'ఆయనను హీరోగా భావిస్తున్నారు'
లక్నో: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆక్షేపించారు. దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. దీన్ని ప్రపంచమంతా ఖండించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రకటన చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
'సైతాన్' పదాన్ని ప్రధాని మోదీ చాలా తేలిగ్గా వాడారని, కానీ ఆయన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధంగా ఉన్న ఇతర పార్టీలు నరేంద్ర మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని ఆజం ఖాన్ అన్నారు.
యూపీలోని బిసడ గ్రామంలో గోవు మాంసం నిల్వచేశారనే ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని దుండగులు హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ప్రకటనలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దాద్రి ఘటన దురదృష్టకరమంటూ ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఆజం ఖాన్ వ్యాఖ్యలు చేశారు.