cow meat
-
ఆవు మాంసాన్ని విక్రయిస్తున్న టీడీపీ కార్యకర్తలు
పొదలకూరు : ఆవులను చంపి మాంసం విక్రయించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి వివరాలు వెల్లడించారు. పొదలకూరు మండలం చాటగొట్లకు చెందిన కడివేటి భాస్కర్, నల్లబాలెం సురేంద్ర, నల్లబాలెం కిశోర్, నల్లబాలెం వెంకటరమణయ్య, నాగరాజు, వేణులు ముఠాగా ఏర్పడి మరుపూరు, చాటగొట్ల అటవీ ప్రాంతంలో సంచరించే ఆవులను చంపి మాంసాన్ని కిలో రూ.150 వంతున అమ్ముతున్నారు. మరుపూరు ఎస్సీ కాలనీకి చెందిన పెంచలమ్మ దొడ్డిలోని ఆవును ఈ నెల 17వ తేదీ రాత్రి అడవిలోకి తీసుకెళ్లి చంపి మాంసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తన ఆవు కనిపించడం లేదని పెంచలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగలాగితే డొంక కదలినట్టు కొంతకాలంగా ఈ ముఠా గోవులను చంపి మాంసాన్ని అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. మార్చి నెలలో నిందితులు సంగం, నెల్లూరు రోడ్డు అటవీ ప్రాంతంలో నాలుగు ఆవులను నాటు తుపాకీతో చంపి మాంసాన్ని అమ్ముకున్నారు. ఈ విధంగా 30 ఆవులను చంపారు. భాస్కర్, సురేంద్ర, కిశోర్, వెంకటరమణయ్యను సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఎస్కే కరిముల్లా అరెస్ట్ చేశారు. వారి నుంచి సింగిల్ బ్యారెల్ నాటు తుపాకీ, గన్‌పౌడర్, మోకులు(తాళ్లు), ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీని బుజబుజనెల్లూరు నక్కల కాలనీలో కన్నయ్య అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. నాగరాజు, వేణు పరారీలో ఉన్నారు. కాగా, నిందితులంతా టీడీపీకి చెందిన వారు. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలాకాలంగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిని కాపాడేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. -
ఆ తిండి విషయంలో మహిళలే ఎక్కువ
న్యూఢిల్లీ: ‘గోమాంసం లేదా మేక మాంసం కలిసిన తేనేరు (పోషక విలువల పేరిట గ్రీన్ టీలో గోమాంసం కలుపుతున్న విషయం తెల్సిందే) సేవించపోతే చనిపోతావని ఎవరైన వైద్యుడు సలహా ఇచ్చినా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. అది శాకాహారం పట్ల నాకున్న కట్టుబాటు’ అని జాతిపిత మహాత్మాగాంధీ లండన్ విజిటేరియన్ సొసైటీతో 1931, నవంబర్ 20న చేసిన వ్యాఖ్య. శాఖాహారాన్ని అంతగా ప్రేమించే గాంధీ కూడా ఎన్నడూ గోమాంసాన్ని తినే వారిని ద్వేశించలేదు. వారిని అంటరాని వారిగా చూడలేదు. నేడు గోమాంసం పేరిట హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశంలో మాంసాహారులు ఎంత మంది ఉన్నారో, శాకాహారాలు ఎంత మంది ఉన్నారో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ‘రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్’ 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో 29 మంది శాకాహారాలుండగా, 71 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జీవ హింస కూడదంటూ పెటా లాంటి సంస్థలు చేసిన ప్రచారం, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన విస్తత ప్రచారం కారణంగా 2004 నుంచి 2014 వరకు, పదేళ్ల కాలంలో దేశంలో నాలుగు శాతం శాకాహారులు పెరిగారు. అంటే మాంసాహారుల సంఖ్య 75 నుంచి 71కి తగ్గింది. శాకాహారులు వాయువ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణలు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. వారిలో శాకాహారులు తక్కువ. మగవారితో పోలిస్తే ఇటు మాంసాహారుల్లోగానీ, శాకాహారుల్లోగానీ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళదే పైచేయి. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, మగవాళ్లు 70.7 శాతం ఉన్నారు. ఎస్సీలో మాంసహారులు పురుషులు 76. 1 శాతంకాగా, మహిళలు 77.9శాతం, ఎస్టీల్లో పురుషులు 75.9 శాతంకాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారు. మాంసాహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం, తక్కువకు లభిస్తుండడం వల్ల ఎస్సీ,ఎస్టీలు, దిగువ కులాల వారు ఎక్కువగా మాంసహారాన్ని ఆశ్రయిస్తున్నారు. -
గోమాంసం అయితే ఏంటీ?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో గోమాంసం తిన్నారనే అనుమానంతో యాభై ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ను గతేడాది సెప్టెంబర్ నెలలో ఓ హిందూ అల్లరి మూక నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా గాయపరిచింది. వారి ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసం మటన్ కాదని, ఆవు లేదా లేగ దూడ మాంసమని ఎనిమిది నెలల తర్వాత ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది. ఈ విషయాన్ని ఈ రోజు అన్ని వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అది నిజంగా మటన్ కాకపోవచ్చు, ఆవు మాంసమే కావచ్చు. అయినంత మాత్రాన కేసులో ఏం తేడా వస్తుంది? మాంసం ఏదైనా హత్య హత్యేకదా? దాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకుంటారు? ఉత్తరప్రదేశ్‌లో అమల్లో ఉన్న గోరక్షణ చట్టం ప్రకారం గోవులను చంపడం మాత్రమే నేరం. దాని మాంసం కలిగి ఉండడం లేదా తినడం ఎలాంటి నేరం కాదు. అఖ్లాక్ తన ఇంట్లో టన్నుల కొద్ది గోమాంసాన్ని దాచుకున్నా, అది ఎంత మాత్రం నేరం కాదు. అది మటన్ కాదని, గో మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలడం హంతకులపై తాము దాఖలు చేసిన కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర పోలీసులు మంగళవారం తెలిపారు. అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసాన్ని అసలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాల్సిన అవసరమే చట్ట ప్రకారం లేదు. స్థానిక బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగి దాన్ని పరీక్షలకు పంపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులను ప్రశ్నించగా గోమాంసం కలిగివున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే తాము పరీక్షలకు పంపించాల్సి వచ్చిందని వారు చెప్పారు. అఖ్లాక్ కుటుంబ సభ్యులే గోమాంసాన్ని ఇంటి ముందున్న చెత్త కుప్పలో పడేసి ఉంటారా? అని ప్రశ్నించగా చెప్పలేమని, ఎవరైనా పడేసే అవకాశం లేకపోలేదని పోలీసులు చెప్పారు. తరచు మత కలహాలు చోటుచేసుకునే దాద్రిలో మసీదుల ముందు చంపిన పందులను, ఆలయాల ముందు గోమాంసాన్ని పడేయడం సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగానే గోమాంసాన్ని తీసుకొచ్చి అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో వేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా మాంసం ఏదన్నది కాదు ప్రశ్న. ఏది నేరమన్నదే ప్రశ్న. -
అది ఆవు కాదు బర్రె మాంసం బిర్యానీ!
