సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చకు దారితీసిన.. మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు.
ప్రీతి గత నవంబర్‌లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది. చివరకు ఫిబ్రవరి 22వ తేదీన ఎంజీఎంలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది అని ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే.. సైఫ్ వేధింపులే కారణమని ఛార్జిషీట్‌లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను సైతం ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ‘‘ప్రీతి మృతిపై U/s.306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సైంటిఫిక్ , టెక్నికల్ , మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు(బాధితురాలు).. నిందితుడు, వాళ్ల వాళ్ల మిత్రులు వాడిన సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం అని ప్రకటించారు సీపీ రంగనాథ్.
కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై కన్నుమూసింది.
ఈ కేసులో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కాగా.. దాని ఫలితాన్ని ఏప్రిల్‌లో ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని వెల్లడించారు. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు జూన్‌లో ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment