warangal police
-
TS Election 2023: 'వివాదాస్పద బదిలీలపై' ఎన్నికల సంఘం ఆరా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. పైరవీలతో కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై బదిలీ కత్తి వేలాడుతోంది. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీస్ అధికారుల బదిలీల్లో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 మంది ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీల వరకు ఈ తరహా పోస్టింగ్‌లు పొందారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాశ్‌కుమార్‌కు, సంబంధిత అధికారులకు లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్‌ఓయు3/ 2023 ద్వారా రాశారు. వరంగల్ కమిషనర్‌తోపాటు మహబూబాబాద్, ములుగు ఎస్పీలు బదిలీల్లో నిబంధన ఉల్లంఘన లేదంటూ వివరాలు పంపారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు కావొస్తుండగా.. తాజాగా బుధవారం వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, మహబూబాబాద్, భూపాలపల్లి ఎస్పీలు చంద్రమోహన్, పుల్లా కరుణాకర్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు, రెవెన్యూ అధికారులపైనా త్వరలోనే బదిలీ వేటు పడనుందన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ఉల్లంఘనపై ఈసీఐ ఆరా.. వరంగల్ సీపీ, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎస్పీలపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రెవెన్యూ, పోలీసుశాఖల్లో జరిగిన అన్ని బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని జూన్‌లోనే కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పంపింది. అందుకు విరుద్ధంగా నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అనేక మంది తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందారు. ఈతరహాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 27 మంది పోస్టింగ్‌లు పొందినట్లు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వమైన ఫిర్యాదులు అందాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎమ్మెల్యేల సిఫారసుల కారణంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణకు మరోసారి గురువారం ఎన్నికల సంఘం ఆదేశించడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ‘రెవెన్యూ’లోనూ ఇదే తంతు.. మరోవైపు రెవెన్యూలోనూ అదే పరిస్థితి నెలకొంది. హనుమకొండ ఆర్డీఓగా రెండున్నర సంవత్సరాలకు పైగా పని చేసిన వాసుచంద్రను ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలోకి వస్తారని మొదట హైదరాబాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు గ్రేటర్ వరంగల్ పరిధిలోకి వస్తాయి కూడా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బదిలీ చేసిన ఐదారు రోజులకే ఆయనను వరంగల్ జిల్లాలో ఆర్డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధితోపాటు మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నట్లు రెవెన్యూశాఖలోని కొందరు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన చాలామంది తహసీల్దార్లు పొరుగు జిల్లా అయిన వరంగల్‌కు బదిలీ అయ్యారు. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక జిల్లాలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు వరంగల్‌కు బదిలీ అయినా పాత నియోజకవర్గంలోకే మళ్లీ వచ్చారు. ఇలా జరిగిన చాలా బదిలీలు, పోస్టింగ్‌లపైనా ఎన్నికల సంఘం ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎందరిపై బదిలీ వేటు పడుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ► ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి అదే కమిషనరేట్ పరిధిలోని నర్సంపేటకు ఏసీపీగా పి.తిరుమల్ బదిలీ అయ్యారు. పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిశోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. సి.సతీశ్‌ను జూలై 15న మామునూరు ఏసీపీగా నియమించారు. గతంలో దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పని చేశారు. ఇది ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది. ► మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను అదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ► ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్ దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 మంది పోస్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో వీరిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. -
మెడికో ప్రీతి కేసులో ఎట్టకేలకు ఛార్జ్‌షీట్
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చకు దారితీసిన.. మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ప్రీతి గత నవంబర్‌లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది. చివరకు ఫిబ్రవరి 22వ తేదీన ఎంజీఎంలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది అని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే.. సైఫ్ వేధింపులే కారణమని ఛార్జిషీట్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను సైతం ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ‘‘ప్రీతి మృతిపై U/s.306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సైంటిఫిక్ , టెక్నికల్ , మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు(బాధితురాలు).. నిందితుడు, వాళ్ల వాళ్ల మిత్రులు వాడిన సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం అని ప్రకటించారు సీపీ రంగనాథ్. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై కన్నుమూసింది. ఈ కేసులో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కాగా.. దాని ఫలితాన్ని ఏప్రిల్‌లో ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని వెల్లడించారు. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు జూన్‌లో ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండడం గమనార్హం. -
దేశంలోనే రిచస్ట్ పార్టీ బీఆర్ఎస్.. ఈటల సంచలన కామెంట్స్
సాక్షి, వరంగల్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం, కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక, ఈ వ్యవహరంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను పోలీసులు సోమవారం విచారించారు. పేపర్ లీక్ కేసులో ఈటలను పోలీసులు ప్రశ్నించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ.. ఈటలను గంటపాటు విచారించారు. కాగా, విచారణ అనంతరం ఈటల సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కుట్రపూరితంగానే నాపై మోపుతున్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. ప్రగతిభవన్ డైరెక్షన్లోనే మాపై కేసులు నమోదు చేశారు. దేశంలోనే రిచస్ట్ పార్టీ బీఆర్ఎస్. సొమ్ము తెలంగాణ ప్రజలది.. సోకు కేసీఆర్‌ది. 22 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగా గల పౌరుడిగా ఉన్నాను. కుట్రపూరితంగా నాపై పేపర్ లీక్ కేసు పెట్టారు. ఇది పేపర్ లీక్ కాదు.. మాల్ ప్రాక్టీస్ అంటారు. టీఎస్పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పదో తరగతి పేపర్ లీక్‌ను తెరపైకి తెచ్చారు. చట్టం మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తిని నేను అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. -
ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు?
