సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో స్పష్టత కొరవడింది. ఆత్మహత్యనా? ఇతరత్రా ఏమైనా జరిగిందా? అనే అనుమానంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఓ వైపు ప్రీతిది హత్యేనంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇంకోవైపు టాక్సికాలజీ రిపోర్టు అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. అయితే.. ఎఫ్‌ఎస్‌ఎల్(Forensic Science Laboratory) రిపోర్టు వస్తేనే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తుండడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది.
దీంతో కేసు చిక్కుముడి వీడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఎదురు చూస్తున్నారంతా. మరోవైపు నిందితుడైన ఎం.ఎ.సైఫ్‌ను 4 రోజులు కస్టడీలో విచారించిన మట్టెవాడ పోలీసులు.. మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయడంతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు.
ఇంకా క్లారిటీ రాలేదా?
ప్రీతితో గొడవకు దారితీసిన పరిస్థితులతోపాటు ఆమెను వేధించడానికి ఎవరెవరి సహాయాన్ని తీసుకున్నాడన్న దానిపై నిందితుడు సైఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. టెక్నికల్ డేటాను కూడా సైఫ్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విష రసాయనాలు ఏమీ తీసుకోలేదని టాక్సికాలజీ రిపోర్టు చెబుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సైఫ్‌ను మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులో పిటిషన్ వేశారు. ఈ 4 రోజుల కస్టడీలోనూ సైఫ్ పోలీసులకు చెప్పిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో మళ్లీ కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది.
కీలకంగా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్
ప్రీతి కేసులో వేధింపులు, ర్యాగింగ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించినా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టాక్సికాలజీ రిపోర్టులో ఏ విష రసాయనం తీసుకున్నట్టు లేదని నివేదిక వచ్చిందని చక్కర్లు కొడుతున్న వార్తలతో అసలు ప్రీతిది ఆత్మహత్య కాదా...మరేమైనా జరిగిందా అనే దిశగా పోలీసు విచారణ మారినట్టు తెలిసింది. ప్రీతి ఆత్మహత్య కేసును కాస్త అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎఫ్‌ఎల్‌ఎస్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment