గోమాంసం అయితే ఏంటీ?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో గోమాంసం తిన్నారనే అనుమానంతో యాభై ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్‌ను గతేడాది సెప్టెంబర్ నెలలో ఓ హిందూ అల్లరి మూక నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా గాయపరిచింది. వారి ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసం మటన్ కాదని, ఆవు లేదా లేగ దూడ మాంసమని ఎనిమిది నెలల తర్వాత ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది. ఈ విషయాన్ని ఈ రోజు అన్ని వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అది నిజంగా మటన్ కాకపోవచ్చు, ఆవు మాంసమే కావచ్చు. అయినంత మాత్రాన కేసులో ఏం తేడా వస్తుంది? మాంసం ఏదైనా హత్య హత్యేకదా? దాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకుంటారు?
ఉత్తరప్రదేశ్‌లో అమల్లో ఉన్న గోరక్షణ చట్టం ప్రకారం గోవులను చంపడం మాత్రమే నేరం. దాని మాంసం కలిగి ఉండడం లేదా తినడం ఎలాంటి నేరం కాదు. అఖ్లాక్ తన ఇంట్లో టన్నుల కొద్ది గోమాంసాన్ని దాచుకున్నా, అది ఎంత మాత్రం నేరం కాదు. అది మటన్ కాదని, గో మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలడం హంతకులపై తాము దాఖలు చేసిన కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర పోలీసులు మంగళవారం తెలిపారు. అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసాన్ని అసలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాల్సిన అవసరమే చట్ట ప్రకారం లేదు. స్థానిక బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగి దాన్ని పరీక్షలకు పంపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులను ప్రశ్నించగా గోమాంసం కలిగివున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే తాము పరీక్షలకు పంపించాల్సి వచ్చిందని వారు చెప్పారు.
అఖ్లాక్ కుటుంబ సభ్యులే గోమాంసాన్ని ఇంటి ముందున్న చెత్త కుప్పలో పడేసి ఉంటారా? అని ప్రశ్నించగా చెప్పలేమని, ఎవరైనా పడేసే అవకాశం లేకపోలేదని పోలీసులు చెప్పారు. తరచు మత కలహాలు చోటుచేసుకునే దాద్రిలో మసీదుల ముందు చంపిన పందులను, ఆలయాల ముందు గోమాంసాన్ని పడేయడం సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగానే గోమాంసాన్ని తీసుకొచ్చి అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో వేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా మాంసం ఏదన్నది కాదు ప్రశ్న. ఏది నేరమన్నదే ప్రశ్న.