కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది.
ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్‌ఎస్‌ఎస్ ఊహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్‌ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్‌బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
పోలీసులకు విస్తృత అధికారాలా?
బీఎన్‌ఎస్‌ఎస్‌కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్‌ఎస్‌ఎస్‌లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్‌ఎస్‌ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు.
అయితే బీఎన్‌ఎస్‌ఎస్‌లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్‌ఎస్‌ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి.
ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్‌ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్‌ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్‌ఎస్‌లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్‌ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది.
‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్‌ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్‌ఎస్–2 కూడా ఉంది.
అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్‌ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్‌ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన.
చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్‌ఎస్‌ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం.
కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి
అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్‌తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్‌లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది.
నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము.
మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది.
– అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా
వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment