట్టుబాటు’ అని జాతిపిత మహాత్మాగాంధీ లండన్ విజిటేరియన్ సొసైటీతో 1931, నవంబర్ 20న చేసిన వ్యాఖ్య. శాఖాహారాన్ని అంతగా ప్రేమించే గాంధీ కూడా ఎన్నడూ గోమాంసాన్ని తినే వారిని ద్వేశించలేదు. వారిని అంటరాని వారిగా చూడలేదు. నేడు గోమాంసం పేరిట హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశంలో మాంసాహారులు ఎంత మంది ఉన్నారో, శాకాహారాలు ఎంత మంది ఉన్నారో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ‘రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్’ 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో 29 మంది శాకాహారాలుండగా, 71 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జీవ హింస కూడదంటూ పెటా లాంటి సంస్థలు చేసిన ప్రచారం, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన విస్తత ప్రచారం కారణంగా 2004 నుంచి 2014 వరకు, పదేళ్ల కాలంలో దేశంలో నాలుగు శాతం శాకాహారులు పెరిగారు. అంటే మాంసాహారుల సంఖ్య 75 నుంచి 71కి తగ్గింది. శాకాహారులు వాయువ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణలు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. వారిలో శాకాహారులు తక్కువ. మగవారితో పోలిస్తే ఇటు మాంసాహారుల్లోగానీ, శాకాహారుల్లోగానీ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళదే పైచేయి. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, మగవాళ్లు 70.7 శాతం ఉన్నారు. ఎస్సీలో మాంసహారులు పురుషులు 76. 1 శాతంకాగా, మహిళలు 77.9శాతం, ఎస్టీల్లో పురుషులు 75.9 శాతంకాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారు. మాంసాహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం, తక్కువకు లభిస్తుండడం వల్ల ఎస్సీ,ఎస్టీలు, దిగువ కులాల వారు ఎక్కువగా మాంసహారాన్ని ఆశ్రయిస్తున్నారు. -
ఆమిర్‌ను మార్చిన వీడియో!
ఒక గంట వీడియో... ఆమిర్ ఖాన్‌ను ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే... ఇక జీవితాంతం ‘వేగన్‌గా ఉండిపోవాలనుకోవడం. కేవలం శాకాహారాన్నే తింటూ, పాల ఉత్పత్తులతో సహా ఏ జంతు ఉత్పత్తులనూ తిననివాళ్లను ‘వేగన్’ అంటారు. కొన్నేళ్లుగా చేపలు, రొయ్యలు.. ఇలా మాంసాహారాన్ని, పాలతో చేసే ఆహారాన్ని తెగ లాగించేసిన ఆమిర్ ఇక జీవితాంతం వాటిని దూరం పెట్టేయనున్నారు. ఈ నెల 14తో ఆయన 50వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అందుకే ఇకపై ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య కిరణ్ రావ్ ఇచ్చిన సలహా మేరకు ‘వేగన్’గా మారారు. కొన్నేళ్లుగా వేగన్‌గా ఉంటున్న కిరణ్ రావ్, భర్తకు సలహా ఇవ్వడంతో పాటు ఓ వీడియో కూడా చూపించారు. గంటసేపు సాగే ఆ వీడియోలో అతి సహజంగా వచ్చే 15 రోగాలు ఎలా ప్రాణాలు తీస్తున్నాయనేది ఓ డాక్టర్ వివరించారు. అది చూసిన తర్వాత మాంసాహారుల కన్నా శాకాహారుల ఆరోగ్యం ఎంత మిన్నగా ఉంటుందో ఆమిర్ తెలుసుకున్నారట. ఈ వీడియోను ఆయన నెల క్రితం చూశారు. పుట్టినరోజు నుంచీ వేగన్‌గా మారాలనుకున్నారు. ఇన్నేళ్లూ మాంసాహారానికి అలవాటుపడిన ప్రాణం కదా.. ఉండగలనా? లేదా అని తనను తాను పరీక్షించుకోవడానికి నెల రోజులుగా శాకాహారమే తీసుకుంటున్నారు. ‘‘చికెన్, మటన్.. ఇలా ఏ బిర్యానీ అయినా నాకిష్టమే. ఓ పట్టు పట్టేవాణ్ణి. పాలతో చేసే మన భారతీయ మిఠాయిలంటే చాలా ఇష్టం. నెయ్యి, పనీర్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ, ఇప్పుడు నా ఇష్టాలన్నింటినీ అనిష్టం చేసేసుకున్నా. ఆరోగ్యం కోసం త్యాగం తప్పదని ఫిక్స్ అయ్యా. నాకు టీ బాగా అలవాటు. అందుకే, సోయా పాలతో తయారు చేయించుకుని తాగుతున్నా’’ అని చెప్పారు. ముద్దుల తనయుడు ఆజాద్ రావ్ ఖాన్‌ను కూడా వేగన్లా పెంచాలని ఉందంటున్నారు ఆమిర్. కానీ, ఆ విషయంలో కిరణ్, తానూ ఒత్తిడి చేయమనీ, ఒకవేళ ఆజాద్ మాంసాహారం తినాలకుంటే ఒప్పుకుంటామనీ ఆయన చెప్పారు. -
