Dadri incident
-
గోమాంసం అయితే ఏంటీ?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో గోమాంసం తిన్నారనే అనుమానంతో యాభై ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ను గతేడాది సెప్టెంబర్ నెలలో ఓ హిందూ అల్లరి మూక నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా గాయపరిచింది. వారి ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసం మటన్ కాదని, ఆవు లేదా లేగ దూడ మాంసమని ఎనిమిది నెలల తర్వాత ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది. ఈ విషయాన్ని ఈ రోజు అన్ని వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అది నిజంగా మటన్ కాకపోవచ్చు, ఆవు మాంసమే కావచ్చు. అయినంత మాత్రాన కేసులో ఏం తేడా వస్తుంది? మాంసం ఏదైనా హత్య హత్యేకదా? దాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకుంటారు? ఉత్తరప్రదేశ్లో అమల్లో ఉన్న గోరక్షణ చట్టం ప్రకారం గోవులను చంపడం మాత్రమే నేరం. దాని మాంసం కలిగి ఉండడం లేదా తినడం ఎలాంటి నేరం కాదు. అఖ్లాక్ తన ఇంట్లో టన్నుల కొద్ది గోమాంసాన్ని దాచుకున్నా, అది ఎంత మాత్రం నేరం కాదు. అది మటన్ కాదని, గో మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలడం హంతకులపై తాము దాఖలు చేసిన కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర పోలీసులు మంగళవారం తెలిపారు. అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసాన్ని అసలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాల్సిన అవసరమే చట్ట ప్రకారం లేదు. స్థానిక బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగి దాన్ని పరీక్షలకు పంపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులను ప్రశ్నించగా గోమాంసం కలిగివున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే తాము పరీక్షలకు పంపించాల్సి వచ్చిందని వారు చెప్పారు. అఖ్లాక్ కుటుంబ సభ్యులే గోమాంసాన్ని ఇంటి ముందున్న చెత్త కుప్పలో పడేసి ఉంటారా? అని ప్రశ్నించగా చెప్పలేమని, ఎవరైనా పడేసే అవకాశం లేకపోలేదని పోలీసులు చెప్పారు. తరచు మత కలహాలు చోటుచేసుకునే దాద్రిలో మసీదుల ముందు చంపిన పందులను, ఆలయాల ముందు గోమాంసాన్ని పడేయడం సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగానే గోమాంసాన్ని తీసుకొచ్చి అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో వేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా మాంసం ఏదన్నది కాదు ప్రశ్న. ఏది నేరమన్నదే ప్రశ్న. -
'ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదని, దేశ నైతిక ప్రమాణాలకు ఆయన నిదర్శనంగా నిలబడాలని సూచించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే 'దాద్రి' ఘటనపై మోదీ మౌనం దాల్చారని ఆరోపించారు. 'ప్రధాని అంటే హోమియోపతి డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటూ కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. నైతిక మార్గంలో నడుస్తూ ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది' అని అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. అసహనం పెరిగిపోవడం, గోమాంసం వివాదం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు కొనసాగింపుగా ఎన్డీఏ పాలన ఉందని అంతకుముందు విమర్శించారు. బిహార్ ఓట్ల కోసం దాద్రి ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహిస్తే.. ఆయన మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం దాద్రి చిచ్చు చల్లారకుండా చూస్తున్నారని ఆరోపించారు. 2002 నుంచి అసహనానికి ఎక్కువగా గురైంది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై శౌరి స్పందించారు. మోదీని గుడ్డిగా వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నవారి వెనుక రాజకీయ శక్తులున్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. -
'ఆయనను హీరోగా భావిస్తున్నారు'
లక్నో: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆక్షేపించారు. దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. దీన్ని ప్రపంచమంతా ఖండించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రకటన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. 'సైతాన్' పదాన్ని ప్రధాని మోదీ చాలా తేలిగ్గా వాడారని, కానీ ఆయన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధంగా ఉన్న ఇతర పార్టీలు నరేంద్ర మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని ఆజం ఖాన్ అన్నారు. యూపీలోని బిసడ గ్రామంలో గోవు మాంసం నిల్వచేశారనే ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని దుండగులు హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ప్రకటనలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దాద్రి ఘటన దురదృష్టకరమంటూ ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఆజం ఖాన్ వ్యాఖ్యలు చేశారు.