పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు
వరంగల్ క్రైం: తుపాకులకు లైసెన్సు ఉన్నప్పటికీ.. పోలీసులను చూసి పారిపోయినందుకే ఆరుగురిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ ముఠా తుపాకులతో తిరుగుతున్నదనే ప్రచారం శనివారం జోరుగా సాగింది. అయితే చివరకు ఈ వ్యవహారం తుస్సుమంటూ తేలిపోయింది. హన్మకొండ న్యూరాయపురకు చెందిన ఒకరు 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆయన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆస్పత్రిలో చూపించాక హన్మకొండలో దింపటానికి వచ్చారు. ఆయన వెంట ఐదుగురు స్నేహితులు కూడా ఉన్నారు. ఇందులో కొందరికి తుపాకీ లైసెన్సు ఉంది.
హన్మకొండకు చెందిన సదరు వ్యక్తి తన ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా ఆయన వెంట ఐదుగురు సుబేదారిలోని ఓ హోటల్ భోజనం చేయడానికి తుపాకులను కారులో పెట్టి వెళ్లారు. ఆ తుపాకులను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రాగానే సదరు వ్యక్తులు హైదరాబాద్‌కు బయలు దేరినట్లు తెలిసింది. దీంతో ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో సుబేదారి పోలీసులు వారి ని వెంబడించారు. ఈక్రమంలో హన్మకొండకు చెందిన వ్యక్తి కారు మధ్యలోనే పంచర్ కావడంతో ముందుగా వెళ్లిపోయిన ఐదురుగురు సభ్యులు మళ్లీ వెనక్కి వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న టోల్‌గేట్ వద్ద వారి వాహనాన్ని అపి సుబేదారి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి విచారించినట్లు సమాచారం.
ఆరుగురులో ఒకరిపై 12 కేసులు..
సుబేదారి పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురిలో ఒకరిపై గతంలో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సుమారు 12 కేసులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అతను ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని గన్‌మెన్ పెట్టుకున్నట్లు తెలిసింది. ఆయనపై వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కూడా భార్యాభర్తల కేసు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. కేసులు ఉన్న ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్టు చూపి మిగతా ఐదుగురిని వదిలిపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment