
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 20వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. 1900 సంవత్సరం ప్రారంభ కాలంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి . అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కాపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో " క్లారా జెట్‌కిన్ " అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19న అనేక యూరోపియన్ దేశాలలో నిర్వహించారు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. అలా ఏటా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి ఫూలే , దుర్గాబాయి దేశ్ ముఖ్ లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేసారు. మహిళల విద్య , బాల్య వివాహలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేసారు.
ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేలా ప్రోత్సహించింది. ఈ దినోత్సవం మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించింది.
దేశాల వారిగా మహిళల శాతం..
ఇవాళ ప్రపంచ జనాభా 810 కోట్లు . ప్రపంచ జనాభా లో 50.30% పురుషులు , 49. 70% మహిళలు. హాంకాంగ్ లో 54. 92 % , లాట్వియా లో 54% , రష్యా లో 54.3%, ఉక్రెయిన్ లో 54% , లిథువేనియా లో 54% మంది చొప్పున ఆయా దేశ జనాభాలో మహిళలు ఉన్నారు.
ఖతార్ లో 28.48% , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 30.9% , ఒమన్ లో 35.8% , బహ్రెయిన్ లో 38% , సౌదీ అరేబియా లో 43.2% మంది మహిళా జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రసిద్ధి చెందాయి.
ఈ దేశాలలో మహిళకు సమాన అవకాశాలు..
ఇక్కడ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, వేతన సమానత్వం ఎక్కువగా ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని, ప్రభుత్వ మద్దతును అందిస్తున్నాయి. భారతదేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, లింగ వివక్ష , వేతన అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి వంటి రంగాలలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ దినోత్సవం ప్రాముఖ్యత..
భారతదేశంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నది. అవేంటంటే..
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది.
సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.
లింగ సమానత్వం , మహిళలపై హింసను అంతం చేయడం, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలపై దృష్టి సారించడానికి ఇది ఒక అవకాశం.
నాయకత్వ పాత్ర పై , విద్య, వాణిజ్య , ఉద్యోగ , ఆరోగ్య, ఉపాధి , ఆర్థిక స్థిరత్వంలో మహిళలను ప్రేరేపించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం
మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, లైంగిక వేధింపులు మహిళలకు సరిపోని ఆరోగ్య సంరక్షణ , మెరుగైన పని వాతావరణం వంటి సవాళ్ల గురించి ప్రభుత్వం, దృష్టికి తీసుకురావడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
బీజింగ్ డిక్లరేషన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవం 2025ను మహిళలు-బాలికలకు అందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాల మార్పుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శక్తిమంతమైన వేదికగా నిలవాలి ఆకాంక్షిస్తుంది.
ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని .. 'Accelerate Action' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెబుతోంది. .
చివరగా ఈ దినోత్సవం రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఇక కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, యాజమాన్యాలు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక చర్చలు , గోస్టులు, ఆటలు, పాటలు, ఆరోగ్య శిబిరాలు, ప్రతిభ చూపిన మహిళలుకు సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. సృష్టికి మూలం అయిన స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. వారికి జేజేలు.
వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ల, విశ్రాంత ఆర్ టీసి డిపో మేనేజర్,
(చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు)