ఒక్కో తలపై రూ.35 వేల అప్పు
⇒ రాష్ట్ర రుణభారం రూ.2.42 లక్షల కోట్లు
⇒ విచ్చలవిడిగా సిద్ధు సర్కారు అప్పులు
⇒ విధానసభలో బీజేపీ పక్ష నేత శెట్టర్
బెంగళూరు: సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అప్పుల ఊబిలోకి తోసేస్తోందని విధానసభలో బీజేపీ పక్ష నేత జగదీష్ శెట్టర్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.2,42,420 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని ఒక్కొక్కరి తల పై రూ.32 – 35వేల అప్పు ఉందని ఆయన చెప్పారు. బుధవారం విధానసభలో శెట్టర్ మాట్లాడుతూ సర్కారు ఆర్థిక నిర్వహణపై దుమ్మెత్తిపోశారు. ఎస్.ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటకలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు కోసం రూ.35,902 కోట్లను రుణంగా తీసుకుందన్నారు.
ధరంసింగ్ సీఎంగా ఉండగా ఈ మొత్తం రూ.15,635 కోట్లు కాగా కుమారస్వామి హయాంలో రూ.3,545 కోట్లు మాత్రమే రుణంగా కర్ణాటక పొందిందన్నారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో రూ.25,653 కోట్లు, సదానందగౌడ సమయంలో రూ.9,357 కోట్లు, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.13,464 కోట్లు రుణంగా తీసుకున్నానన్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హయాంలో అభివృద్ధి పేరుతో అవసరం లేకపోయినా ఎక్కువగా రుణాలను పొందుతోందన్నారు. దీంతో గత నాలుగేళ్లలో రూ.2,42,420 కోట్ల రుణాలను పొందారన్నారు. ఈ రుణభారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోందన్నారు. అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని అప్పుడు ఆర్థిక క్రమశిక్షణ తప్పక పాటిస్తామని ఆయన చెప్పారు.
అటవీశాఖలో కోట్ల అక్రమాలు
రాష్ట్ర అటవీశాఖలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హుబ్లీ అటవీ విభాగంలోనే చెట్లు నాటే కార్యక్రమంలో రూ.6 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్నారు. మిగిలిన అన్ని వలయాల్లోని అక్రమాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం వందల కోట్లలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు కాగ్ నివేదికలో పేర్కొందన్నారు. ఈ విషయలన్నింటి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.