kmc
-
వరంగల్ కేఎంసీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం?
సాక్షి, వరంగల్: వరంగల్ కేఎంసీలో అస్వస్థతకు గురైన మెడికో స్టూడెంట్ లాస్య ఘటన తీవ్ర కలకలం రేపింది. మాత్రలు వేసుకొని అనారోగ్యానికి గురి కావడంతో సూసైడ్‌కు యత్నించిందని వదంతులు వ్యాపించాయి. మెడికో ప్రీతి సూసైడ్ ఘటన మరువకముందే మరో మెడికో అస్వస్థతకు గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య మైగ్రేన్ కారణంతో మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుంది. మైగ్రేన్ కంట్రోల్ కాకపోవడంతో మరో టాబ్లెట్ వేసుకోగా ఓవర్‌డోస్ తో అనారోగ్యానికి గురైంది. మరో మెడికో అస్వస్థతకు గురై ఎంజీఎం లో చికిత్స పొందుతోందని తెలియగానే వైద్యవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రస్తుతం మెడికో లాస్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం సూపరిందెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం ఘటన జరగలేదని, అనారోగ్యం కారణంతోనే ఎంజిఎంలో ప్రథమ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా లాస్య హెల్త్ కండిషన్ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న లాస్య పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చామని అన్నారు. మరోవైపు అనారోగ్యానికి గురైన లాస్య స్పందిస్తూ మైగ్రేన్ కారణంగానే మాత్రలు వేసుకోవడంతో ఓవర్‌డోస్ అయిందని, ఇతర కారణాలు ఏవీ లేవన్నారు. తన అనారోగ్య సమస్యను అనవసరంగా ఇష్యూ చేయొద్దని కోరారు. ఏదేమైనా మెడికో స్టూడెంట్ అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స తీసుకోవడం కేఎంసీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రీతి ఘటన మరువకముందే మరో విద్యార్థి అనారోగ్యానికి గురికావడంతో కేఎంసీలో ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. మొత్తానికి లాస్య ఈ ఘటనపై స్పందిస్తూ తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదని, స్వల్ప అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో కేఎంసీ యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
ప్రీతి కేసు నిందితుడు సైఫ్ ఏడాదిపాటు సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లో కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సైఫ్ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. సైఫ్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ స్టూడెంట్. కులం తక్కువ అంటూ హేళన చేస్తూ మానసికంగా వేధించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎంలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 26న మృతి చెందింది. సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్‌ను గత మార్చి 4 నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్‌కు అకడమిక్స్, థియరీ ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ -
మెడికో ప్రీతి కేసులో ఎట్టకేలకు ఛార్జ్‌షీట్
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చకు దారితీసిన.. మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ప్రీతి గత నవంబర్‌లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది. చివరకు ఫిబ్రవరి 22వ తేదీన ఎంజీఎంలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది అని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు. అలాగే.. సైఫ్ వేధింపులే కారణమని ఛార్జిషీట్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను సైతం ఛార్జిషీట్లో ప్రస్తావించారు. ‘‘ప్రీతి మృతిపై U/s.306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act క్రింద మట్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సైంటిఫిక్ , టెక్నికల్ , మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు(బాధితురాలు).. నిందితుడు, వాళ్ల వాళ్ల మిత్రులు వాడిన సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా ర్యాగ్గింగ్ పేరుతో వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం అని ప్రకటించారు సీపీ రంగనాథ్. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై కన్నుమూసింది. ఈ కేసులో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కాగా.. దాని ఫలితాన్ని ఏప్రిల్‌లో ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని వెల్లడించారు. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు జూన్‌లో ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండడం గమనార్హం. -
ప్రీతి ఘటనపై వివరాలివ్వండి
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌దాస్‌ను ఆదేశించారు. ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు? ప్రీతి ఆత్మహత్యకు అనస్తీషియా తీసుకోవడమే కారణమా? ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు? ఎవరి సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు? అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు. అలాగే, ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ పేర్కొన్నారు. ఎంజీఎంలో రెఫరల్ వైద్యమా? ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో రెఫరల్ వైద్యం పేరుతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే విషయంపై గవర్నర్ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆస్పత్రిలో సదుపాయాలు, వైద్యుల కొరత ఉందా? అనే అంశంపైనా ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, బాధితులను హైదరాబాద్‌కు తరలించే విధానంపైనా నివేదిక పంపాలని కోరారు. -
మెడికో ప్రీతి కన్నుమూత.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) కన్నుమూసింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రాణాలు విడిచినట్టు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీనితో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పాలని, నిందితుడు సైఫ్, కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీíÙయా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు చేపట్టేదాకా మృతదేహాన్ని తరలించబోమంటూ నిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి తర్వాతా నిమ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిరి్నతండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీíÙయా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయతి్నంచారు. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. అవయవాలన్నీ దెబ్బతినడంతోనే.. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకపోయిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతి డ్యూటీలో ఉండగా తన వద్ద ఉన్న సక్సినైల్‌కోలైన్ ఇంజక్షన్ తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, ఆస్పత్రికి తీసుకొచి్చన తర్వాత వెంటిలేటర్‌పై, ఎక్మో యంత్రంపై అత్యవసర వైద్యసేవలు అందించామని తెలిపారు. మొత్తంగా ఆమె నాలుగు సార్లు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురైందని, అందులో నిమ్స్‌కు రాకముందే రెండుసార్లు వచ్చిందని వివరించారు. ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్ కారణంగా గుండె రక్తం పంప్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్) 28శాతానికి పడిపోయిందని.. గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటిస్, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రీతి అప్పటికే థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు గుర్తించామని వివరించారు. