'బీఫ్ తినడం మా సంస్కృతి, సంప్రదాయం'
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ తీవ్ర నిర్ణయాలతో ముందుకెళ్తుండగా మేఘాలయాలో మాత్రం సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. గోమాసం(బీఫ్) పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఇటీవల బెర్నార్డ్ మారక్ పార్టీని వీడగా.. తాజాగా మరో షాకిస్తూ మరో కీలకనేత బాచు మారక్ బీజేపీకి రాజీనామా చేశారు. అంటితో ఆగకుండా.. ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలో పాల్గొని తన నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్ష పదవిలో బాచు మారక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
'మా పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీఫ్ (నకమ్ బిట్చి) మా సంప్రదాయ ఆహారమని' తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 'బీర్ అండ్ బీఫ్' పార్టీ చేసుకోవాలని పిలుపునిస్తూ ఫేస్ బుక్ లో ఇటీవల చేసిన పోస్టుపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పార్టీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. పార్టీ అధిష్టానం ఆయన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని సమాచారం. కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మారక్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
'2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌పై నిషేధం ఉండదు. సాధారణ ధరలకే అందరికీ బీఫ్ అందేలా చూడటమే తమ విధి అని.. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తామంటూ' బాచు మారక్ బీఫ్ నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో బీఫ్ నిషేధంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.