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో స్పష్టత కొరవడింది. ఆత్మహత్యనా? ఇతరత్రా ఏమైనా జరిగిందా? అనే అనుమానంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఓ వైపు ప్రీతిది హత్యేనంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇంకోవైపు టాక్సికాలజీ రిపోర్టు అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. అయితే.. ఎఫ్ఎస్ఎల్(Forensic Science Laboratory) రిపోర్టు వస్తేనే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తుండడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో కేసు చిక్కుముడి వీడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఎదురు చూస్తున్నారంతా. మరోవైపు నిందితుడైన ఎం.ఎ.సైఫ్‌ను 4 రోజులు కస్టడీలో విచారించిన మట్టెవాడ పోలీసులు.. మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయడంతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఇంకా క్లారిటీ రాలేదా? ప్రీతితో గొడవకు దారితీసిన పరిస్థితులతోపాటు ఆమెను వేధించడానికి ఎవరెవరి సహాయాన్ని తీసుకున్నాడన్న దానిపై నిందితుడు సైఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. టెక్నికల్ డేటాను కూడా సైఫ్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విష రసాయనాలు ఏమీ తీసుకోలేదని టాక్సికాలజీ రిపోర్టు చెబుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సైఫ్‌ను మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులో పిటిషన్ వేశారు. ఈ 4 రోజుల కస్టడీలోనూ సైఫ్ పోలీసులకు చెప్పిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో మళ్లీ కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. కీలకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రీతి కేసులో వేధింపులు, ర్యాగింగ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించినా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టాక్సికాలజీ రిపోర్టులో ఏ విష రసాయనం తీసుకున్నట్టు లేదని నివేదిక వచ్చిందని చక్కర్లు కొడుతున్న వార్తలతో అసలు ప్రీతిది ఆత్మహత్య కాదా...మరేమైనా జరిగిందా అనే దిశగా పోలీసు విచారణ మారినట్టు తెలిసింది. ప్రీతి ఆత్మహత్య కేసును కాస్త అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎఫ్ఎల్ఎస్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. -
ప్రీతి కేసు: ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది మెడికో ధరావత్ ప్రీతి(26). ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రీతి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నివేదిక ఇప్పుడు వరంగల్ పోలీసులకు చేరింది. ప్రీతి ఉదంతంలో ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంజెక్షన్లతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత చికిత్స అందించిన వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని, ఎవరో ఇంజెక్షన్లు చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌లను సైతం వరంగల్ పోలీసులు తెప్పించుకున్నారు. ఇక ఫోరెన్సిక్ నివేదికలో ఏం ఉంది, పోలీసులు ఏం ప్రకటిస్తారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఈ నివేదిక ఆధారంగా స్పష్టమైన ప్రకటనతో అనుమానాలకు తెర దించనున్నారు వరంగల్ పోలీసులు. సాక్షి, వరంగల్: మరోవైపు.. మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు ఏసీపీ బోనాల కిషన్. రెండు రోజుల విచారణలో కీలకాంశాలే సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లను.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ సైఫ్‌ను విచారిస్తున్నారు. కస్టడీ గడువు ముగిసేలోపు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. -
బండి సంజయ్‌కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారని వర్దన్నపేట ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శాంతి భద్రతల దృష్ట్యా నోటీసులు జారీ చేశామని తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చదవండి: అరెస్టుపై బండి సంజయ్ సూటి ప్రశ్న.. ఫోన్ చేసి ఆరా తీసిన అమిత్ షా మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్, బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. తమ పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నారో.. అక్కడి నుండే మళ్లీ మొదలుపెడతానని సవాల్ చేశారు. కచ్చితంగా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ హైకోర్టుకు బీజేపీ ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ న్యాయ పోరాటానికి దిగింది. పాదయాత్రను నిలిపి వేయాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరుపున హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.దీంతో రేపు మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఓవైపు పోలీసుల నోటీసులు మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలతో బండి సంజయ్ యాత్ర ముందుకు సాగుతుందా? లేక బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
వరంగల్: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది అజహర్ అరెస్ట్
సాక్షి, వరంగల్ జిల్లా: హన్మకొండ గాంధీనగర్‌లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అజహర్‌పై హత్యాయత్నంతో పాటు బెదిరింపు వేధింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు(శనివారం) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉండగా ప్రేమోన్మాది ఘాతుకంతో గాయపడిన అనూషకు వరంగల్ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా హనుమకొండ గాంధీనగర్‌లో శుక్రవారం ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడిన విషయం విదితమే. ప్రియురాలు గొంతుకోసి పారిపోయాడు. నర్సంపేట మండలం లక్నేపల్లికి కి అనూష కేయులో ఎంసిఏ ఫైనలియర్ చదువుతూ, హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఎంసిఏ ఎగ్జామ్ ఉండడంతో గాంధీనగర్‌లో కుంటుంబ సభ్యుల వద్దకు వచ్చింది. చదవండి Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. అనూష వచ్చిన విషయం తెలుసుకున్న అజహర్ ఆమెను వెంబడించి చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. తాను పనికి వెళ్లి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయిందని విద్యార్థిని తల్లి రేణుక విలపించింది. తన కుమారుడు మూడేళ్ల క్రితం కేన్సర్‌తో మృతి చెందాడని, ఇప్పుడిలా జరిగిందంటూ ఆమె రోదించింది. -
క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు మింగేసిన పోలీస్..
-
క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయ తిన్న పోలీస్.. హిజ్రాతో పాటు ముగ్గురిని..
సాక్షి, వరంగల్: ఓపక్క టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు మూఢ నమ్మకలకు ముగింపు పలకలేకపోతున్నాం. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కాకతీయ కాలనీ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దీంతో భయాందోళనతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలను భగ్నం చేసి హిజ్రాతో పాటు ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరంగల్ పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహాన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. రోడ్డుపై కోడిగుడ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. దీంతో విషయం తెలుసుకున్న వరంగల్ పోలీసులు.. బ్రిడ్జిపై పూజలు చేసి వదిలేసిన కొబ్బరికాయలు, కోడిగుడ్లు, నిమ్మ కాయలు, పూజ సామగ్రిని ఒక్కచోటకు చేర్చారు. ప్రజలు చూస్తుండగానే నారాయణ అనే హోం గార్డ్ కోడి గుడ్డును గుటుక్కున మింగేశాడు. కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరి నీళ్లని తాగాడు. అంతేకాదు పూజలు చేసిన ఆ నిమ్మకాయలను కోసి నిమ్మరసం తాగేశాడు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ -
సినిమాను మించిన మర్డర్: మూడు హత్యలతో ఉలిక్కిపడిన వరంగల్