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కలి్పంచుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. నిమ్స్ వద్ద ఆందోళన.. ఉద్రిక్తత ప్రీతి మృతి చెందినట్టుగా ప్రకటించిన నిమ్స్ వైద్యులు మృతదేహాన్ని నేరుగా వరంగల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చి మృతదేహాన్ని చూసి సంతకం పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు దీనికి నిరాకరించారు. ప్రీతి మృతికి అసలు కారణమేంటో తేల్చాలని, ఏ ఇంజెక్షన్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్ఐసీయూ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటిదాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమన్నారు. ప్రీతిని వేధించిన సైఫ్, మరో ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేఎంసీ అనస్తీషియా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి వైద్య విద్యార్థులు, గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు, బీజేపీ నేతలు మద్దతుగా నిలవడంతో ఆదివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయతి్నంచినా ఎవరూ ఆందోళన విరమించలేదు. దీనితో భారీగా బలగాలను మోహరించారు. మృతదేహాన్ని బయటికి తెచ్చి.. మళ్లీ లోపలికి.. నిమ్స్‌లో ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే.. మరోవైపు వైద్యులు, పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయతి్నంచారు. దీంతో ఆందోళనకారులు అక్కడికి వచ్చిన అంబులెన్స్ ముందు బైఠాయించి, దానిని వెనక్కి పంపారు. దీనితో అధికారులు మరో అంబులెన్స్‌ను తీసుకురాగా.. మృతదేహాన్ని ఆర్ఐసీయూ నుంచి బయటికి తీసుకురాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్ఐసీయూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆందోళన విరమించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చే రోగులకు ఇబ్బందికలుగుతోందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రికి మృతదేహం సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
KMC: వైద్యకళాశాలలో మరోసారి ర్యాగింగ్ కలకలం
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ( కేఎంసీ )లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. సీనియర్ విద్యార్థులు మద్యం మత్తులో ఫ్రెషర్స్ డే పేరుతో జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ట్విట్టర్ లో ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం అందరిని ఆందోళన కు గురిచేస్తుంది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి, అలాంటిది ఏమి లేదని తేల్చారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ద్వారా ఆరా తీస్తున్నారు. వరంగల్ కేఎంసీలో ట్విట్టర్ వేదికగా ర్యాగింగ్ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినీయర్స్ 50 మంది మద్యం తాగి తమను వేధిస్తున్నారని ట్వీట్టర్ ద్వారా రెడ్డి పేరుతో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయంపై ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు ను వివరణ కోరగా అలాంటిది ఏమిలేదన్నారు. జూనియర్ విద్యార్థుల హాస్టల్, సీనియర్ల హాస్టల్ భవనాలు దూరంగా ఉంటాయని తెలిపారు. సీనియర్లు కొందరు జన్మదిన వేడుకలు చేసుకున్నారని, ఆ సందర్భాన్ని గిట్టనివారు ఇలా చిత్రీకరిస్తున్నారని తేల్చిచెప్పారు. కేఎంసీలో జరగాల్సిన ప్రెషర్ డే కు సైతం అనుమతి ఇవ్వలేదన్నారు. ట్విటర్ లో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసు కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు కేఎంసీలో విచారణ నిర్వహించారు. ర్యాగింగ్ పై తమకు విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఏసీపీ గిరికూమార్ తెలిపారు. ట్విట్టర్ లో వచ్చిన ఫిర్యాదు పై సైబర్ క్రైమ్ ద్వారా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గిరి కూమార్ - ఏసిపి, వరంగల్. రెండు మాసాల క్రితం ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కళాశాలలో ర్యాగింగ్ కు గురయ్యారనే ప్రచారం జరిగింది. తాజాగా మద్యం మత్తులో సీనియర్స్ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని జూనియర్ విద్యార్థిగా అజ్ఞాత వ్యక్తి ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రి, హోంమంత్రి, రాష్ట్రమంత్రి కి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. నిప్పులేనిదే పొగరాదని స్థానికులు భావిస్తున్నారు. -
టూమచ్: గడ్కరీ ట్వీట్ చేశాకే అందరికీ తెలిసింది
Kuthiran Tunnel: ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ప్రాజెక్టు లాంఛింగ్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కనీస సమాచారం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేరళ కుథిరన్ టన్నెల్.. ఎన్‌హెచ్ 544పై మన్నూథి-వడక్కన్‌చెరి మధ్య కేరళ సర్కార్ నిర్మించిన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్(సొరంగ మార్గాలు). శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే తెరుచుకోవడం అక్కడి మంత్రులు, అధికారుల్ని విస్మయానికి గురి చేసింది. తిరువనంతపురం: కుథిరన్(త్రిస్సూర్) వద్ద కేరళ-తమిళనాడు, కర్ణాటక జాతీయ రహదారులను కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చేది. అంతేకాదు ఇరుకు రహదారి, ప్రమాదకరమైన మలుపులతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో ఆరు లైన్ల రోడ్డుకి అనుసంధానిస్తూ.. పీచీ-వలహని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద కొండల్ని తొలగించి సుమారు 964 మీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సొరంగం వల్ల కొచ్చి-కొయంబత్తూర్‌ల మధ్య దూరం 3 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రధాన ట్రాఫిక్ సమస్య-ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని కేరళ భావించింది. హైదరాబాద్‌కు చెందిన కేఎంసీ కంపెనీ, సబ్‌కాంట్రాక్ట్‌తో ది ప్రగతి గ్రూప్‌లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి. 2016, జూన్‌లో టన్నెల్ పేలుడుతో మొదలైన పనులు.. ఐదేళ్లుగా నడుస్తూ వచ్చాయి. దీంతో సౌత్‌లోనే ఇదొక సుదీర్ఘమైన ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. సుమారు 200 కోట్లు(లెక్కల్లో 165 కోట్లు), ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు సొరంగ మార్గాల నిర్మాణం పూర్తైంది. అయితే ఒకవైపు నిర్మాణ సంస్థ నుంచి మరోవైపు ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఈ సొరంగాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని ఆరాతీయగా.. ఆగస్టులో ఈ టన్నెల్ లాంఛింగ్ ఉండొచ్చని బదులిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేసేదాకా.. కేరళ అధికారులకు, మంత్రులకు, ఆఖరికి సదరు కంపెనీకి సైతం ఈ సొరంగ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలియకపోవడం విశేషం. We will open one side of the Kuthiran Tunnel in Kerala today. This is the first road tunnel in the state and will drastically improve connectivity to Tamil Nadu and Karnataka. The 1.6 km long tunnel is designed through Peechi- Vazahani wildlife sanctuary. pic.twitter.com/9yG0VhrsLq — Nitin Gadkari (@nitin_gadkari) July 31, 2021 ఇక సాయంత్రం ఐదు గంటలకు త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ హరిత కుమార్‌కు, ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌కు మాత్రమే కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వాళ్లు టన్నెల్ దగ్గరికి చేరుకుని.. 7గం.55ని.ఎడమ టన్నెల్‌ను ప్రారంభించగా సామాన్యుల రాకపోకలను అనుమతి లభించింది. అయితే ఇది దారుణమని, అయినప్పటికీ ప్రజలకు పనికొచ్చే పని కావడంతో విమర్శలు-వివాదం చేయదల్చుకోలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు కుడి సొరంగమార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజల నుంచి టోల్ కలెక్షన్, మన్నూథి-వడక్కన్‌చెరీ ఆరులేన్ల రోడ్(కిలోమీటర్ మేర) పూర్తయ్యాకే వసూలు చేయాలని కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు కేరళ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణ సమయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపించాయి కాబట్టి. -
ఇంక్యుబేటర్ కంటే తల్లి పొత్తిళ్లే ఎంతో మేలు
