బీఫ్ తిని వారికి బుద్ధి చెబుతా
బెంగళూరు : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'బీఫ్' వివాదంలోకి తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చేరారు. ఇప్పటివరకూ తాను గో మాంసాన్ని తినలేదని, అయితే బీజేపీ నాయకుల చర్యలను చూసి తాను ఇకనుంచి గోమాంసం తినాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో గురువారం సిద్దరామయ్య విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు
గోమాంసం తినకూడదని ఒత్తిడి తేవడం సరికాదన్నారు.
బీఫ్ తిన్నవారిపై దాడులకు పాల్పడుతూ బీజేపీ నాయకులు అనాగరికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తింటే తప్పేంటి అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు. ఏ ఆహారం తీసుకోవాలన్నది వారి వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అందుకు గోమాంసం అతీతం కాదన్నారు.
ప్రశ్నించడానికి బీజేపీ నేతలు ఎవరని ఆయన అన్నారు. బీజేపీ ఈ విషయాన్ని అనవసర రాద్దాంతం చేస్తోందని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకుల చర్యలను గమనిస్తే బీఫ్ తిని వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల చర్యలతో దేశంలో అభద్రతా భావం పెరుగుతోందన్నారు. ఇకనైనా కేంద్రం దేశ అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని సిద్ధరామయ్య హితవు పలికారు.