అంతా.. 15 నిమిషాల్లోనే జరిగిపోయింది. పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్ రంపం.. మూడు హత్యలు.. ఒకరకంగా అతను ఊచకోత కోశాడు. కొత్త ఇల్లు రక్తసిక్తమైంది. వరంగల్నగరం ఎల్బీనగర్లో తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన చాంద్ పాషా, అతడి భార్య సాబీరా, బావమరిది ఖలీల్‌ను కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసబెట్టి నిందితుడు ఎండీ షఫీ హతమార్చాడు. 2.20 నుంచి 2.35 నిమిషాల వ్యవధిలోనే మూడు హత్యలు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది. సాక్షి, వరంగల్ / ఎంజీఎం/ వరంగల్ క్రైం: తల్లిదండ్రులను తన కళ్లెదుటే కత్తులతో నరకడం.. అడ్డుకోబోయిన మేనమామను క్షణాల్లో మట్టుబెట్టడం.. తోడబుట్టిన తమ్ముళ్లపై పైశాచికంగా కత్తులతో దాడి చేయడం చూసిన ఆ యువతి గుండె పగిలిపోయింది.. కాపాడండి అంటూ ఆ క్షణం గొంతెత్తి అరిచింది. ఒక పక్క తల్లిదండ్రులు, మేనమామ రక్తం మడుగులో కొట్టుకొంటుకుంటుగా తమ్ముళ్ల రోదనలు చెవుల్లో మార్మోగాయి. బాబాయ్ వెంట వచ్చిన కిరాయి గుండాలు రక్త బీభత్సం సృష్టించి బయట పడ్డారు. వరంగల్ ఎల్బీనగర్లో జరిగిన దారుణ హత్య సంఘటనతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్త ఇల్లే హత్యకు కారణమైందా? చాంద్‌పాషా, షఫీ అన్నదమ్ములు. 20 ఏళ్లుగా పశువుల క్రయ విక్రయాలు చేస్తూ గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఇందులో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. రెండు, మూడుసార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగినా.. లావాదేవీలు షఫీ చూసేవాడని, అతనే కట్టాలని చాంద్‌పాషా చెప్పుకొచ్చాడు. ఎల్బీనగర్లో సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా ఏడాది కిందట కొత్త ఇంటిని నిర్మించాడు. అన్న తనకు అప్పులు వేసి, అతను మాత్రం డబ్బులు లేవంటూనే కోటి రూపాయలతో కొత్త ఇల్లు ఎలా కట్టుకున్నాడు. తనను మోసం చేసి డబ్బులు మిగుల్చుకున్నాడని కోపం పెంచుకున్నాడు. తనకు అప్పుల భారం తీవ్రమైందని, ఆదుకోవాలని అన్నావదినలను కోరినా వారు వినకపోవడంతో కోపం కాస్త కసిగా మారి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. చనిపోయారని వెళ్లిపోయారు.. చాంద్‌పాషా, సాబీరా, ఖలీల్‌లను చంపాక చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు వచ్చారు. వారిని కూడా విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో పడిపోవడంతో చనిపోయారని భావించి వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత వారిలో చలనం ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడిలో పాల్గొన్నది స్నేహితులే.. ముగ్గురి హత్యలో పాల్గొన్న వారిలో ప్రధాన నిందితుడు షఫీకి సంబంధించిన స్నేహితులు, సేవకులు ఉన్నట్లు సమాచారం. వీరికి, చాంద్‌పాషాకు చాలాఏళ్లుగా పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం. వీరి పశువులు, మాంసం వ్యాపారంలో సుమారు 10 సంవత్సరాల పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు షఫీ డ్రైవర్ కూడా ఈ హత్యల సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. చాంద్‌పాషా ఇల్లు కట్టుకునే సమయంలో నిందితుడు షఫీ దగ్గర ఉండి కట్టించాడు. ఆ ఇంట్లో అణువణువూ అతనికి తెలుసు. హత్య ఘటనలో పాల్గొన్న వారిలో ఒకరు పరకాల ప్రాంతానికి చెందిన నిందితుడు ఉండగా, మరొకరు నర్సంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైంది.. చాంద్‌పాషా (50), సాబీరా (42) (భార్య), ఖలీల్ (40) చాంద్‌పాషా బావమరిది క్షతగాత్రులు: చాంద్‌పాషా కుమారులు సమద్(21), ఫహాద్ (28) క్షణాల్లో ప్రాణాలు పోయాయి.. దుండగులు కత్తులతోపాటు దాడిలో రంపాన్ని వినియోగించడం వల్ల ఆ.. ముగ్గురు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయారు. చాంద్‌పాషా మెడను రంపంతో కోశారు. భుజాలు, చేతులపై పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. మెడ భాగం పూర్తిగా కట్ అయి ఉంది. ముఖంపై పడిన కత్తిపోటుతో ముక్కు వరకు తెగింది. ఖలీల్‌పాషాకు గొంతు దగ్గర రంపంతో కోశారు. తల.. మొండం వేరు పడలేదు కానీ రెండింటి మధ్య పెద్ద ఖాళీ స్థలం ఏర్పడింది. చిన్నపాటి కాలువ మాదిరిగా మృత దేహాలపై గుర్తులు ఉండిపోయాయి. సాబీరా బేగం ముఖంపై పదునైన కత్తిపోటు పడింది. మెడపై రంపంతో కోసినట్లు ఉంది. ముగ్గురి మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రి లో బుధవారం పోస్టుమార్టం నిర్వహించా రు. చాంద్‌పాషా కూతురు రూబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ తెలిపారు. నింది తులపై 302, 307, 460 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు ఘటనలో గాయపడి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమద్, ఫహాద్‌ను సోదరి రూబీనా బేగం స్థానికులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తరలించారు. ఎప్పుడు ఏమి జరిగిందంటే.. మంగళవారం అర్ధరాత్రి 1.45 : షఫీతోపాటు స్నేహితులు పీకల దాకా మద్యం తాగారు. 2.05 : ఆటోలో అందరూ ఎల్బీనగర్కు చేరుకున్నారు. 2.05 నుంచి 2.20 : ఎలక్ట్రిక్ రంపంతో చాంద్‌పాషా ఇంటి తలుపుల కింది భాగంలో సగం వరకు షఫీ కోశాడు. 2.20 : రంపం శబ్దం విని నిద్ర నుంచి లేచివచ్చిన చాంద్‌పాషా ఛాతిపై రఫీ రంపంతో కోశాడు. పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత శరీరంలోకి పలుమార్లు కత్తితో పొడిచాడు. 2.23 : నిద్ర నుంచి లేచి అడ్డుకోబోయిన బావమరిది ఖలీల్ శరీరం ముందు భాగంలోకి పలుమార్లు పొడిచాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు ఖలీల్‌ను విచక్షణారహితంగా నరికాడు. 2.25 : వీరి అరుపులు విని నిద్రలేచిన వదిన సాబీరాను కూడా పదునైన కత్తితో పొడిచి చంపాడు. 2.28 : ఈ రక్తపు మడుగుల్లో పడి ఆర్తనాదాలు చేస్తుండగా చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు లేచి వచ్చారు. వారిపై అదే పదునైన కత్తితో పొడిచాడు. దీంతో కుప్పకూలిపోయారు. 2.35 : షఫీతోపాటు నిందితులు వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్లిపోయారు. -
కరోనా చికిత్సకు వచ్చి చిక్కిన మావోయిస్టులు
సాక్షి, వరంగల్: అడవుల్లో ఉండే అన్నలు కరోనా బారినపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్‌లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి పేర్లు గడ్డం మధుకర్, వినయ్ అని తెలిపారు. మరో 12 మంది మావోయిస్టులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం ఉందని కమిషనర్ చెప్పారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన్యంలో ఉంటున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ -
టీపీఎఫ్ నాయకుల అరెస్ట్
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన టీపీఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గొల్లూరి ప్రవీణ్‌కుమార్, టీపీఎఫ్ సభ్యుడు ఉగ్గె శేఖర్ అలియాస్ శంకర్‌తో పాటు కమలాపూర్ మండలం కానిపర్తికి చెందిన రైతు సంఘం నాయకుడు కొత్తూరి ఇంద్రసేన అలి యాస్ చిన్నన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, పేలుడుకు ఉప యోగించే ఐదు డైనమోలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వంగర పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ బలోపేతంలో భాగంగా మాణిక్యాపూర్ చెరువు శివారు కట్ట వద్ద సమావేశం జరుగుతోందని సమాచారం రావడంతో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ముల్కనూర్, వంగర ఎస్సైలు టీవీఆర్ సూరి, గంజి స్వప్న సిబ్బందితో వెళ్లి ఉగ్గె శేఖర్, గొల్లూరి ప్రవీణ్ కుమార్, ఇంద్రసేనను అదుపులోకి తీసుకు న్నారని చెప్పారు. ప్రవీణ్, శేఖర్, ఇంద్రసేనను హుస్నాబాద్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
వరంగల్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: దిశ ఉదంతంతో అప్రమత్తమైన నగర పోలీసు విభాగం మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదు చేయడంతో పాటు తీవ్రమైన కేసుల్లో దర్యాప్తు, విచారణ అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అత్యంత వేగవంతమైన దర్యాప్తు, విచారణలతో రికార్డుల్లోకి ఎక్కిన వరంగల్‌లో చిన్నారిపై హత్యాచారం కేసును ఓ కేస్ స్టడీగా మార్చారు. ఈ కేసు దర్యాప్తు, విచారణ తీరుతెన్నులను నాటి దర్యాప్తు అధికారి, ప్రస్తుతం చిక్కడపల్లి ఏసీపీ సీహెచ్ శ్రీధర్ సిటీ పోలీసులకు ప్రత్యేక క్లాసుల ద్వారా వివరిస్తున్నారు. గత వారం నుంచి జోన్ల వారీగా ఈ క్లాసులు చేపడుతున్నారు. వరంగల్‌లో ఈ ఏడాది జూన్ 18 అర్ధరాత్రి చోటు చేసుకున్న తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యాభారతి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే దంపతులు తమ తొమ్మిది నెలల చిన్నారిని తీసుకుని హన్మకొండ కుమార్‌పల్లిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి మేడపై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించుకుపోయిన ప్రవీణ్ అనే వ్యక్తి నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణంపై అదే రోజు హన్మకొండ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు ఏసీపీ సీహెచ్ శ్రీధర్ దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. పాశవికమైన ఈ ఉదంతంపై తీవ్రమైన ప్రజాగ్రహం వ్యక్తమైంది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, తక్షణమే ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. 51వ రోజు తీర్పు.. చిన్నారిపై హత్యాచారం కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి ప్రవీణ్‌కు శిక్షపడేలా చేస్తామని వరంగల్ సీపీ వి.రవీందర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం దర్యాప్తు, విచారణ పూర్తి చేయించి, 51వ రోజు తీర్పు వచ్చేలా చేశారు. ఆ కేసు దర్యాప్తు అధికారి శ్రీధర్ ప్రస్తుతం చిక్కడపల్లి డివిజన్ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆ కేస్ స్టడీని నగర పోలీసు అధికారులకు బోధించాల్సిందిగా శ్రీధర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన జోన్ల వారీగా ఇన్స్పెక్టర్లు, ఏసీపీలకు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో శిక్షణ ఇస్తూ, నాటి రికార్డులను పంపిణీ చేస్తూ దర్యాప్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇప్పటికే మూడు జోన్ల అధికారులకు తరగతులు పూర్తి కాగా.. ఈ వారం మరో రెండు జోన్లకు చెందిన వారికి నిర్వహించనున్నారు. చిన్నారి కేసు వివరాలు ►అత్యాచారం, హత్య కేసు నమోదైంది: జూన్ 18, 2019 ►దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్ దాఖలైంది: జూలై 11 (27 రోజుల్లో) ►కోర్టులో సాక్షుల విచారణ: జూలై 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 ►న్యాయస్థానంలో ఇరు పక్షాల వాదనలు: ఆగస్టు 6 ►తీర్పు వెలువడింది: ఆగస్టు 8 (51 రోజుల్లో) ►స్థానిక కోర్టు దోషికి ఉరి శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది. -
ముఠా సంచారం! పొరబడి పోలీసులకు ఫిర్యాదు..
వరంగల్ క్రైం: తుపాకులకు లైసెన్సు ఉన్నప్పటికీ.. పోలీసులను చూసి పారిపోయినందుకే ఆరుగురిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ ముఠా తుపాకులతో తిరుగుతున్నదనే ప్రచారం శనివారం జోరుగా సాగింది. అయితే చివరకు ఈ వ్యవహారం తుస్సుమంటూ తేలిపోయింది. హన్మకొండ న్యూరాయపురకు చెందిన ఒకరు 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆయన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆస్పత్రిలో చూపించాక హన్మకొండలో దింపటానికి వచ్చారు. ఆయన వెంట ఐదుగురు స్నేహితులు కూడా ఉన్నారు. ఇందులో కొందరికి తుపాకీ లైసెన్సు ఉంది. హన్మకొండకు చెందిన సదరు వ్యక్తి తన ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా ఆయన వెంట ఐదుగురు సుబేదారిలోని ఓ హోటల్ భోజనం చేయడానికి తుపాకులను కారులో పెట్టి వెళ్లారు. ఆ తుపాకులను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రాగానే సదరు వ్యక్తులు హైదరాబాద్‌కు బయలు దేరినట్లు తెలిసింది. దీంతో ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో సుబేదారి పోలీసులు వారి ని వెంబడించారు. ఈక్రమంలో హన్మకొండకు చెందిన వ్యక్తి కారు మధ్యలోనే పంచర్ కావడంతో ముందుగా వెళ్లిపోయిన ఐదురుగురు సభ్యులు మళ్లీ వెనక్కి వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న టోల్గేట్ వద్ద వారి వాహనాన్ని అపి సుబేదారి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి విచారించినట్లు సమాచారం. ఆరుగురులో ఒకరిపై 12 కేసులు.. సుబేదారి పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురిలో ఒకరిపై గతంలో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సుమారు 12 కేసులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అతను ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని గన్‌మెన్ పెట్టుకున్నట్లు తెలిసింది. ఆయనపై వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కూడా భార్యాభర్తల కేసు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. కేసులు ఉన్న ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్టు చూపి మిగతా ఐదుగురిని వదిలిపెట్టే అవకాశముందని తెలుస్తోంది. -
సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్ పోలీసులు
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. గత ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని పలిమెల మండల సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్ గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీంతో జిల్లా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రాజెక్టుల వద్ద భధ్రతను మరింతగా పెంచారు. రాత్రి, పగలు కూంబింగ్, చెకింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ మావోయిస్టులు, రాజకీయ నాయకుల కదలికలపై కూడా పోలీసులు నజర్ వేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే విచారించి వివరాలు ఆరా తీస్తున్నారు. వాహనాల తనిఖీలు పోలీసులు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెనల పైనుండి మçహారాష్ట్ర – తెలంగాణకు వస్తున్న వాహనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ధుృవీకరణ పత్రాలు, చిరునామాలు తెలుసుకునేందుకు మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అడవుల్లో నిరంతరం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపున ఉన్న మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్ మండలంలోని ఓడ రేవులపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిసింది. మరోపక్క వర్షాకాలం గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండనుండడంతో రోడ్డు మార్గాలపైన పోలీసులు నజర్ వేశారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వ వద్ద ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. పల్లెల్లో గుబులు! మంథని మాజీ ఎమ్మెల్యే పట్ట మధు, మాజీ ఏఎంసీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, గతంలో పనిచేసిన డీఎస్పీ కేఆర్కే. ప్రసాదరావుతో పాటు పలువురు రాజకీయనాయకులపైన మావోయిస్టులు మహదేవపూర్–ఏటూరునాగారం కమిటీల పేరిట కరపత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పల్లెల్లో ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆయా గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పట్టుకుని విచారించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఈనెల 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో మావోలు ఇటుగా గోదావరి దాటినట్లు ప్రచారం జరుగుతోంది. మారుమూల మండలం పలిమెల, మహాముత్తారం గ్రామాల్లో మాత్రం అటవీ ప్రాంతం కావడంతో జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో మావోలు అటుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లోని చోటమోట నాయకులతో పాటు మాజీ మావోయిస్టులు మండల కేంద్రంతో పాటు పట్టణాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కరపత్రాల విషయంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. మావోల కరపత్రాలు అసలా, నకిలివా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. భద్రత కట్టుదిట్టం.. జిల్లా ఇచ్చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్, కాటారం ఏఎస్పీ సాయిచైతన్య, సీఐలు నర్సయ్య, హతిరాం ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పిఎఫ్, డిస్ట్రీక్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోలు తెలంగాణ వైపు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా నిఘా తీవ్రతరం చేసి చర్యలు చేపడుతున్నారు. -
తల ఒకచోట.. మొండెం మరోచోట
మియాపూర్: అప్పుగా తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్‌ను దారుణంగా హతమార్చి అతడి తలను ఒకచోట, మొండాన్ని మరొక చోట పడేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన నగరంలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా, గూడూరు మండలం తీగెలపాడుకు చెందిన గడ్డం ప్రవీణ్(25) అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. ఎంఏనగర్‌లో నివాసముంటున్న ఏపీకి చెం దిన బావాబామ్మర్దులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లు మియాపూర్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు చిన్న మొత్తాల్లో ఫైనాన్స్‌లు ఇస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవాణినగర్‌లో ఉండే తాడేపల్లిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ రాజేశ్‌కు రూ.15 వేలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు సకాలం లో తిరిగి ఇవ్వక పోవడంతో ప్రవీణ్‌తో కలసి శ్రీకాంత్, శ్రీనివాస్‌లు గురువారం రాత్రి 12 సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి అతడిని, ఆటో బయటకు తీసుకెళ్లారు. ఆటోలోనే రాజేశ్‌ను కొట్టుకుంటూ దీప్తిశ్రీనగర్‌లోని ధర్మ పురి క్షేత్రం సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ యాదవ్ తన వెంట తెచ్చుకున్న చున్నీని అనూహ్యంగా ప్రవీణ్ మెడకు చుట్టాడు. ఆ వెంటనే శ్రీకాంత్ యాదవ్ కత్తితో ప్రవీణ్‌పై దాడి చేశాడు. ప్రవీణ్‌పై దాడిని పసిగట్టిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయి మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్, శ్రీనివాస్‌లిద్దరూ తనపై దాడి చేశారని, ప్రవీణ్‌ను హత్య చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు ప్రవీణ్ మొండెం మాత్రమే లభించింది. ఉద యం మియాపూర్ లోని ట్రాఫిక్ పీఎస్ ముందు బొల్లారం క్రాస్‌రోడ్డులో గుర్తు తెలియని తలపడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తల, మొండెం స్వాధీ నం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, మియాపూర్ ఏసీపీ రవి కుమార్ పరిశీలించారు. పాతకక్షలే కారణమా? అమీన్పూర్లో ఉండే ఓ బిల్డర్‌కు శ్రీకాంత్ యాదవ్‌కు మధ్య గతంలో గొడవ జరిగింది. దీంతో ఆ బిల్డర్ శ్రీకాంత్‌యాదవ్‌పై కేసు పెట్టాడు. స్నేహితుడైన ప్రవీణ్ ఆ బిల్డర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని తనపై దాడి చేసే అవకాశం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజేష్‌తో గొడవ పడినట్లుగా నటించి బావమరిదితో కలసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఒక్క ఫోన్ కాల్ విలువ రూ.40,000!
నెక్కొండ: ఎస్బీఐ నుంచి ఫోన్ చేసిన అపరిచిత కాల్‌ను స్పంచింది ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతానుంచి 40,019 రూపాయలు మాయం అయిన ఘటన శనివారం శనివారం మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మండలంలోని గేటుపల్లి గ్రామానికి చెందిన బాదావత్ సారయ్యకు ఉదయం 8345072647 నెంబర్‌తో ఎస్బీఐ బ్యాంక్ నుంచి అంటూ ఓ కాల్ వచ్చింది. ఏటీఎం కార్డు కాలపరిమితి అయిపోయిందని చెప్పిన అపరిచిత కాల్‌కు సారయ్య స్పందించాడు. ఏటీఎం కార్డు కాల పరిమితిని పునరుద్దరించుటకు కార్డుపై ఉన్న బార్ కోడ్ 19 అంకెలు తెలపాల్సిందిగా కోర గా ఆ వివరాలు చెప్పాడు. కొద్ది సేప టికి తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ 62207648956 నుంచి రూ. 40.019 డ్రా చేసినట్లు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఉదయం ధాన్యం డబ్బులు రూ. 40,000లు డ్రా చేయాల్సి ఉందని బ్యాంక్ వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దారుణం జరిగిందని సారయ్య విలేకరుల ముందు బోరుమని విలపించారు. ఈ విషయంపై సారయ్య బ్యాంక్ అధికారులను సంప్రదించాగా.. అపరిచిత కాల్‌కు స్పందించడంతో అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయ్యాయని తెలిపారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
జోరుగా మూడుముక్కలాట
జనగామ: మూడు ముక్కలాట జిల్లాలో జోరుగా సాగుతుంది. మామిడి తోటలు, ఫాంహౌజ్‌లను పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు అంకితమైపోతున్నారు. సంపాదనంతా తగలేస్తూ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. రోజుకు రూ. ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రం శివారుతో పాటు లింగాలఘనపురం, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు పేకాట రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఆయా జిల్లాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి పేకాటను జోరుగా సాగిస్తు న్నారనే ప్రచారం జరుగుతోంది. రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఫాంహౌజులతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఫారెస్ట్లు, వ్యవసాయ క్షేత్రాలను స్థావరాలుగా మార్చుకుం టున్నారు. ఒక్కో ప్రదేశంలో పది నుంచి ఇరవై మంది సభ్యుల వరకు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఆదివారంతో పాటు ఇతర సెలవురోజుల్లో ఈ ఆట రెండింతలుగా పెరుగుతుంది. తెల్లవార్లూ... సర్కారు కొలువుకు వెళ్లినట్టుగా రోజు వారీగా పేకాట రాయు ళ్లు ముందుగా ఎంచుకున్న రహస్య ప్రదేశాలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి, అవసరమైతే తెల్లవార్లు మూడు ముక్కలు, రమ్మీ ఆడేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. పేకాట ఆడే ప్రదేశంలోకి పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తే ముందుగానే గుర్తించి సమాచారం అందించేందుకు ప్రైవేట్‌గా రెండంచెల భద్రతను మెయింటేన్ చేస్తుండడం గమనార్హం. కొంత మంది బడా బాబులు ఈ ఆటలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యక్తులు పోలీసులు, గ్రామస్తులకు అనుమానం రాకుండా స్థావరాలను మారుçస్తూ పేకాట జోరును కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసులు పేకాట స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఆట మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. రోడ్డున పడుతున్న కుటుంబాలు.. సరదా కోసం పేకాటను అలవాటుగా మార్చుకుంటున్న చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పేకాట మానుకోవాలని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ ఊబిలోకి కొత్తవారిని సైతం ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మూడు ముళ్ల బంధం... ఏడడుగులు నడిచి తన వెంట వచ్చిన భార్య మెడలోని మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెట్టేస్తూ.. జల్సా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి... పేకాటలో వడ్డీ వ్యాపారస్తుల హవా కొనసాగుతుంది. ఆటలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు అప్పురూపంలో ఇచ్చేందుకు కొత్త వడ్డీవ్యాపారులు పుట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు భార్య మెడలోని పుస్తుల తాళ్లను సైతం తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా సదరు వ్యాపారులు.. నిర్వాహకులు ఆట మధ్యలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే చర్చించుకుంటున్నారు. అప్పు తీసుకున్న పాపానికి పేకాట ఆడుతూ రెంటికీ చెడ్డ రేవడిగా మారుతున్నారు. పేకాటపై ఉక్కుపాదం జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రతి నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాం. పేకాట రాయుళ్లపై ఎవరు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. జిల్లాలో ఇటీవల అనేక చోట్ల పేకాటరాయుళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసి డబ్బులను కోర్టుకు అప్పగించాం. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. -
పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్..?
మహబూబాబాద్ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని సుపారీగ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను శనివారం అర్ధరాత్రి మానుకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దమ్మపేట మండలానికి చెందిన ఒకరిని..ఇద్దరు వ్యక్తులు హత్య చేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతం నుంచి శనివారం మహబూబాబాద్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. దమ్మపేట ఉపసర్పంచ్, అధికార పార్టీ నాయకుడు దారా యుగంధర్‌తో పాటు శేషగిరిరావును మానుకోట పోలీసులు శనివారం అర్ధరాత్రి దమ్మపేటలో అదుపులోకి తీసుకుని కేసముద్రం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెల్లారేసరికల్లా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అదే విధంగా యుగంధర్‌తో పాటు మరికొందరికి, దమ్మపేట మండలం నల్లకుంటకు చెందిన గిరిజనుడు సోడెం వెంకట్‌కి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ విషయంలో కేసులు, భౌతికదాడులు కూడా జరిగాయి. శాసనసభ ఎన్నికల సమయంలో గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని, హత్యాయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్దికాలం పాటు భూవివాదం.. వెంకట్ తన సహచరులు చేస్తున్న ఆందోళనలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి వెలుగులోకి.. పోలీసుల చర్యతో మళ్లీ అన్ని విషయాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మహబూబాబాద్ జిల్లా పోలీసులు పక్కా ఆధారాలతోనే ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భూ ఉద్యమాలకు పాల్పడుతున్న సోడెం వెంకట్, ఊకే సత్యం, ఊకే చందర్రావులను చంపేందుకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున మొత్తం రూ.30లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారాన్ని పక్కా ఆధారాలతో పోలీసులు సేకరించినట్లు తెలిసింది. కేసముద్రం ప్రాంతానికి చెందిన ఓ మాజీ మావోయిస్టు అనుచరుడు పిస్టల్‌తో పోలీసులకు కొద్దిరోజుల క్రితం చిక్కాడు. అతడిని విచారించగా దమ్మపేట హత్యల డీల్‌ను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అప్రూవర్‌గా మార్చుకుని.. ఫోన్‌కాల్స్ ద్వారా యగంధర్‌తో మాట్లాడించి వాటిని రికార్డు చేయించినట్లు వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో హత్యాయత్నం చేసి విఫలం చెందినట్లు సదరు అప్రూవర్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. దీంతో విచారణ వేగవంతం చేసి.. తన హత్యకు కుట్ర పన్నారని.. ఓ వ్యక్తికి సుపారీ కూడా ఇచ్చారనే విషయం తెలియని వెంకట్‌కు అటు పోలీసులు, ఇటు సుపారీ తీసుకున్న వ్యక్తి ఆధారాలతో చూపించి.. వెంకట్‌ను కిడ్నాప్ చేసినట్లు వీడియోకాల్ ద్వారా యుగంధర్ నమ్మించారు. ఆ తర్వాత మాజీ మావోయిస్టుతో పాటు అతని అనుచరుల మాదిరిగా మఫ్టీలో దమ్మపేటకు వచ్చి.. యుగంధర్ దగ్గర రూ.3లక్షలు నగదు తీసుకున్నారు. మరో రూ.2లక్షలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు(ఆధారం కోసం). ఇవన్నీ ఆధారాల కోసం రికార్డు చేసుకుని పక్కా వ్యూహంతో శనివారం రాత్రి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఈ కథంతా ఆదివారం ఉదయం నుంచి తోకలేని పిట్టలా పదే పదే సంచరిస్తోంది. ఇంతకీ మహబూబాబాద్ పోలీసులు ఏం తేలుస్తారో.. వేచి చూడాలి మరి. ఈ విషయమై జిల్లా పోలీసు ఉన్నతాధికారులను సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా వారు అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. -
మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి
వరంగల్ రూరల్: రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడినందున అక్రమ మద్యం, బెల్లం,గుడుంబా అమ్మకాలను నియంత్రించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఐఎంఎఫ్ఎల్, ఐడీసీ, అక్రమ తరలింపులను అడ్డుకోవాలని సురేష్ రాథోడ్ చెప్పారు. ప్రతి వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పనిచేసేలా చూడాలని ఆయన తెలి పారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్1, ఆర్2, రిజిష్టర్లను నిర్వహించాలని తెలిపా రు. ఎక్కువ మద్యం అమ్మితే ఆ రిటేల్ షాపుల వివరాలు తమకు ఇవ్వాలని సురేష్ రాథోడ్ వివరించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వాట్సప్ గ్రూపునకు అందుబాటులో ఉండాలని చెప్పారు. సెల్ మెసేజ్‌లకు స్పందించాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అరగంటలోపే స్పందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు అడగవద్దని ఆయన స్పష్టం చేశారు. సి–విజిల్ ఫిర్యాదులకు స్పందించాలని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరినైనా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినప్పుడు కొట్టకూడదని సురేష్ రాథోడ్ అన్నారు. 24 గంటలు పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వరంగల్ రూరల్ పి.శ్రీనివాసరావు, వరంగల్ అర్బన్ బాలస్వామి, మహబూబాబాద్ డీపీఈఓ దశరథ్, భూపాలపల్లి డీపీఈఓ శశిధర్‌రెడ్డి, జనగామ డీపీఈఓ మహిపాల్ రెడ్డి, సీఐలు, పాల్గొన్నారు. -
బాలుడిపై పోలీస్ దాష్టీకం
- తల్లికి వాతలు తేలేలా దెబ్బలు - దొంగతనం కేసులో విచారణ - రూ.60 వేలు లంచం డిమాండ్ - నెలరోజులకుపైగా వేధింపులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి మచ్చ తెచ్చేలా వరంగల్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. దొంగతనం విచారణ పేరుతో ఓ బాలుడిని, అతని తల్లిని నెలలుగా మానసిక, శారీరక హింసలకు గురిచేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మడికొండలో 2017 జూలై 30న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇదే కాలనీకి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ కనిపించిన సెల్‌ఫోన్‌ను దొంగిలించి, తెలిసిన వ్యక్తికి రూ. 200లకు అమ్మేశాడు. దీంతో ఆ ఇంటి యజమాని మడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈఎంఐఈ నంబరు ట్రేస్ చేయడం ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి, అతని ద్వారా బాలుడి వివరాలను కనుక్కున్నారు. సెంట్రల్ క్రైం స్టేషన్‌కు పిలిచి విచారించారు. అక్కడ బాలుడు చెప్పిన విషయం విన్న పోలీసులు ఇంకోసారి చేయవద్దంటూ హెచ్చరించి వదిలేశారు. మడికొండలో టార్చర్ బాలుడితోపాటు అతని స్నేహితులు మరో ముగ్గురిని మడికొండ పోలీసులు విచారణ పేరుతో ఆగస్టు మొదటివారంలో పిలిచారు. ఈ దొంగతనం కేసులో సెల్‌ఫోన్‌తో పాటు రెండు తులాల బంగారం, రూ. 2400 డబ్బులు పోయాయని చెప్పారు. నగల రికవరీ పేరుతో బాలుడు రూ. 60 వేలు, మిగిలిన ముగ్గురు రూ.20 వేల చొప్పున ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు. బాధిత బాలుడు నిరుపేద కావడంతో రూ. 60 వేలు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో బాలుడిని పదేపదే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టే వారు. కొడుకు కోసం స్టేషన్‌కు వెళ్లిన తల్లిని కూడా పోలీసులు దారుణంగా కొట్టారు. కమిలే గాయాలు.. ఆత్మహత్యా యత్నం పోలీసుల అమానుష ప్రవర్తనతో బాలుడు రక్తం కక్కుకున్నాడు. గొంతు, ఛాతీ, వీపు, ఎడమ భుజం, పిక్కల మీద వాతలు తేలాయి. చర్మం కమిలిపోయింది. పోలీసుల వేధింపులకు తాళలేక తల్లి ఆత్మహత్యకు యత్నించింది. బాలుడు, అతడి తల్లి యాదవ సంఘం నాయకులతో కలసి శనివారం డీసీపీ వేణుగోపాల్‌రావును కలసి గోడు వినిపించారు. దీంతో సీఐ శ్రీధర్‌ను డీసీపీ ఫోన్లో మందలించినట్లు సమాచారం. నన్ను, అమ్మను కొట్టారు నేను ఆడుకుంటూ నా ఫ్రెండ్‌తో కలసి ఆ ఇంట్లోకి వెళ్లి ఫోన్ తీశాను. రికవరీ కోసం అడిగినంత ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. రోజూ స్టేషన్‌కు వచ్చి పొమ్మన్నారు. మా అమ్మ తెలిసిన వారితో ఏసీపీకి ఫోన్ చేయించి, నన్ను వదిలేయమంటూ సీఐకి ఫోన్ చేయించింది. దీంతో నా టెన్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులు తీసుకుని రమ్మన్నారు. నేను, మా అమ్మ వెళ్లాం. నన్ను కొడుతుంటే.. పోరడు సచ్చిపోతాడంటూ మా అమ్మ అడ్డువచ్చింది. అమ్మను కాలితో తన్ని, బూతులు తిట్టారు. మహిళా కానిస్టేబుళ్లు చేతులు వెనక్కి పట్టుకోగా మా అమ్మ చేతులు, వీపు, కాళ్లపై బెల్టుతో కొట్టారు. - బాధిత బాలుడు ప్యాంటు వేసి తొండలు వదులుతనన్నడు కూలి పని చేసుకుని బతుకుతున్న. నా కొడుకు తప్పు చేస్తే కేసు పెట్టి జైలుకు పంపమన్న. కానీ డబ్బులు అడిగిళ్లు. ఇయ్యనందుకు రోజు పిలగాన్ని కొట్టుడే. అడ్డుకోవడానికి పోతే పోలీసు సీఐ సారు నన్ను దారుణంగా కొట్టారు. ‘లం... నీకు ప్యాంటు వేసి, లోపలకి తొండలు పంపుతా..’అంటూ చెప్పలేనట్లుగా తిట్టాడు, చూపించలేని చోట బెల్టుతో కొట్టారు. పైసలు కట్టేదాక వదిలేది లేదు. జైలుకు పంపేది లేదు. రోజూ ఇలాగే ఉంటది అని బెదిరించాడు. - బాధితుడి తల్లి వాళ్లకిది మామూలే.. దొంగతనం కేసులో బాలుడిపై కేసు నమోదైంది. ఇంకా కోర్టులో హాజరు పరచలేదు. దొంగతనం జరిగిన సొమ్మును రికవరీ చేసేందుకు బాలుడికి అవకాశం ఇచ్చాను. నేను ఎవరిని కొట్టలేదు. వాళ్లే ఎక్కడో కొట్టుకుని వస్తున్నారు. ఇది వాళ్లకు మామూలు విషయమే. వాళ్లు రెగ్యులర్‌గా దొంగతనాలు చేస్తుంటారు. -కె శ్రీధర్, మడికొండ సీఐ -
అవకాశం కల్పించరూ...!
అర్హత పరీక్షలకు గైర్హాజర్ అయిన ఎస్సై అభ్యర్థుల వేడుకోలు కొంత మందికే అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సై పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన ఎంపికల ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల గైర్హాజర్ అయిన అభ్యర్థులు తమకు అవకాశం కల్పించాలని నగర కమిషనర్ జి.సుధీర్‌బాబు ను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 4వ తేదీన జేఎన్ఎ స్ స్టేడియంలో ఎస్సై పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఆ రోజున నంబర్ల ప్రకారం పిలిచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలి స్తారని భావించిన చివరి నంబర్లలో ఉన్న అభ్యర్థులు తమ పనులపై వెళ్లారు. అదే సమయంలో అభ్యర్థులను సీరియల్ నంబర్ల ప్రకారం పిలువకుండా అధికారులు జంబ్లింగ్ పద్ధతిలో పిలవడంతో పలువురు స్థానికంగా లేకపోవడం వల్ల గైర్హాజర్ అయ్యారు. పనులు ముగించుకొని వ చ్చిన వారికి ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి భర్తీ ప్రక్రియ కావడంతో పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఇదే విషయాలను అక్కడి అధికారులకు తెలుపడంతో సీపీ దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడంతో వీరు ఆశతో ఇళ్లకు వెళ్లిపోయినట్లు గైర్హాజర్ అయిన అభ్యర్థులు తెలిపారు. రంజాన్ పండుగ ఉన్నందున ఆ రోజున పరీక్షల కు హాజరయ్యే ముస్లిం అభ్యర్థులకు మరో రోజు న ఎంపికలు నిర్వహిస్తామని చెప్పడంతో గైర్హాజ ర్ అయిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. రంజాన్ రోజున రాని వారికి 9వ తేదీన పరీక్షలు నిర్వహిస్తుండడంతో వీరు వెళ్లి నగర పోలీస్ క మిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. కేవలం రం జాన్ రోజున గైర్హాజర్ అయిన వారికే అవకాశం ఇస్తున్నట్లు ఆయన చెప్పడంతో వీరు సీపీని ప్రా దేయపడ్డినట్లు తెలిసింది. రూరల్ పరిధిలో ఇ లాంటి సమస్యలతో గైర్హాజర్ అయిన వారికి రూరల్ ఎస్పీ అవకాశం కల్పించినట్లు సమాచా రం. అయినప్పటికి సీపీ కుదరదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగినట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఇదే విషయంపై పోలీసు రిక్రూట్మెంట్ చైర్మన్‌ను జంబ్లింగ్‌తో గైర్హాజర్ అయిన అభ్యర్థులు కలిసి ప్రాధేయపడగా ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలోనే జరుగుతున్నందున వారే ని ర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో మరోసారి సీపీని కలిసి అభ్యర్థులు విన్నవించినా ఆయన సమ్మతించలేదని తెలిసింది. ఈ పరీక్షల్లో కానిస్టేబుళ్లగా పనిచేస్తున్న కొంత మంది అభ్యర్థులు ఇదే కారణాలతో హాజరుకాలేకపోయినట్లు తెలిసింది.గైర్హాజరైన అభ్యర్థులు తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. -
ప్రజలకు చేరువలో పోలీస్ వాట్సప్
ఇప్పటివరకు 674 ఫిర్యాదులు ఇందులో ట్రాఫిక్ సమస్యలే అధికం పరిష్కారంలో వేగంగా స్పందిస్తున్న పోలీసులు జవాబుదారీగా వాట్సప్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నంబర్ 94910-89257 వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ పోలీసులు నగర ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ‘పోలీస్ వాట్సప్’ను అందుబాటులోకి తెచ్చారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేయడానికి వాట్సప్ వంటి సామాజిక మాధ్యమం సరైన సాధనంగా గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 5న వాట్సప్ సేవలను ప్రారంభించి 94910-89257 నెంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్ ద్వారా ప్రజలు తమ చుట్టుపక్కల శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, ఏదైనా నేరం జరిగినా ఫొటో, వీడియో చిత్రీకరించి పోస్ట్ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు, సిబ్బంది సమస్య పరిష్కారం కోసం తక్షణమే ఉపక్రమిస్తారు. ఇలా స్పందిస్తారు.. వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌రూమ్‌లో ఉండే పోలీసు అధికారులు ఫిర్యాదుదారు నుంచి వచ్చిన మెస్సెజ్ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేస్తారు. ఆ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కరించిన విషయూన్ని స్టేషన్ పోలీసులు తిరిగి కంట్రోల్‌రూమ్‌కు తెలియజేస్తారు. అక్కడి నుంచి విషయం ఫిర్యాదుదారునికి వెళ్తుంది. ఇలా.. వాట్సప్ నెంబర్ జవాబుదారీగా మారింది. దీంతో ఆయా స్టేషన్ అధికారులపై బాధ్యత పెరుగుతోంది. ఫిర్యాదుదారు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. 674 ఫిర్యాదులు కమిషనరేట్ పరిధిలో వాట్సప్ ప్రారంభమైన డిసెం బర్ 5 నుంచి ఇప్పటి వరకు 674 ఫిర్యాదులు అం దాయి. డిసెంబర్లోనే 136 ఫిర్యాదులు వచ్చాయి. ట్రాపిక్ సమస్యలే అధికం వాట్సప్ ద్వారా ఇప్పటివరకు అందిన 674 ఫిర్యాదులలో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈవ్‌టీజింగ్, రోడ్లపై జరిగే గొడవలతో పాటు సివిల్ తగాదాలకు సంబందించిన ఫిర్యాదులు ఉన్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు సంబందించిన దృశ్యాలు సైతం ఈ నెంబర్‌కు పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వాట్సప్‌కు వచ్చిన ఫిర్యాదును ప్రత్యేకంగా నియమిం చిన అధికారులు, సిబ్బంది ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకుని సంబందిత పోలీసు అధికారులకు ఫిర్యాదును, ఫిర్యాది సెల్‌నెంబర్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.... మంచిర్యాలకు చెందిన అబ్బాయి, హన్మకొండకు చెందిన అమ్మాయి ఇరువురు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అంగీకరించని అబ్బాయి బంధువులు ఒక రోజు అమ్మాయి ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించారు. అమ్మాయి వాట్సప్ ద్వారా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాట్సప్ కంట్రోల్ రూమ్ అధికారులు తక్షణమే స్పందించారు. ఫిర్యాదు హన్మకొండ పోలీస్‌స్టే షన్‌కు పంపించారు. వెంటనే రంగంలోకి దిగిన హన్మకొండ ఇన్స్పెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని అమ్మాయికి రక్షణ కల్పించడంతో పాటు అబ్బాయి బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ములుగు నుంచి వరంగల్‌వైపు వస్తున్న కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఆకతాయిలు ఆరెపల్లి వ ద్ద అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వస్తున్న దం పతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే ప్రాం తానికి చెందిన ఒక పౌరుడు స్పందించి ఆకతాయి ల కారును ఫొటోతీసి పోలీస్ వాట్సప్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు కారు నెంబరు ఆధారంగా ఖమ్మం జిల్లాకు సమాచారం అందించి ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇద్దరు భార్యాభర్తలు కాజీపేట నుంచి భద్రకాళి దేవాలయానికి వెళ్లేందుకు రూ.60కి ఆటోను మాట్లాడుకున్నారు. గమ్యం చేరిన తర్వాత ఆటో దిగి డ్రైవర్‌కు రూ.160 ఇచ్చారు. అనంతరం తాము డ్రైవర్‌కు అదనంగా రూ.100 ఇచ్చామని గుర్తించి దంపతులు సదరు డ్రైవర్ గురించి వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో ఆటోపై ఉన్న అడ్డా నెంబర్‌ను వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేశారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసులు సదరు ఆటో ధర్మసాగర్‌కు చెందిందిగా గుర్తించి ఆటో డ్రైవర్నుంచి అధికంగా తీసుకున్న రూ.100ను భార్యాభర్తలకు ఇప్పించారు. -
రూ.3 కోట్ల విలువైన పంచలోహా విగ్రహాలు స్వాధీనం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని పలు ఆలయాల్లో పంచలోహ విగ్రహాల చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ములుగు క్రాస్ రోడ్డులోని పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో నిందితులు ఆటోలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏడు పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో అతి పురాతనమైన రెండు శ్రీరాముడు, సీతమ్మవారి విగ్రహం ఒకటి, వేణుగోపాల స్వామి విగ్రహం, రాధాదేవి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ములుగు మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన తేజావత్ రమేశ్, పర్వతగిరి మండలం వడ్లకోండ గ్రామానికి చెందిన వలందాస్ రంగయ్య, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ అని సుధీర్‌బాబు చెప్పారు. -
పోలీస్ వాట్సప్
ప్రమాద వివరాలు, సాయం కోసం అందుబాటులోకి.. 94910 89257 నంబర్ ప్రకటించిన సీపీ సుధీర్‌బాబు వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఉంటున్న ఆండ్రారుుడ్ సెల్ఫోన్లలోని వాట్సప్ అప్లికేషన్ సాయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రజలు తమకు ఎదురైన ఆపద వివరాలు అందజేయడంతో పాటు సాయం కోసం విజ్ఞప్తి చేసే అవకాశముంది. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు, సాయం కోసం విజ్ఞప్తులను తక్షణమే అందుకునేలా వాట్సప్ నంబర్ ఏర్పాటుచేసిన ట్లు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ నంబర్ ద్వారా కమిషనరేట్ పరిధి లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లోనే సమాచారం అందించవచ్చన్నా రు. శాంతిభద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలపై ప్రజలు 94910 89257 వాట్సప్ నం బర్కు చిత్రాలు, వీడియోలు పంపించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ నంబర్ ద్వారా ప్రజలు ఆపదసమయంలో కూడా సాయం కోరవచ్చని తెలిపారు. కాగా, ఈ నంబర్‌కు సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యం గా ఉంచనున్నట్లు ఆయన వెల్లడించా రు. అంతేకాకుండా ఈ నంబర్‌కు ఇచ్చే సమాచారం ఆధారంగా స్పందించేందుకు ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేశామన్నారు. ఈ విభాగానికి అందే ఫిర్యాదులు, విజ్ఞప్తులపై స్పం దించనున్న వీరు సంబంధిత ఏసీపీ, ఇన్స్పెక్టర్తో పాటు బ్లూకోల్డ్స్ సిబ్బం దికి సమాచారం ఇచ్చి పరిష్కారమయ్యేలా చూస్తారని తెలిపారు. సమావేశంలో ఏసీపీలు జనార్దన్, శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, మహేందర్, ఈశ్వర్రావు, రమేష్ పాల్గొన్నారు.