సాక్షి,సిటీబ్యూరో: నెలలు నిండకుండా.. తక్కువ బరువుతో జన్మించే శిశువుల కోసం నిలోఫర్ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘కంగారూ మదర్ కేర్’ (కేఎంసీ) సర్వీసులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంక్యుబేటర్ సపోర్ట్ సహా పైసా ఖర్చు లేకుండా స్వయంగా తల్లే తన బిడ్డను కాపాడుకునేఅవకాశం ఉండడంతో ఈ సేవలకు డిమాండ్ బాగా పెరిగింది. శిశు మరణాల రేటును 40 శాతం తగ్గించడమే కాకుండా 55 శాతం ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండా తక్కువ బరువుతో జన్మిస్తుండగా, మనదేశంలో 8 మిలియన్ల మంది పుడుతున్నారు. వీరిలో 60 శాతం మందికి ‘కంగారూ మదర్ కేర్’ సర్వీసులు అవసరం అవుతుంటాయి. ప్రతిష్ఠాత్మాక నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో రోజుకు సగటున 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతుంటే, వీటిలో ఆరు నుంచి ఏడుగురు శిశువులకు ‘కేఎంసీ’ సర్వీసులు అవసరమవుతున్నాయి. ఇంక్యుబేటర్ విధానం ఖర్చుతో కూడుకున్నది కాగా.. ‘కేఎంసీ’లో ఎలాంటి ఖర్చు ఉండదు. దీంతో నిరుపేద తల్లులు తమ బిడ్డలను సంరక్షించుకునేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తల్లీ,బిడ్డల మధ్య ఆత్మీయ స్పర్శను పెంచుతుంది. ఆశించిన స్థాయిలో మానసిక, శారీరక ఎదుగుదల ఉండడంతో పాటు ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ అయ్యేందుకు దోహదపడుతుంది. 14 వేల మంది పిల్లలకు సేవలు జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలుత నల్లగొండ జిల్లా, సిద్దిపేట ఆస్పత్రుల్లో ఈ సేవలను ప్రారంభించింది. తర్వాత 2017 నవంబర్‌లో నిలోఫర్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఈ ‘కంగారూ మదర్ కేర్’ యూనిట్లో రోజుకు సగటున 20 మంది శిశువులకు సేవలు అందిస్తున్నారు. ఇలా గత రెండేళ్లలో 14 వేలకు పైగా శిశువులకు సేవలను అందించారు. తల్లే తన బిడ్డను సంరక్షించుకునే అవకాశం ఉండడంతో కేవలం నిలోఫర్‌లో ప్రసవించిన తల్లిబిడ్డలకే కాకుండా ఇతర ఆస్పత్రుల్లో జన్మించి, కేఎంసీ సర్వీసులు అవసరమైన తక్కువ బరువుతో జన్మించిన(ఆరోగ్యం నిలకడగా ఉన్న) శిశువులకు రోజుకు సగటున నాలుగు నుంచి 12 గంటల పాటు ఈ కేఎంసీ సేవలు అందిస్తున్నారు. ‘‘సాధారణంగా నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడేందుకు వైద్యులు కొన్ని రోజుల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఇందులో తల్లి ఓ చోట.. బడ్డ మరోచోట ఉంటారు. అయితే, ‘కంగారూ మదర్ కేర్’లో అలాంటి బిడ్డను ఓ గుడ్డలో చుట్టి తల్లి ఛాతిపైనే పడుకోబెడతారు. దీని ద్వారా తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు అందడంతో తల్లి పాలు తాగేందుకు వీలుంటుంది. ఫలితంగా బిడ్డ త్వరగా బరువు పెరిగి వేగంగా కోలుకోడడంతో పాటు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందడదు. తల్లి ఛాతిపై బిడ్డ పడుకోవడంతో ఆమె గుండె చప్పుడు, పల్స్‌ను వినడం ద్వారా బిడ్డలో వినికిడి శక్తి పెరుగుతుంది. వాస్తవానికి పుట్టిన బిడ్డకు మీటర్ దూరం దాటిన వస్తువులను, మనుషులను చూడలేదు. కానీ ‘కంగారూ మదర్ కేర్’ ద్వారా తల్లిని తరచూ చూడ్డంతో చూపు కూడా వేగంగా మెరుగుపడుతుంది.’’ కేఎంసీతో ఎన్నో లాభాలు.. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ‘కంగారూ మదర్ కేర్’ను సూచిస్తారు. స్కిన్ టచ్ వల్ల తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెరుగుపడుతాయి. ఆకలితో బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలను పడుతుండడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ మెరుగుపడుతుంది. తల్లిపాలలోని బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతోంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. త్వరగా జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. బిడ్డ శ్వాస నాళాల పనితీరు మెరుగుపడడంతో పాటు భవిష్యత్‌లో శ్వాస సంబంధ సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు.– డాక్టర్ రమేష్, ఆర్ఎంఓ, నిలోఫర్ -
కేఎంసీ వర్సెస్ ఎంజీఎం
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి వచ్చే మృతుల బంధువులకు సమస్యలు తప్పడంలేదు. ఆస్పత్రి అధికారులకు, ఫోరెన్సిక్ వైద్యసిబ్బందికి మధ్య తలెత్తిన వివాదం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఎంజీఎంలో మృతి చెందిన రోగులను పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి పిల్లల విభాగం మీదుగా తరలిస్తారు. అయితే ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న పోస్టుమార్టం విభాగానికి పీడియాట్రిక్ విభాగానికి మధ్య ఓ గేటు ఉంటుంది. బుధవారం ఉదయం ఈ గేటుకు ఫోరెన్సిక్ విభాగం వైద్యనిపుణులు తాళం వేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిచేందుకు బంధువులు మూడు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు చివరకు అంబులెన్స్ సాయంతో మార్చురీకి తరలించారు. అధికారుల నడుమ వివాదం పోస్టమార్టం ప్రాంగణం ఎంజీఎం ఆవరణలో ఉండగా ఇందులో విధులు నిర్వర్తించే వైద్యులకు సంబంధించిన ఫోరెన్సిక్ విభాగం కేఎంసీ పరిధిలో ఉంటుంది. అయితే పోస్టుమార్టానికి అవసరమైన గ్లౌజులు, సిరంజ్‌లు ఇతర సామగ్రి ఎంజీఎం ఆస్పత్రి నుంచే సరఫరా అవుతాయి. మార్చురీలో వసతులు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కేఎంసీ అధికారులదే. ఈ విషయంలో నెలకొన్న వివాదం గేటుకు తాళం వేసే వరకు వచ్చింది. ఎంజీఎం అధికారుల తీరుతోనే తాళం వేశాం పోస్టుమార్టం నిమిత్తం ఉపయోగించే గ్లౌజులు, సిరంజిలు తదితర సామగ్రిని కొన్నేళ్లుగా ఎంజీఎం ఆస్పత్రి అధికారులే సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సామగ్రిని అందించమని కేఎంసీ నుంచి తెచ్చుకోవాలని సోమవారం పేర్కొన్నారు. అంతే కాకుండా పోస్టుమార్టం మీదుగా ఉన్న గేటు కారణంగా అనవసర రాకపోకలు జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రాంగణాన్ని మలమూత్ర విసర్జనకు ఉపయోగిస్తుండడంతో తాళం వేశాం.. – రజామ్ ఆలీఖాన్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. మార్చురీ ప్రాంగణానికి హద్దుగా ఉన్న గేటుకు తాళం వేసిన విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మార్చురీకి అవసరమున్న గ్లౌజులు అన్ని రకాల వస్తువులు అందిస్తున్నాం. ఫర్నిచర్ విషయంలో మాత్రమే వ్యతిరేకించడం.. ఉన్నతాధికారుల జోక్యంతో గేట్‌కు తాళం తీసాం. – శ్రీనివాస్, సూపరింటెండెంట్ మృతదేహంతో పడిగాపులు మా సోదరి కాలిన గాయాలతో బుధవారం ఉదయం 9 గంటలకు మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు మృతదేహంతో గేట్ వద్దే ఉన్నాము. అయినా తాళం తీయలేదు. మట్టెవాడ పోలీసులకు చెప్పిన తర్వాత ఎంజీఎం అధికారులు స్పందించి అంబులెన్స్ ద్వారా పోస్టుమార్టానికి తరలించారు. చివరకు నాలుగు గంటలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. – రాజు, మృతుడి బంధువు -
ఉత్సాహంగా ఉత్కర్ష
-
సమాజ హితాన్ని కోరండి
కర్నూలు(హాస్పిటల్): ధనార్జనే ధ్యేయం కాకుండా సమాజ హితాన్ని కోరాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సి. వెంకటేశ్వరరావు వైద్యులు, వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కళాశాల 2012 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 200 మెడికల్ సీట్లున్న ఏకైక కళాశాల కేఎంసీ మాత్రమేనన్నారు. ఈ కళాశాలకు దేశంలోనే ప్రత్యేకత ఉందని, ఇందులో అభ్యసించడం అదృష్టమన్నారు. గతంతో పోల్చితే వైద్యవిద్యలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒక విధంగా ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కాస్త దూరం పెంచిందన్నారు. ఇప్పటి విద్యార్థులు ఎక్కువ శాతం సాంకేతికతపై ఆధారపడుతున్నారన్నారు. ఈ కారణంగా చాలా మందిలో నైతికత లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో రోగులు వేగవంతమైన చికిత్స కోరుకుంటున్నారని, ఇందుకు తగ్గట్టు వైద్యులు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రోగుల ఇబ్బందులు పూర్తిగా తెలుసుకుని వైద్యం చేయాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈఎస్ఏ సత్తార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ మాట్లాడారు. చివరగా వివిధ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు, స్నాతకోత్సవ పట్టాలను అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ రాంప్రసాద్, పెద్దాసుపత్రి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు పి. చంద్రశేఖర్, నరేంద్రనాథ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి అందజేశారు. గోల్డ్‌మెడల్ సాధించిన వారు బి. మేఘనారెడ్డి, 2. సి. ప్రవల్లిక, 3. కె. జయసత్య(పీడియాట్రిక్స్), ఎ. కావ్యలహరి(గైనిక్, ఫార్మకాలజి, అనాటమి, ఫార్మకాలజి), జి. వైష్ణవి(జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, అన్నపూర్ణమ్మ మెమోరియల్ మెడల్), యు. శివ(ఈఎన్టీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈ. శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ మెడల్ ), ఎన్. సాయిచరిత(ఆఫ్తమాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పాలుట్ల మహాలక్ష్మమ్మ మెమోరియల్ మెడల్), యాస్మిన్ షేక్(ఫార్మకాలజీ, ఫిజియాలజీ), ఎ. సాహితి, జి.