అక్కడ పెద్దకూరపై నో నిషేధం: బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లో నూతన బీజేపీ ప్రభుత్వం అక్రమ గోవధశాలలపై ఉక్కుపాదం మోపుతోంది. గోడ్డుమాంసం కబేళాలు, అక్రమ మాంసం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఈ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైనా ప్రతిబింబిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరం, నాగాల్యాండ్‌లలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. క్రైస్తవ మెజారిటీ ప్రజలున్న ఈ రాష్ట్రాల్లో పశుమాంసాన్ని అధికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే బీఫ్‌పై నిషేధం తప్పదంటూ పెద్ద ఎత్తున వదంతులు చేలరేగుతున్నాయి.
దీంతో ఈశాన్య రాష్ట్రాలలో తాము అధికారంలోకి వస్తే బీఫ్ నిషేధాన్ని అమలుచేసే ప్రసక్తే లేదని బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్‌పై నిషేధం విధిస్తారన్న ప్రచారం వట్టిదేనని, స్వార్థరాజకీయ ప్రయోజనాలతోనే కొన్ని గ్రూపులు ఈ వదంతులను ప్రచారం చేస్తున్నాయని మేఘాలయా బీజేపీ చీఫ్ డేవిడ్ ఖర్సాటి స్పష్టం చేశారు. యూపీలో బీఫ్ నిషేధ ప్రభావం తమ రాష్ట్రాలపై ఉండబోదని, ఇక్కడ పశుమాంసంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలీ లౌంగు మీడియాకు తెలిపారు. మేఘాలయా, మిజోరంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో బీజేపీ మిత్రపక్షంగా ఉంది.