నేడు శాకాహార దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో/లైఫ్‌స్టైల్ ప్రతినిధి: శాకాహారం, సమతుల్య ఆహారం వైపుగ్రేటర్ సిటీజన్లు మొగ్గు చూపుతున్నారు. వీటితోనే దీర్ఘాయుష్షు సాధ్యమని విశ్వసిస్తున్నారు. నేడు శాకాహార దినోత్సవం (వెజిటేరియన్స్డే) సందర్భంగా నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వెజిటేరియన్స్. ‘మాంసాహారం లేకపోతే ముద్ద దిగదు’ అనే వారికి వీరి నినాదం కాస్త చేదుగా అనిపించినా.. శాకాహార ప్రియులు పెరుగుతున్నారడంలో సందేహం లేదు. ‘వెజిటేరియన్‌గా మారడమంటే సమాజానికి సేవ చేయడంతో సమానం’ అంటున్న ‘హైదరాబాద్ వెగాన్స్’ సంస్థ సభ్యులు... పాలు, గుడ్డు, ఆఖరికి తేనెతో సహా ఇతర జీవులను హింసించి పొందే ఆహారమేదీ మనది కాదని అందరికీ నచ్చచెప్పడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ వెగాన్స్ ఆవిర్భావం ఇలా.. వంకాయ వంటి కూర లేదంటారు. టమాట రుచి మాటలకందనిదంటూ లొట్టలేస్తారు. బీరకాయ‘పీచు’ వంటికి బోలెడంత ఫైబర్నిచ్చునంటూ ఉద్బోధిస్తారు. పాలకూర తిను... ఉక్కులా మారు నీ మేను అని హామీలు గుప్పిస్తారు. అలాగని వీరు కూరగాయల వ్యాపారులు కాదు. పక్కా ‘వెజ్’ ఫ్యాన్స్. ‘అచ్చమైన శాకాహారిగా మారడానికి గర్వపడుతున్నాం, మీరూ మారండని చెప్పడానికి తొందరపడుతున్నాం’ అంటూ ఒక బృందంగా ఏర్పడింది ‘హైదరాబాద్ వెగాన్స్’. ఈ బృందంలో సాత్విక ఆహారపు అలవాట్లను స్వచ్ఛందంగా అనుసరించే పలువురు సభ్యులుగా ఉన్నారు. ఏడాదిన్నర క్రితం ఓ అరడజను మందితో ఏర్పడిన ఈ గ్రూప్... తమ కార్యకలాపాలను విస్తరిస్తూ అనతి కాలంలోనే సభ్యుల సంఖ్యను 250కి చేర్చగలిగింది. కార్యక్రమాలివీ.. ‘వెగాన్స్’... నెలవారీ సమావేశాలు నిర్వహిస్తారు. తమలో నుంచి ఒక వలంటీర్ ఇంటిని దీని కోసం ఎంచుకుంటారు. అక్కడ పాట్ లాక్ (ఒక్కొక్కరు ఒక్కో వంటకం వండి తెచ్చి తినే విందు శైలి) నిర్వహించుకుంటారు. గెట్ టు గెదర్స్ పేరుతో జరిగే ఈ సమావేశాలకు తలా ఒక ఆరోగ్యకరమైన వంటకంతో హాజరవుతారు. బఫేలో అన్ని వంటకాలు రుచి చూస్తారు. అనంతరం మనిషికి మేలు చేసే ఆహారంపై తాము ఆ నెల రోజుల్లో తెలుసుకున్న కొత్త విషయాలు, అంశాలను ఒక్కొక్కరు ప్రస్తావిస్తారు. వీరు తెచ్చే వంటల్లో మలాయ్కుఫ్తా, తోఫు(పనీర్) మసాలా, కర్డ్ రైస్, కేక్స్, ఐస్‌క్రీమ్స్, కాజూ ఛీజ్‌తో పిజ్జా, విభిన్న రకాల ఫ్లేవర్స్‌ను విరజిమ్మే హెర్బల్ టీ, సోయా ఐస్‌క్రీమ్స్, వెగాన్ కేక్స్, మిల్క్ ఫ్రీ చాక్లెట్ బిస్కెట్స్... వంటివెన్నో ఉంటాయి. ఇవేవీ జీవ సంబంధ ఉత్పత్తులతో తయారైనవి కాకపోవడం విశేషం. శాకాహారుల నినాదాలివే.. ఏ జీవి అయినా బాధ పడుతూ నీకు ఆహారం ఇస్తే... అది నీకు క్షేమకరం కాదు’ అనేదే వెగాన్ సిద్ధాంతం. పాలు, పెరుగు, ఛీజ్, నెయ్యి... ఇంకా పాల ఉత్పత్తులు, ఊలు దుస్తులు, తోలు ఉత్పత్తులు, సిల్క్, తేనె... ఇలా జంతువుల నుంచి వచ్చేదేదైనా సరే వాడడం సరికాదు. ఏనుగులు, గుర్రాల వంటి అత్యంత శక్తివంతమైన జంతువులు పూర్తిగా వెజిటేరియన్లే. వాటికి ఎముకల బలహీనత వంటి సమస్యలు రాని కారణం అదే. అత్యధికంగా డెయిరీ ఉత్పత్తులను వినియోగిస్తున్న దేశాలు అదే స్థాయిలో ఆస్టియోపొరోసిస్ (ఎముకల గుల్లబారే వ్యాధి) బాధితులున్నవిగా గుర్తింపు పొందాయి. మీరు అవసరమైనన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నట్లయితే అవసరమైనంత ప్రోటీన్ లభిస్తున్నట్టే. మనం నిజానికి అవసరానికి మించి ప్రోటీన్‌ను తీసుకుంటాం. అదే మనకు ఆస్టియోపొరోసిస్, కిడ్నీ సమస్యలను తెస్తుంది. పప్పులు, బీన్స్, శనగలు, రాజ్మా, సోయా, ఆల్మండ్స్ వంటివన్నీ పుష్కలంగా ప్రొటీన్స్‌ను అందిస్తాయి. ఒలింపియన్ ఆఫ్ ది సెంచురీ కార్ల్లూయిస్ నుంచి జోల్ కిర్కిలిస్ దాకా అందరూ వెగాన్సే. బిల్‌క్లింటన్ సైతం వెగాన్. శాకాహారం అంటే ఆహారపు అలవాట్లలో ఒక విధానం కాదు. మనిషి అసలైన ఆహార విధానం. మాంసాహారం ద్వారా లభించే పోషక విలువలన్నీ శాకాహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. పాలు తీసుకోవద్దంటే పూర్తిగా పాల ఉత్పత్తుల రుచులకు దూరం కావాల్సిన పని లేదు. సహజసిద్ధమైన దినుసుల నుంచి పాలు తయారీ విధానాలు ఉన్నాయి. పాల పదార్థాలన్నింటినీ దినుసుల పాలను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఖరీదు కూడా ఒకటే. పైగా కొలెస్ట్రాల్ ఫ్రీ. బాదంపప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు, కొబ్బరి, బియ్యం, బీన్స్ నుంచి పాలు తయారు చేసుకోవడం చాలా సులువు. 100 గ్రాముల బాదం పాలు ఇంటిల్లిపాదికీ సరిపోతాయి. -
కొలెస్ట్రాల్ కు తీసుకోవలసిన జాగ్రత్తలు
కొలెస్ట్రాల్ అనేది మైనంలాంటి పదార్థం. ఇది శరీరం అంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ లివర్ నందు తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది 1) చెడు కొలెస్ట్రాల్ (LDL) 2) మంచి కొలెస్ట్రాల్ (HDL) 1. LDL కొలెస్ట్రాల్: ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనులందు అవరోధం ఏర్పడుతుంది. ఈ విధమైన చెడు కొలెస్ట్రాల్ పేరుకొనటం వల్ల రక్తప్రసరణకు అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. అదేవిధంగా మెదడుకు సరఫరా అయ్యే రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి పక్షవాతం ముప్పు ఏర్పడుతుంది. 2. HDL కొలెస్ట్రాల్: ఇది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కావున LDL కొలెస్ట్రాల్‌ను 140-150 mg/dl లోపు ఉండాలి. అదేవిధంగా HDL కొలెస్ట్రాల్ 40-50 mg/dl ఉండేలా చూసుకోవాలి. శరీరంలో ఉండే కొవ్వును ట్రైగ్లిసరాయిడ్స్ రూపంలో రక్తం ద్వారా శరీర కణజాలానికి చేరవేస్తుంది. ఈ ట్రైగ్లిసరాయిడ్స్ అధికంగా ఉన్న వారికి చెడు కొలెస్ట్రాల్ ... స్థాయి అధికం అవుతుంది. దీనిద్వారా కూడా గుండెపోటు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి ట్రైగ్లిసరాయిడ్స్ స్థాయిని శరీరంలో అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని మనం తగ్గించుకోక పోవటం వల్ల తీవ్రస్థాయి గుండెవ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కావున కొలె స్ట్రాల్ను వాటి స్థాయులకన్నా తక్కువ మోతాదులో ఉండేలా చూసుకొనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహార విహారాదులను ఆరోగ్యకరంగా పాటించడం వల్ల కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు దానితోబాటు ఆయుర్వేద ఔషధాలు వ్యాధిని తీవ్రతరం చేయకుండా కాపాడతాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. వ్యాయామం: నడక వల్ల .... మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచవచ్చు. 2. ప్రాణాయామం: 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది. 3. నీరు: రోజుకి సగటున 6-8 గ్లాసుల నీరు తీసుకోవాలి. 4. ఆల్కహాల్, మాంసాహార సేవన, సిగరెట్లు మానివేయాలి. 5. బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదుకల ఆహారం తీసుకోవాలి. 6. పీచు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవటం వల్ల కొలెస్ట్ట్రాల్ను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. డాక్టర్ హనుమంతరావు, ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక ph: 8977 33 66 88 / www.starayurveda.com