సుమాంజలి(మైక్రోబయాలజి), కోనేటి శ్రీదేవి(బయోకెమిస్ట్రీ, సుబ్బారెడ్డి మెమోరియల్ మెడల్), కేబీ. నవనీత్యాదవ్(బయోకెమిస్ట్రీ, ముక్కామల ఈశ్వరరెడ్డి మెమోరియల్ మెడల్). -
‘కోట్లా’ట
కార్పొరేషన్లో నామినేషన్ దందా! - మొత్తం పనులు తనకే కావాలంటున్న ఎమ్మెల్యే - తమ సంగతేమిటంటున్న ఎంపీ, మాజీ మంత్రి వర్గీయులు - రూ.5.65 కోట్ల పనుల చుట్టూ విభేదాలు - ‘అత్యవసర’ పనులకు తొలగని అడ్డంకులు - ఎవరు చేపట్టాలనే విషయంలో పంతాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ పనుల దందా మళ్లీ తెరమీదకు వచ్చింది. గతంలో ఉన్న కమిషనర్ ఆరు నెలల కిందట ఇచ్చిన ఆదేశాల మేరకు నామినేషన్ పనులు చేపట్టాలని అధికార పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. నామినేషన్ పద్ధతిలో ఒక్కో పని రూ.5 లక్షల విలువతో మొత్తం 113 పనులను చేపట్టేందుకు గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. ప్రధానంగా ఈ పనులను ఎవరు చేపట్టాలనే విషయంలో అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో అడుగు ముందుకు పడలేదు. తాజాగా కొత్త కమిషనర్ వచ్చిన నేపథ్యంలో ఈ నామినేషన్ల పనుల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. మొత్తం 113 పనుల్లో 87 పనులు తనకే కావాలంటూ ఎమ్మెల్యే ఎస్వీ పట్టుబడుతున్నారు. కచ్చితంగా అందరూ సమానంగా తీసుకుని కార్యకర్తలకు ఇవ్వాల్సిందేనని ఎంపీ టీజీ.. పాణ్యం ఇన్చార్జి, మాజీ మంత్రి ఏరాసు పేర్కొంటున్నారు. దీంతో ఈ పనులు కాస్తా ప్రారంభం కావడం లేదు. మొత్తం మీద రూ.5.65 కోట్ల విలువైన నామినేషన్ పనులను దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆరు నెలలు గడిచినా.. అధికార పార్టీ నేతలకు నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ నామినేషన్ పనులను ఎస్‌హెచ్‌జీ, ఎన్జీఓల ద్వారా మాత్రమే చేపట్టాలని పేర్కొన్నారు. ఈ ముసుగులో అధికార పార్టీ నేతలకు అప్పగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా కర్నూలు కార్పొరేషన్లో ఏకంగా 113 పనులను నామినేషన్‌పై అప్పగించేందుకు వీలుగా 31 డిసెంబర్ 2016న అప్పటి కమిషనర్ రవీంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. అత్యవసరంగా చేపట్టాలని పేర్కొంటూ ఈ పనులను నామినేషన్‌పై అప్పగించాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలతో ఈ పనులు కాస్తా ముందుకు సాగలేదు. తాజాగా మళ్లీ ఈ నామినేషన్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. మొత్తం పనుల్లో తనకే మెజార్టీ వాటా అని ఎమ్మెల్యే పేర్కొంటుండగా.. తమ సంగతేమిటని అటు ఎంపీ, ఇటు మాజీ మంత్రి మండిపడుతున్నారు. దీంతో ఈ పనులు కాస్తా ముందుకు సాగేలేదు. కొత్త కమిషనర్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ ఈ నామినేషన్ దందా తెరమీదకు వచ్చింది. అత్యవసరమైతేనే.. వాస్తవానికి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం కేవలం అత్యవసర పనులకు మాత్రమే నామినేషన్ పద్ధతిని ఎన్నుకోవాలని పేర్కొంది. అత్యవసర సమయాల్లో చేయాల్సిన పనులకు టెండర్లు పిలవడం ద్వారా సమయం వృథా అవుతుందనుకున్న సందర్భాల్లో ఈ విధానాన్ని ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ పనులను స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ), స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓ) ద్వారా మాత్రమే చేపట్టాలని కూడా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తోసిరాజని సాధారణ పనులను కూడా నామినేషన్ పద్ధతిలో అప్పగించేందుకు వీలుగా వ్యవహారం తెరమీదకు వచ్చింది. అసలు ఆరు నెలల కిందట అప్పగించిన పనులను ఇప్పుడు చేయడం ద్వారానే అవి అత్యవసరం కాదనే విషయం అర్థమవుతోంది. అయినప్పటికీ కేవలం కమీషన్ల కోసమే ఈ నామినేషన్ దందా తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. -
గజ్జె ఘల్లుమంది.. గుండె జల్లుమంది
– కేఎంసీలో సాంస్కృతిక పోటీలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్యకళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సంగీత, సాహిత్య, నృత్యపోటీలు (సాంస్కృతిక పోటీలు) ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే ఈ పోటీలను రిటైర్డ్ డీఎంఈ, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్ఏ.సత్తార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సాంస్కృతిక శోభ తగ్గిపోయిందన్నారు. నిత్యం వారు చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆటలు, పాటలు, మంచి సాహిత్యం వల్ల వారు జీవితంలో మరింతగా రాణిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం వైద్యవిద్యార్థినిలు హర్షిణి బృందంచే గణేష కేతంచే పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థోపెడిక్ హెచ్‌వోడి డాక్టర్ రఘునందన్ ఆలపించిన అలనాటి సినీగీతం ‘ఈ దివిలో విరిసిన పారిజాతమో...’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి యువనటుల సినిమాల వరకు గీతాలను కూర్చి వైద్యవిద్యార్థులు నృత్యం చేశారు. ఆ తర్వాత ఫిజియాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పావని శాస్త్రీయ నృత్యప్రదర్శన అలరించింది. 2012 బ్యాచ్ వైద్యవిద్యార్థిని సాయిహారిక ఆలపించిన సినీగీతం, సాహితి, వెన్నెల, భరత్, శ్రీహర్ష గ్రూప్ డ్యాన్స్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆకాశవాణి అనౌన్సర్ పోతన, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ గెలివి సహదేవుడు తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కళాశాలలో వందకు పెరిగిన సీట్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సీట్ల సంఖ్యను 25 నుంచి 100కు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం జీవో (85) జారీ చేశారు. సీట్ల సంఖ్యను పెంచాలని గతేడాది నవంబర్ 2న కళాశాల ప్రిన్సిపల్ నుంచి వినతులు వెళ్లాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచేందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా 1982లో కర్నూలు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను 25 సీట్లతో ఏర్పాటు చేశారు. పదేళ్ల క్రితం వరకు ఈ మెడికల్ కళాశాలలోనే ఇది కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా నర్సింగ్ కళాశాలకు సొంత భవనం, వసతి గృహం మంజూరైంది. ప్రస్తుతం ఈ కళాశాల వంద మంది విద్యార్థులకు అనుగుణంగా ఉన్నందున సీట్లను పెంచాలని కళాశాల ప్రిన్సిపల్ కోరారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్లినికల్ సేవలను అందిస్తారు. ఈ మేరకు నాలుగేళ్లకు గాను వచ్చే మూడేళ్లలో 300 మంది విద్యార్థులు ఆసుపత్రిలో సేవలందించే అవకాశం ఉంది. -
కేఎంసీలో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
కర్నూలు(హాస్పిటల్): భారత వైద్య విధాన మండలి నిబంధనల మేరకు కర్నూలు మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనుల కోసం జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన తన ఛాంబర్లో కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తీర్మానాల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్రామప్రసాద్ వివరించారు. కళాశాలలో డిజిటల్ ల్రైబరి కోసం రూ.10లక్షలు, లైబ్రరీలో వసతుల కోసం రూ.7లక్షలు మంజూరు చేశారన్నారు. సెమినార్ హాల్స్‌లో ఏసీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఓల్డ్ సీఎల్జీలోని స్టాఫ్‌క్లబ్ ఆధునీకరణ కోసం రూ.2లక్షలు, ల్యాబ్‌లలో కెమికల్స్ కొనుగోలుకు రూ.11లక్షలు, లైబ్రరీకి జనరల్స్, ఇంటర్నెట్ నెట్స్, కంప్యూటర్స్ కొనుగోలుకు రూ.25లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కళాశాల పరీక్ష హాలులో జామర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారన్నారు. కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సభ్యులుగా తనతో పాటు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ భాస్కరరెడ్డి, డాక్టర్ పద్మ విజయశ్రీ ఉంటారని తెలిపారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డాక్టర్ వెంకటరమణ, ఎన్ఐసీ రాజశేఖర్ పాల్గొన్నారు. -
కేఎంసీలో మహిళా క్రీడలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కళాశాలలోని ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులు, సిబ్బందికి టెన్నికాయిట్ క్రీడలను ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, వార్డెన్ డాక్టర్ స్వర్ణలత, డిప్యూటీ వార్డెన్ డాక్టర్ మాధవీశ్యామల, వైద్యులు ఎస్. లక్ష్మి, ఎ. పద్మవిజయశ్రీ, రేవతి, ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. గురువారం కళాశాలలోని నూతన లెక్చరర్ గ్యాలరీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ 20 రోజుల పాటు కొనసాగిన ఎగ్జిబిషన్లో 35 విభాగాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయన్నారు. జిల్లా నుంచి గాక రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సైతం సందర్శకులు ప్రదర్శన చూసేందుకు రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి విభాగం ఎంతో ఉత్సాహంగా పనిచేయడం వల్లే ఇది విజయవంతం అయ్యిందన్నారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, డాక్టర్ వెంకటేష్ మాట్లాడారు. చివరగా వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విభాగాధిపతులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీదేవి, ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, పి. చంద్రశేఖర్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎగ్జిబిషన్ ఇన్‌ఛార్జి జోజిరెడ్డి, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘పట్టా’భిషేకం
-వారి పేరు ముందు ఇకపై ‘డాక్టర్’ –కేఎంసీలో ఘనంగా స్నాతకోత్సవం దాదాపు ఆరేళ్ల పాటు కలిసి మెలసి తిరిగారు.. ఒకరి భావాలు మరొకరు పంచుకున్నారు.. జూనియర్లు, సీనియర్లు అన్న తేడా లేకుండా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అధ్యాపకులను కన్నవారిలా భావించారు.. వారి చెప్పింది శ్రద్ధగా విన్నారు. రోగుల నాడీ పట్టుకున్నారు.. వారి బాగోగులు చూసుకున్నారు. విజయవంతంగా వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్ పట్ట తీసుకున్నారు. బుధవారం కర్నూలు మెడికల్ కళాశాలలో జరిగిన ఈ పట్టాభిషేకం (సా్నతకోత్సవం) కార్యక్రమాన్ని చూసేందుకు వారి కుటుంబసభ్యులు, స్నేహితులు వచ్చారు. తమ వాడు/ఆమె పేరు ముందు ఇకపై ‘డాక్టర్’ అని రాసుకునే రోజు వచ్చిందని మురిసిపోయారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలోని నూతన ఆడిటోరియంలో 146 మంది 2011 బ్యాచ్ వైద్య విద్యార్థులకు ముఖ్యఅతిథి డీఐజీ రమణకుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చేతుల మీదుగా వైద్యవిద్య పట్టాలను ప్రదానం చేశారు. పట్టాలు తీసుకున్నాక, తీసుకోకముందు ఆడిటోరియం ఆవరణలో వైద్యవిద్యార్థులు సందడి చేశారు. వైద్య విద్య పూర్తయిందన్న విషయాన్ని చెప్పడానికి చిహ్నంగా వారి పట్టాలను గాలిలోకి ఎగురవేశారు. కన్నవారు, కుటుంబసభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం భారమైన హృదయంతో కళాశాల నుంచి బయటకు అడుగులు వేశారు. వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానం –కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానమని కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ చెప్పారు. కర్నూలు మెడికల్ కళాశాలలో బుధవారం జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యవృత్తి సమాజంలో ఓ నోబుల్ ప్రొఫెషన్ అని చెప్పారు. ఎంబీబీఎస్ అనంతరం కొందరు ఐఏఎస్‌లు కూడా అయ్యారని చెప్పారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన కర్నూలు మెడికల్ కళాశాల నుంచి 146 మంది వైద్య విద్యార్థులు ఈ రోజు బయటకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రజలు గమనిస్తారన్నారు. వైద్యుడిగా మీరు నేర్చుకున్నది 25 శాతం మాత్రమేనని, ఇంకా 75 శాతం తెలుసుకోవాల్సి ఉందన్నారు. మీ కెరీర్‌ను మరింత మెరుగులు దిద్దుకోవాలని, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకోవాలన్నారు. అన్నింటికీ ప్రణాళిక అవసరమన్నారు. ప్రణాళికతో ముందుకు వెళితే విజయం ఖాయమన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రోగులను ఆదరించడం.. తల్లిదండ్రులను గౌరవించడం ఎప్పటికీ మరువకూడదన్నారు. మంచి నైపుణ్యాలు గల, మానవత్వంతో కూడిన వైద్యుడిగా సమాజంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోంది –ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోందని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. దానికి అనుగుణంగా భావి వైద్యులు ముందుకు సాగాలన్నారు. వైద్యులకు కమ్యూనికేషన్ స్కిల్స్(భావవ్యక్తీకరణ) ప్రధానమని, రోగులకు మందులు రాసేటప్పుడు అది వారికి అవసరమా అని ఆలోచించుకోవాలన్నారు. మార్పును ఆహ్వానిస్తూ జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకుంటే మంచి డాక్టర్‌గా రాణిస్తారన్నారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. చివరగా బంగారు పతకాలు సాధించిన 9 మంది వైద్య విద్యార్థులకు వాటిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థులు విద్యార్థి పేరు సబ్జక్టులు డి. రాగదీపిక అనాటమి, బయోకెమిస్ట్రీ, పెథాలజి, పీడియాట్రిక్స్ బి. శ్రవణ్‌కుమార్ ఫిజియాలజి ఎ. నిహారిక పెథాలజి, మైక్రోబయాలజి వి. మనోజ్‌రెడ్డి ఫోరెన్సిక్ మెడిసిన్ కె. రవీంద్రనాథ్‌రెడ్డి, కేవీ హరీష్‌కుమార్ ఫార్మకాలజి ఎస్. సుప్రియ ఆఫ్తమాలజి ఎం. జయరామకృష్ణ ఆబ్‌స్ట్రిక్ట్ అండ్ గైనకాలజి సి. సుధాప్రియ(బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్) బయోకెమిస్ట్రీ, ఎస్పీఎం, ఈఎన్టీ, మెడిసిన్, సర్జరీ నాన్న కల నెరవేర్చాను –ముల్లా జైతున్ రుమన్, వైద్యవిద్యార్థి నాన్న ముల్లా అబ్దుల్ కలాం కలను నెరవేర్చాను. ఆయన నేను వైద్యవిద్యను అభ్యసించాలని ఎన్నో కలలు గన్నారు. ఈ రోజు కోసం ఎంతో కాలం ఎదురుచూశారు. కానీ దురదృష్టవశాత్తు నాన్న గత మార్చి నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశయాల మేరకు సోదరి సైతం ఎంటెక్ చదివి, గోల్డ్ మెడల్ సాధించింది. ఎంబీబీఎస్ పూర్తయిన వెంటనే నేను పీజీ ప్రవేశ పరీక్షలోనూ విజయం సాధించడం ఇంకా ఆనందంగా ఉంది. -
కేఎంసీలో పీజీ సీట్లు పెంపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తంగా 153 సీట్లు మంజూరు కాగా అందులో కర్నూలు మెడికల్ కాలేజికి 30 పెరిగాయి. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 నుంచి 20కి, పీడియాట్రిక్స్‌లో 5 నుంచి 8కి, అనెస్తీషియాలో 6 నుంచి 7కు, రేడియాలజిలో 3 నుంచి 6కు, జనరల్ సర్జరీలో 10 నుంచి 20కి, ఆర్థోపెడిక్స్‌లో 8 నుంచి 11కు, ఈఎన్టీలో 4 నుంచి 5కు, గైనకాలజిలో 6 నుంచి 7కు పీజీ సీట్లు పెరిగాయి. కనీసం 90 సీట్లకు పైగా పెరుగుతాయని ఆశించగా 30 సీట్లు మాత్రమే పెరగడం వైద్యవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దమ్ముంటే..మున్సిపల్ ఎన్నికలు నిర్వహించండి
