పొదలకూరు : ఆవులను చంపి మాంసం విక్రయించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి వివరాలు వెల్లడించారు. పొదలకూరు మండలం చాటగొట్లకు చెందిన కడివేటి భాస్కర్, నల్లబాలెం సురేంద్ర, నల్లబాలెం కిశోర్, నల్లబాలెం వెంకటరమణయ్య, నాగరాజు, వేణులు ముఠాగా ఏర్పడి మరుపూరు, చాటగొట్ల అటవీ ప్రాంతంలో సంచరించే ఆవులను చంపి మాంసాన్ని కిలో రూ.150 వంతున అమ్ముతున్నారు.
మరుపూరు ఎస్సీ కాలనీకి చెందిన పెంచలమ్మ దొడ్డిలోని ఆవును ఈ నెల 17వ తేదీ రాత్రి అడవిలోకి తీసుకెళ్లి చంపి మాంసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తన ఆవు కనిపించడం లేదని పెంచలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగలాగితే డొంక కదలినట్టు కొంతకాలంగా ఈ ముఠా గోవులను చంపి మాంసాన్ని అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. మార్చి నెలలో నిందితులు సంగం, నెల్లూరు రోడ్డు అటవీ ప్రాంతంలో నాలుగు ఆవులను నాటు తుపాకీతో చంపి మాంసాన్ని అమ్ముకున్నారు. ఈ విధంగా 30 ఆవులను చంపారు.
భాస్కర్, సురేంద్ర, కిశోర్, వెంకటరమణయ్యను సీఐ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ ఎస్‌కే కరిముల్లా అరెస్ట్ చేశారు. వారి నుంచి సింగిల్ బ్యారెల్ నాటు తుపాకీ, గన్‌పౌడర్, మోకులు(తాళ్లు), ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీని బుజబుజనెల్లూరు నక్కల కాలనీలో కన్నయ్య అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. నాగరాజు, వేణు పరారీలో ఉన్నారు. కాగా, నిందితులంతా టీడీపీకి చెందిన వారు. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలాకాలంగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిని కాపాడేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment