జనగామ: మూడు ముక్కలాట జిల్లాలో జోరుగా సాగుతుంది. మామిడి తోటలు, ఫాంహౌజ్‌లను పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు అంకితమైపోతున్నారు. సంపాదనంతా తగలేస్తూ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. రోజుకు రూ. ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రం శివారుతో పాటు లింగాలఘనపురం, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు పేకాట రాయుళ్లు హల్‌చల్ చేస్తున్నారు.
మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఆయా జిల్లాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి పేకాటను జోరుగా సాగిస్తు న్నారనే ప్రచారం జరుగుతోంది. రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఫాంహౌజులతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఫారెస్ట్‌లు, వ్యవసాయ క్షేత్రాలను స్థావరాలుగా మార్చుకుం టున్నారు. ఒక్కో ప్రదేశంలో పది నుంచి ఇరవై మంది సభ్యుల వరకు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఆదివారంతో పాటు ఇతర సెలవురోజుల్లో ఈ ఆట రెండింతలుగా పెరుగుతుంది.
తెల్లవార్లూ...
సర్కారు కొలువుకు వెళ్లినట్టుగా రోజు వారీగా పేకాట రాయు ళ్లు ముందుగా ఎంచుకున్న రహస్య ప్రదేశాలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి, అవసరమైతే తెల్లవార్లు మూడు ముక్కలు, రమ్మీ ఆడేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. పేకాట ఆడే ప్రదేశంలోకి పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తే ముందుగానే గుర్తించి సమాచారం అందించేందుకు ప్రైవేట్‌గా రెండంచెల భద్రతను మెయింటేన్ చేస్తుండడం గమనార్హం. కొంత మంది బడా బాబులు ఈ ఆటలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యక్తులు పోలీసులు, గ్రామస్తులకు అనుమానం రాకుండా స్థావరాలను మారుçస్తూ పేకాట జోరును కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసులు పేకాట స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఆట మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.
రోడ్డున పడుతున్న కుటుంబాలు..
సరదా కోసం పేకాటను అలవాటుగా మార్చుకుంటున్న చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పేకాట మానుకోవాలని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ ఊబిలోకి కొత్తవారిని సైతం ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మూడు ముళ్ల బంధం... ఏడడుగులు నడిచి తన వెంట వచ్చిన భార్య మెడలోని మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెట్టేస్తూ.. జల్సా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి...
పేకాటలో వడ్డీ వ్యాపారస్తుల హవా కొనసాగుతుంది. ఆటలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు అప్పురూపంలో ఇచ్చేందుకు కొత్త వడ్డీవ్యాపారులు పుట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు భార్య మెడలోని పుస్తుల తాళ్లను సైతం తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా సదరు వ్యాపారులు.. నిర్వాహకులు ఆట మధ్యలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే చర్చించుకుంటున్నారు. అప్పు తీసుకున్న పాపానికి పేకాట ఆడుతూ రెంటికీ చెడ్డ రేవడిగా మారుతున్నారు.
పేకాటపై ఉక్కుపాదం
జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రతి నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాం. పేకాట రాయుళ్లపై ఎవరు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. జిల్లాలో ఇటీవల అనేక చోట్ల పేకాటరాయుళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసి డబ్బులను కోర్టుకు అప్పగించాం. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
Comments
Please login to add a commentAdd a comment