– కర్నూలు నగర సమస్యలు ప్రభుత్వానికి కనిపించవా ? – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ – నగరపాలక సంస్థ ఎదుట మహా ధర్నా కర్నూలు(టౌన్): అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ సవాల్ విసిరారు. కర్నూలు నగరంలో దోమలు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో శనివారం.. నగరపాలక సంస్థ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. అంతకు ముందు చిల్డ్రన్స్ పార్కు నుంచి సీఎస్ఐ చర్చి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ.. ఇన్‌కంటాక్స్ కార్యాలయం మీదుగా నగరపాలక సంస్థ వరకు సాగింది. అక్కడే పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను రూ. కోట్లు డబ్బు పెట్టి కోనుగోలు చేయడం సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు..టీడీపీకి మంచి తీర్పు ఇచ్చారన్నారు. రూ. 200 కోట్లు దండుకున్నారు.. దోమలపై దండయాత్ర పేరుతో టీడీపీ నాయకులు.. రూ. 200 కోట్లు దండుకున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే, కోత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు నగరానికి రూ. 400 కోట్లు వచ్చాయని చెబుతున్న అ«ధికారపార్టీ నేతలు ఏ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద ఎందుకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు. టీడీపీపై విసుగు చెందిన ప్రజలు, మహిళలు ఎన్నికలు వస్తే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ మైనార్టీ సెల్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రెహ్మన్, మద్దయ్య మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల ఇళ్లకే ఫాగింగ్ చేస్తున్నారన్నారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. పన్నులు కడుతున్న ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. నీళ్ల కోసం జాగరణ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కర్నూలు నగర సమస్యలు ఎమ్మెల్యేకు కనిపించవా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, దళిత సంఘం నాయకులు సోమసుందరం, మహిళా నాయకులు సోఫియాఖాతూన్, సలోమి, విజయలక్ష్మీ, మంగమ్మలు మాట్లాడారు. అనంతరం నగరపాలక మేనేజర్ చిన్నరాముడుకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, బీసీ సంఘం నాయకులు రాజశేఖర్, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో మెడికల్ సైన్స్ ఎగ్జిబిషన్
- 21 నుంచి ఏప్రిల్ 4 వరకు - 36 విభాగాల్లో స్టాల్స్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కళాశాలలో విలేకరులకు వెల్లడించారు. గతంలో సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామని, ప్రస్తుతం డైమండ్ ఉత్సవాలు(60 ఏళ్లు) సందర్భంగా ఆ అవకాశం వచ్చిందన్నారు. కళాశాల, ఆసుపత్రిలోని 36 విభాగాల వైద్య విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. లెక్చరర్ గ్యాలరీలో ఆయా విభాగాల ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలిపే షార్ట్‌ఫిల్మ్‌లు సైతం ప్రదర్శిస్తామన్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నామ మాత్రపు ఫీజుతో కొన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. శరీర ధర్మాలు మొదలు వాటిపనితీరు, వ్యాధులు- వైద్య చికిత్సలు, ఆధునిక వైద్యవిధానాలపై రూపొందించిన ప్రదర్శనలు విజ్ఞానదాయకంగా ఉంటాయని తెలిపారు. రూ.20 నామమాత్రపు ప్రవేశరు సుముతో ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా కేఎంసీ వజ్రోత్సవం
డాక్టర్ దువ్వూరు భాస్కరరెడ్డి విగ్రహాం ఆవిష్కరణ – గురువులకు ఘన సన్మానం – అలరించిన సాంస్క్రృతిక కార్యక్రమాలు కర్నూలు(టౌన్): కర్నూలు వైద్య కళశాల వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూ బ్లాక్ లెక్చరర్ గ్యాలరీలో, న్యూ ఆడిటోరియంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని గురువులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక న్యూ లెక్చరర్ గ్యాలరీలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరబాద్‌కు చెందిన ఏషియన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.రామప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామిలు ఘన స్వాగతం పలికారు. గ్యాస్ట్రో ఎంటారాలజి ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ శర్మ తయారు చేయించిన మాజీ ప్రిన్సిపాల్, పెథాలజి విభాగం మాజీ అధిపతి డాక్టర్ దువ్వూరు భాస్కర్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన కుమారుడు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. వైద్య విజ్ఞాన సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నాగేశ్వరరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మెడిసిన్ డిపార్టుమెంట్ హెచ్ఓడీ డాక్టర్ పి.సుధాకర్, కేఎంసీ అల్యుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.వెంకటరమణ, గ్యాస్ట్రో ఎంటారాలజి హెచ్ఓడి డాక్టర్ శంకర్ శర్మ, డెర్మాటాలజి హెచ్ఓడి డాక్టర్ ఐ.సి. రెడ్డి, మాజీ డియంఇ సత్తార్, డాక్టర్ జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను : డాక్టర్ నాగేశ్వరరెడ్డి కర్నూలు వైద్య కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో లెక్చర్ ఇచ్చినా... ఇక్కడికి రావడం సంతృప్తిగా ఉంటుంది. కర్నూలు వైద్య కళాశాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గురువు చెప్పిన పాఠాలు, క్రమశిక్షణను అలవర్చుకుంటే ఉత్తమ వైద్య విద్యార్థిగా రాణించవచ్చు. ఎండోస్కోపి విభాగంలో అనేక నూతన మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు వైద్య విద్యార్థులు నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవాలి. డయాబెటిక్ చికిత్సలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. చిన్నపేగు ద్వారా మధుమేహన్ని ఎండోస్కోపి చేసి నియంత్రించవచ్చు. ఘనంగా గురువులకు సన్మానం సాయంత్రం స్థానిక న్యూ ఆడిటోరియంలో కర్నూలు వైద్య కళశాలలో చదివి ఉన్నత పదవుల్లో పదవీ విరమణ పొందిన మాజీ ప్రొఫెసర్లు, వైద్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ప్రభత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరస్వామి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథరెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ వెంకటరమణ తదితరుల పాల్గొన్నారు. అనంతరం సీనియర్ వైద్యులు, మాజీ కళశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. వజ్రోత్సవాల సందర్భంగా కళశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మార్చిలో కేఎంసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
–ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్య బోధనలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న కర్నూలు మెడికల్ కాలేజిలో వచ్చే మార్చి నెల నుంచి డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కంటే ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు కర్నూలు జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం వినోదాత్మకంగా, విజ్ఞానదాయంగా ఉండే ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో బోధనాసుపత్రిలోని 35 విభాగాల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్యశిబిరాన్ని మూడురోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఫాకల్టీని సగౌరవంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వైద్యనిపుణుల ఆద్వర్యంలో విద్యార్థుల నైపున్యాన్ని అభివృద్ధి చేసేలా వైద్యవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలు, ప్రస్తుత విద్యార్థుల అపురూప విషయాలతో కలిపి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ సావనీర్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో అకడమిక్ అంశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రొఫెసర్లతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల చే స్తామని ప్రిన్సిపల్ డాక్టర్ రామప్రసాద్ వెల్లడించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రామక్రిష్ణనాయక్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్.వెంకటరమణ, వైద్యులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్‌పై శీతకన్ను!
