పశువధపై బీజేపీకి ఝట్కా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పశువధ నిషేధంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మరోవైపు బీజేపీకి సొంత పార్టీ నుంచి కూడా నిరసనలు తప్పడం లేదు. మేఘాలయకు చెందిన బీజేపీ నేత బెర్నార్డ్ మరక్ ఏకంగా పార్టీని వీడారు. కాగా మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను నిషేధించబోమని, పేదలకు బీఫ్‌ను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన రెండు రోజుల క్రితం వాగ్దానం చేశారు.
2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో కాంగ్రెస్ నుంచి అధికారం దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న మేఘాలయాలో బీఫ్‌ను స్థానికులు సహజసిద్ధమైన ఆహారంగా స్వీకరిస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను పేదలకు అందుబాటు ధరల్లో చేరువ చేస్తామని, గారో హిల్స్‌లోని కబేళాలను చట్టబద్ధం చేస్తామని బెర్నార్డ్ మరక్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే పశువధపై కేంద్రం తాజా నిర్ణయం బెర్నార్డ్‌కు తలనొప్పిగా మారింది. ఈ సందర్భంగా బెర్నార్డ్ మాట్లాడుతూ... బీజేపీని వీడేందుకు నిర్ణయించుకున్నానని, స్వతహాగా క్రిస్టియన్‌తో పాటు గారో తెగకు చెందిన తాను ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకమన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ యత్నిస్తోందని, బలవంతంగా హిందుత్వాన్ని రుద్దుతోందని అన్నారు. అయితే బెర్నార్డ్ మరక్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శిబున్ అన్నారు. తాము బీఫ్ తినేవారికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు.