ఆమిర్‌ను మార్చిన వీడియో!
ఒక గంట వీడియో... ఆమిర్ ఖాన్‌ను ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే... ఇక జీవితాంతం ‘వేగన్‌గా ఉండిపోవాలనుకోవడం. కేవలం శాకాహారాన్నే తింటూ, పాల ఉత్పత్తులతో సహా ఏ జంతు ఉత్పత్తులనూ తిననివాళ్లను ‘వేగన్’ అంటారు. కొన్నేళ్లుగా చేపలు, రొయ్యలు.. ఇలా మాంసాహారాన్ని, పాలతో చేసే ఆహారాన్ని తెగ లాగించేసిన ఆమిర్ ఇక జీవితాంతం వాటిని దూరం పెట్టేయనున్నారు. ఈ నెల 14తో ఆయన 50వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అందుకే ఇకపై ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య కిరణ్ రావ్ ఇచ్చిన సలహా మేరకు ‘వేగన్’గా మారారు.
కొన్నేళ్లుగా వేగన్‌గా ఉంటున్న కిరణ్ రావ్, భర్తకు సలహా ఇవ్వడంతో పాటు ఓ వీడియో కూడా చూపించారు. గంటసేపు సాగే ఆ వీడియోలో అతి సహజంగా వచ్చే 15 రోగాలు ఎలా ప్రాణాలు తీస్తున్నాయనేది ఓ డాక్టర్ వివరించారు. అది చూసిన తర్వాత మాంసాహారుల కన్నా శాకాహారుల ఆరోగ్యం ఎంత మిన్నగా ఉంటుందో ఆమిర్ తెలుసుకున్నారట. ఈ వీడియోను ఆయన నెల క్రితం చూశారు. పుట్టినరోజు నుంచీ వేగన్‌గా మారాలనుకున్నారు. ఇన్నేళ్లూ మాంసాహారానికి అలవాటుపడిన ప్రాణం కదా.. ఉండగలనా? లేదా అని తనను తాను పరీక్షించుకోవడానికి నెల రోజులుగా శాకాహారమే తీసుకుంటున్నారు. ‘‘చికెన్, మటన్.. ఇలా ఏ బిర్యానీ అయినా నాకిష్టమే.
ఓ పట్టు పట్టేవాణ్ణి. పాలతో చేసే మన భారతీయ మిఠాయిలంటే చాలా ఇష్టం. నెయ్యి, పనీర్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ, ఇప్పుడు నా ఇష్టాలన్నింటినీ అనిష్టం చేసేసుకున్నా. ఆరోగ్యం కోసం త్యాగం తప్పదని ఫిక్స్ అయ్యా. నాకు టీ బాగా అలవాటు. అందుకే, సోయా పాలతో తయారు చేయించుకుని తాగుతున్నా’’ అని చెప్పారు. ముద్దుల తనయుడు ఆజాద్ రావ్ ఖాన్‌ను కూడా వేగన్‌లా పెంచాలని ఉందంటున్నారు ఆమిర్. కానీ, ఆ విషయంలో కిరణ్, తానూ ఒత్తిడి చేయమనీ, ఒకవేళ ఆజాద్ మాంసాహారం తినాలకుంటే ఒప్పుకుంటామనీ ఆయన చెప్పారు.