కేంద్ర నిధులతో ప్రభుత్వ ప్రచారం - నగరాభివృద్ధికి రూ.50కోట్లు ఇస్తామని సీఎం ప్రకటన - ఏడు నెలలు గడిచినా ఆ ఊసే కరువు - ఒక్క రూపాయి కూడా ఇవ్వని వైనం - అభివృద్ధి పనులన్నీ నత్తతో పోటీ - కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతల అనుయాయులకే.. - కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పనులు - కేవీఆర్ కళాశాల స్థలంపై నేతల కన్ను సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు కార్పొరేషన్‌పై శీతకన్ను వేసింది. కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విదిల్చని పరిస్థితి. కేవలం కేంద్ర నిధులతోనే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కేంద్రం సాక్షిగా కార్పొరేషన్‌కు రూ.50 కోట్లను కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీకే దిక్కులేకుండా పోయింది. ఆరేడు నెలలు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కర్నూలుపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. పైగా కేంద్ర నిధులతో కార్యక్రమాలు చేపడుతూ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. అంతేకాకుండా ఈ పనులన్నీ తమ అనుయాయులకే అప్పగిస్తూ పర్సెంటేజీల వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఫలితంగా కృష్ణా పుష్కరాల సందర్భంగా పూర్తి చేయాల్సిన పనులు సైతం ఇప్పటికీ నత్తతో పోటీపడుతున్నాయి. మొత్తం మీద కర్నూలు కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం పర్యటనతోనైనా ఇస్తామన్న నిధులు విదుల్చుతారో లేదో చూడాల్సి ఉంది. అన్నీ కేంద్రం నిధులతోనే.. వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతో చేపడుతున్నవే. అమృత్ పథకం కింద వచ్చిన నిధులతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణతో పాటు డ్రెయినేజీల నిర్మాణం, తదితర పనులన్నీ అమృత్ పథకం కింద వచ్చిన నిధులవే. వీటితో కార్యక్రమాలు చేపడుతూ ఈ క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా చేసుకుంటున్నారు. కేంద్రం నిధులతో చేపడుతున్న ఈ పనుల కాంట్రాక్టులు మాత్రం అధికార పార్టీ నేతలే చేస్తున్నారు. ఇక నిధుల కేటాయింపులోనూ కేవలం కొన్ని ప్రాంతాలకే కేటాయిస్తున్నారు మినహా సమదృష్టితో అన్ని వార్డులకు కేటాయిస్తున్న సందర్భాలు లేవు. అన్ని పనుల్లోనూ అధికార పార్టీ నేతలు పర్సెంటేజీలు డిమాండ్ చేస్తూ పనులు సాగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొనసా..గుతున్న పనులు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పనులు కూడా నత్తతో పోటీ పడుతున్నాయి. రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. ఇక కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన.. వై–జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్, సి.క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రోడ్ల వెడల్పు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు ఒక్క రోజు జరిగితే మూడు రోజులు నిలిచిపోతున్నాయి. అంతేకాకుండా అధికార పార్టీ నేతల అనుచరులకు బంకులు వేయించేందుకు కేవీఆర్ కాలేజీ స్థలాన్ని దౌర్జన్యంగా లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. చెత్త సేకరణ పేరుతో అధికార పార్టీ నేతలు మాత్రం నాలుగైదు ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతోనైనా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాళ్లు విదులుస్తుందా? మళ్లీ హామీలతోనే సరిపెడుతుందా అనేది వేచి చచూడాల్సిందే. -
కేఎంసీలో ఎంబీబీఎస్ నూతన అడ్మిషన్లు
ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో వెబ్ కౌన్సిల్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్లో హాజరైన విద్యార్థులకు ర్యాంకులు, వెబ్ ఆప్షన్ల ప్రకారం ఆయా కళాశాలల్లో సీట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కేఎంసీ కళాశాలకు 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం 38 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు ఆయన వివరించారు. మిగతా విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా కళాశాలలో అడ్మిషన్ పొందాలని..లేకుంటే 26న కళాశాలలో ఖాళీగా ఉన్న స్థానాలను యూనివర్సిటీకి తెలియజేయడం జరుగుతుందన్నారు. చివరి రోజు ఆదివారం బ్యాంకుకు సెలవుదినం కావడంతో విద్యార్థులు కళాశాలలకు సమర్పించే చాలన్లను కళాశాలలో అందుబాటులో ఉంచామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. -
హృదయం.. విజయనాదం
– గుండెచప్పుళ్లతో మారుమోగిన కేఎంసీ – తొలిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ – కల సాకారం చేసిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు మెడికల్ కళాశాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఓ వైద్యుడి కృషి కేఎంసీని ఖ్యాతిని కీర్తిపతాకాన నిలబెట్టింది. ఎన్నో అవమానాలు.. హేళలను భరించి తాను విద్యనభ్యసించిన కళాశాలలో ఓపెన్ హార్ట్ సర్జరి చేయాలనే కసి అతనిలో పెరిగింది. ఆయన మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. పేద హృద్రోగులకు మెరుగైన సేవలందించే అవకాశం ఏర్పడింది. ‘నా అమృత హస్తాల్లో మీరు క్షేమం’ అని మరో సారి కర్నూలు పెద్దాసుపత్రి స్టెత్ ఎగరేసి భరోసా నిచ్చింది. కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు పెద్దాసుపత్రిలో మొదటిసారి నగరంలోని వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన సాజిదాబీ(22)కి గురువారం రాత్రి నిర్వహించిన ఓపెన్‌హార్ట్ సర్జరీ విజయవంతమైంది. ఎందరో డాక్టర్ల గుండెచప్పుళ్లు విజయ నాదంతో మారుమోగాయి. ఈ సందర్భంగా శుక్రవారం కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన భావోద్వేగతంతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. – కర్నూలు(హాస్పిటల్) ‘ఏమయ్యా 60 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నావు...ఇంకా కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజి)లో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయడం లేదా...అని హైదరాబాద్‌లోని గాం«ధీ హాస్పిటల్లో హేళన చేసేవారు. వైజాగ్‌లోనూ ఇదే విధంగా అవమానపరిచారు. చివరకు ఈ ఆసుపత్రిలోనూ నన్ను కొందరు అడుగుపెట్టనీయడానికి ఇష్టపడలేదు. నాకు వార్డునిచ్చేందుకు కూడా అడ్డుపడ్డారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ నాకు వార్డు చూపించారు. మూడేళ్ల కాలంలో దాన్ని ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసే స్థాయికి తీసుకొచ్చాను. ఆనాడు చేసిన హేళనలు, చిన్నచూపు నాలో కసిని పెంచాయి. ఆ కసితోనే మొదటిసారి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించాను. ఎంతో ఆనందగా ఉంది. కేఎంసీ చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నా గురువులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ డబ్లు్య సీతారామ్, డాక్టర్ సుదర్శన్‌ల నుంచి స్నేహం, సేవాగుణం, ఆపరేషన్‌కు ముందు చేసే హోమ్‌వర్క్ వంటి అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా నాకు విద్యాబుద్ధులు చెప్పిన కేఎంసీపైనే ధ్యాస ఉండేది. నేను చదివిన కాలేజిలో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాలని భావించి ఇక్కడికి బదిలీపై రావాలని ఫైలు చంకనపెట్టుకుని అధికారుల చుట్టూ తిరిగాను. ఈ సందర్భంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌తో పాటు కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రోత్సాహంతో ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్ ఏర్పాటైంది. కళాశాల డైమండ్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఓపెన్‌హార్ట్ సర్జరీ ఒక బహుమతిగా ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు చివరగా ఉంది, మరోవైపు తెలంగాణా రాష్ట్రంలోనూ ఇక్కడి రోగులకు చికిత్స అందించడం లేదు, ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇక్కడి పేదరోగులకు నాణ్యమైన హృద్రోగసేవలందించాలనే ఉద్దేశంతో ఓపెన్‌హార్ట్ సర్జరీ ప్రారంభించాం’. ఇద్దరి పట్టుదలతోనే ఆపరేషన్లు ప్రారంభం: ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పట్టుదలతోనే తక్కువ సమయంలోనే ఈ విభాగం ఏర్పాటై, గుండె ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసేందుకు ఎంతో శ్రమించాం. అందరి సహకారంతో ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్రంలోనే నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కర్నూలు ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. వెయ్యికి పైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యికిపైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఆయన కర్నూలు మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్, జనరల్ సర్జరీలో పీజీ చదివారు. అనంతరం జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో కొంతకాలం జనరల్ సర్జన్‌గా, కోడుమూరు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇదే సమయంలో పత్తికొండ సీహెచ్‌సీలోనూ వారానికి రెండుసార్లు వెళ్లి ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించేవారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజిలో కార్డియోథొరాసిక్ కోర్సును అభ్యసించారు. ఆతర్వాత కర్నూలు మెడికల్ కాలేజిలో కార్డియోథొరాసిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గాంధి, వైజాగ్, నెల్లూరులో పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యికి పైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు నిర్వహించారు. -
