'ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదని, దేశ నైతిక ప్రమాణాలకు ఆయన నిదర్శనంగా నిలబడాలని సూచించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే 'దాద్రి' ఘటనపై మోదీ మౌనం దాల్చారని ఆరోపించారు.
'ప్రధాని అంటే హోమియోపతి డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటూ కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. నైతిక మార్గంలో నడుస్తూ ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది' అని అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. అసహనం పెరిగిపోవడం, గోమాంసం వివాదం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు కొనసాగింపుగా ఎన్డీఏ పాలన ఉందని అంతకుముందు విమర్శించారు.
బిహార్ ఓట్ల కోసం దాద్రి ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహిస్తే.. ఆయన మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం దాద్రి చిచ్చు చల్లారకుండా చూస్తున్నారని ఆరోపించారు. 2002 నుంచి అసహనానికి ఎక్కువగా గురైంది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై శౌరి స్పందించారు. మోదీని గుడ్డిగా వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నవారి వెనుక రాజకీయ శక్తులున్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.