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) క్యాంటీన్లో వడ్డించిన బిర్యానీ ఆవు మాంసంతో చేసింది కాదని, దానిని బర్రె (గెదే) మాంసంతో వండారని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆదివారం వివరణ ఇచ్చారు. ఏఎంయూ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డిస్తుండటంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. మైనారిటీ యూనివర్సిటీ అయిన ఏఎంయూలోని మెడికల్ కాలేజీ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వండుతున్నారని వాట్సాప్‌లో ఫొటోలు దర్శనమివ్వడం శుక్రవారం దుమారం రేపింది. బీఫ్ బిర్యానీ ఫొటోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ ఆరోపణలను వర్సిటీ వెంటనే ఖండించింది. 'నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. మత అలజడులు సృష్టించేందుకే వీటిని వ్యాప్తి చేస్తున్నారు. ఏఎంయూ క్యాంటీన్లో గెదే బిర్యానీ మాత్రమే లభిస్తుంది. ఆవు మాంసం ఎంతమాత్రం లేదు. ఈ విషయంలో మా తనిఖీలతో స్థానిక బీజేపీ ఎంపీ సైతం సంతృప్తి చెందారు' అని ఏఎంయూ వర్సిటీ వీసీ జమీర్ ఉద్దీన్ షా తెలిపారు. 'బీఫ్ బిర్యానీ' వడ్డిస్తున్న ఏఎంయూ క్యాంటీన్ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ మేయర్, పార్టీ నేతలు శనివారం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరోవైపు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్ గౌతం మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో బీఫ్ బిర్యానీని వండడం కానీ వడ్డించడం కానీ చేయడం లేదని వీసీ తెలిపారని, దీనిపై ఇంకా ప్రశ్నించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. -
బీఫ్ తిని వారికి బుద్ధి చెబుతా
బెంగళూరు : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'బీఫ్' వివాదంలోకి తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చేరారు. ఇప్పటివరకూ తాను గో మాంసాన్ని తినలేదని, అయితే బీజేపీ నాయకుల చర్యలను చూసి తాను ఇకనుంచి గోమాంసం తినాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో గురువారం సిద్దరామయ్య విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు గోమాంసం తినకూడదని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. బీఫ్ తిన్నవారిపై దాడులకు పాల్పడుతూ బీజేపీ నాయకులు అనాగరికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తింటే తప్పేంటి అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు. ఏ ఆహారం తీసుకోవాలన్నది వారి వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అందుకు గోమాంసం అతీతం కాదన్నారు. ప్రశ్నించడానికి బీజేపీ నేతలు ఎవరని ఆయన అన్నారు. బీజేపీ ఈ విషయాన్ని అనవసర రాద్దాంతం చేస్తోందని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకుల చర్యలను గమనిస్తే బీఫ్ తిని వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల చర్యలతో దేశంలో అభద్రతా భావం పెరుగుతోందన్నారు. ఇకనైనా కేంద్రం దేశ అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని సిద్ధరామయ్య హితవు పలికారు. -
'వాహ్ మోదీ!'
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. నల్లధనం వెలికితీయడానికి బదులుగా గోమాంసం ఎక్కడుందో వెతకడానికే పోలీసులను కేంద్రం ఉపయోగిస్తోందని ఆక్షేపించారు. 'బ్లాక్ మనీ ఎక్కడుందో కనిపెట్టేందుకు పోలీసులు దాడులు చేయడం లేదు. గోమాంసం కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. వాహ్ మోదీ!' అంటూ బృందా కారత్ ట్వీట్ చేశారు. గోమాంసం వడ్డిస్తున్నారనే ఫిర్యాదుతో ఢిల్లీలోని కేరళ హౌస్ లో సోమవారం పోలీసులు సోదాలు చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వండుకోవడానికి పప్పులు ఇవ్వలేని మోదీ సర్కారు ఆవు మాంసం కోసం పోలీసులతో వెతికిస్తోందని ధ్వజమెత్తారు. Brinda Karat: Police raids not to unearth black money but to unearth imaginary cow meat, vah Modi! #KeralaHouse — CPI (M) (@cpimspeak) October 28, 2015