ఆ తిండి విషయంలో మహిళలే ఎక్కువ
న్యూఢిల్లీ: ‘గోమాంసం లేదా మేక మాంసం కలిసిన తేనేరు (పోషక విలువల పేరిట గ్రీన్ టీలో గోమాంసం కలుపుతున్న విషయం తెల్సిందే) సేవించపోతే చనిపోతావని ఎవరైన వైద్యుడు సలహా ఇచ్చినా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. అది శాకాహారం పట్ల నాకున్న కట్టుబాటు’ అని జాతిపిత మహాత్మాగాంధీ లండన్ విజిటేరియన్ సొసైటీతో 1931, నవంబర్ 20న చేసిన వ్యాఖ్య. శాఖాహారాన్ని అంతగా ప్రేమించే గాంధీ కూడా ఎన్నడూ గోమాంసాన్ని తినే వారిని ద్వేశించలేదు. వారిని అంటరాని వారిగా చూడలేదు. నేడు గోమాంసం పేరిట హత్యలు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశంలో మాంసాహారులు ఎంత మంది ఉన్నారో, శాకాహారాలు ఎంత మంది ఉన్నారో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ‘రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్’ 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో 29 మంది శాకాహారాలుండగా, 71 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జీవ హింస కూడదంటూ పెటా లాంటి సంస్థలు చేసిన ప్రచారం, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన విస్తత ప్రచారం కారణంగా 2004 నుంచి 2014 వరకు, పదేళ్ల కాలంలో దేశంలో నాలుగు శాతం శాకాహారులు పెరిగారు. అంటే మాంసాహారుల సంఖ్య 75 నుంచి 71కి తగ్గింది. శాకాహారులు వాయువ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారు.
దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణలు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. వారిలో శాకాహారులు తక్కువ. మగవారితో పోలిస్తే ఇటు మాంసాహారుల్లోగానీ, శాకాహారుల్లోగానీ మహిళలే ఎక్కువగా ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళదే పైచేయి. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, మగవాళ్లు 70.7 శాతం ఉన్నారు. ఎస్సీలో మాంసహారులు పురుషులు 76. 1 శాతంకాగా, మహిళలు 77.9శాతం, ఎస్టీల్లో పురుషులు 75.9 శాతంకాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారు. మాంసాహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం, తక్కువకు లభిస్తుండడం వల్ల ఎస్సీ,ఎస్టీలు, దిగువ కులాల వారు ఎక్కువగా మాంసహారాన్ని ఆశ్రయిస్తున్నారు.