కేఎంసీలో ‘మెడికల్ కౌన్సిల్’ తనిఖీలు
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని ఎంజీఎం, సీకేఎం, నేత్ర వైద్యశాల, హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, భీమారంలోని టీబీ ఆస్పత్రులలో గురువారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు తనిఖీలు చేశారు. కేఎంసీలో 200 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలతో పాటు ఫ్యాకల్టీ, పరికరాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కోల్‌కతాకు చెందిన అభిమన్యు బస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వి.కె.దాస్, మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన పి.కె. ఖచార్, ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన రవీంద్రసింగ్ రాజ్బుట్ల బృందం తనిఖీలు చేపట్టింది. ఇద్దరు సభ్యులు కెఎంసీలో, మరో ఇద్దరు కేఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీలోని, బాలుర, బాలికల హాస్టళ్లను పరిశీలించారు. కళాశాలలో ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలను చూశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖర్, దొడ్డ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, సీతమహాలక్ష్మి, పుషే్పందర్నాథ్ పాల్గొన్నారు. ఎంజీఎంలో తనిఖీలు.. కేఎంసీకి బోధనాస్పత్రిగా ఉన్న ఎంజీఎంలో ఎంసీఐ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఓపీ, క్యాజువాలిటీ, మెడికల్, సర్జరీ, అర్థో, అపరేషన్ థియేటర్, ఏఎంసీ, ఐసీసీయు, ఐఎంసీ, ఐసీఎస్యు వంటి అత్యవసర వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఎంసీఐ బృందం ముందు నిరసన.. కేఎంసీలో ఎంసీఐ సభ్యులు నిర్వహిస్తున్న ఆయా విభాగాల వైద్యుల హెడ్ కౌంట్ విషయంలో వివాదం తలెత్తింది. ఉదయం 11 గంటల సమయంలో విభాగాల వారీగా ఉన్న వైద్యుల కౌంట్ తెలుపాలని ఎంసీఐ సభ్యులు ఉత్తర్వులు జారీ చేయగా ఆ సమయంలో కొంత మంది వైద్యులు అపరేషన్ థియేటర్లో ఉండడంతో పాటు రాత్రి వేళలో విధులు చేసిన వైద్యులు అలస్యంగా హాజరుకావడం వల్ల కొంత మంది వైద్యులు సంతకాలు చేయలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అన్ని విభాగాల వైద్యులు కేఎంసీకి చేరుకుని హెడ్ కౌంట్‌కు హాజరు కాగా అలస్యంగా వచ్చిన వైద్యుల కౌంటింగ్‌ను పరిగణలోకి తీసుకోమని ఎంసీఐ సభ్యులు తెలుపడంతో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ జోక్యం చేసుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులకు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
కేఎంసీలో పీజీ సీట్ల పెంపునకు తొలి అడుగు
ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్‌స్పెషాలిటీ విభాగంలో పీజీ సీట్ల పెంపు కోసం అధి కారులు తొలి అడుగు వేశారు. కేఎంసీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సీట్ల పెంపు కోసం అధికారులు ప్రయత్నించ లేదని తెలుస్తోంది. మొట్ట మొదటిసారిగా 14 పీజీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఆరోగ్య వర్సిటీ అఫిలి యేషన్ పొంది కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వివరాల్లోకి వెళితే.. కేఎంసీకి అనుబంధంగా ఉన్న ఎంజీ ఎంలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రీక్ సర్జరీ, యూరాలజీ, డీఎం నియోనాటాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండడంతోపాటు వైద్యసేవలు మెరుగుపడడంతో కేఎంసీ అధికారులు పీజీ సీట్ల పెంపునకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీకి నాలుగు, యూరాలజీకి నాలుగు, పిడియాట్రికీ సర్జరీకి నాలుగు సీట్లతోపాటు డీఎం నియోనాటాలజీ విభాగానికి మరో రెండు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో పాటు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ పొందడంతో సీట్ల పెంపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరిట రూ. 8 లక్షల డీడీని సైతం ప్రతిపాదనలతో పంపించారు. కాగా, ఈనెల 31వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి సీట్ల పెంపు కోసం ఎంసీఐకి సిఫారసు చేయనుంది. దీంతో ఎంసీఐ బృందం సీట్ల పెంపునకు కావాల్సిన పరికరాలు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో ఉన్నారా.. లేదా అని కేఎంసీలో తనిఖీ చేసిన ఆనంతరం సీట్లు మంజూరు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. డీఎంఈతో ప్రత్యేక సమావేశం : ప్రిన్సిపాల్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు డీఎంఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీజీ సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో డీఎంఈతో జరిగిన సమావేశంలో ఎంసీఐ తనిఖీ చేసే సమయానికి ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలతో వైద్య సిబ్బందిని నియమించాలని కోరామన్నారు. దీనికి అన్ని విధాల సహకరిస్తామని డీఎంఈ రమణి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు : డాక్టర్ బలరాం పిడియాట్రిక్ విభాగంలో డీఎం నియోనాటాలజీ వంటి సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్ల పెంపుతో నవజాత శిశు సంరక్షణ మరింత మెరుగుపడుతుందని పిడియాట్రిక్ విభాగాధిపతి, డాక్టర్ బలరాం అన్నా రు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకంతో అత్యున్నత వైద్య విద్య కోర్సులు కేఎంసీకి వస్తాయని పేర్కొన్నారు. -
ముగిసిన ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు
ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం మెడిసిన్ విభాగంలో ఆధ్వర్యంలో సంయుక్తగా నిర్వహిస్తున్న రెం డు రోజుల ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగి సింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడా రు. వరంగల్ ఫిజిషియన్ల చాప్టర్ అధ్యక్షులు వి.చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి పవన్, కోశాధికారి జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి సదస్సుకు కేఎంసీ విద్యార్థి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజ్(కేఎంసీ) విద్యార్థి పృథ్వీరాజ్ జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికయ్యాడు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్..విద్యార్థిని అభినందించారు. ఎస్. పృథ్వీరాజ్.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జీర్ యూనిట్–2లో పీజీ జనరల్ సర్జరీ ఫైనలియర్ చదువుతున్నారు. గత నెల 30, 31వతేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సుకు హాజరై సర్జరీలకు సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. ఏపీ, తెలంగాణ , చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 300 మంది పీజీ విద్యార్థులు పాల్గొనగా పథ్వీరాజ్ ప్రతిభ కబరిచారు. దీంతో ఆయనను వచ్చే డిసెంబర్లో మైసూర్లో జరిగే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా(అపికాన్) జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక చేశారు. విద్యార్థి పథ్వీరాజ్‌ను జనరల్ సర్జరీ విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ మోహన్‌లాల్‌నాయక్, వైద్యులు మాధవీశ్యామల, జయరామ్, మల్లీశ్వరి తదితరులు అభినందించారు. -
వైద్య మయూరం
-
లక్ష్య సాధనకు క్రీడలు
కర్నూలు(హాస్పిటల్): లక్ష్యసాధనలో క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని కర్నూలు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థి(1975వ బ్యాచ్, మిస్టర్ కేఎంసీ) డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కళాశాల 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి స్పోర్ట్స్‌డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి, అన్న స్ఫూర్తితోనే ఆనాడు క్రీడాకారునిగా రాణించానని గుర్తు చేసుకున్నారు. రోజుకు ఆరు గంటల పాటు వ్యాయామం చేసేవానని చెప్పారు. ఆనాడు అలా చేయడంతతో నేడు రోజుకు 230 బటన్హోల్ ఆపరేషన్లు చేయగలుగుతున్నానని, 1.35లక్షలు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేశానని తెలిపారు. ఆనాడు అథ్లెటిక్ చాంపియన్, కోకో కెప్టెన్, వెయిట్ లిఫ్టింగ్‌లలో పతకాలు సాధించినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి రోజూ వ్యాయామం చేయాలని, క్రీడల్లో పాల్గొని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలన్నారు. – జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ మాట్లాడుతూ వైద్యులు దేవునితో సమానమని, పోలీసు కూడా సామాజిక వైద్యుడన్నారు. ర్యాగింగ్ చట్టవ్యతిరేకమని, కళాశాలలో యాంటిర్యాగింగ్ స్వా్కడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల మతి చెందిన రిషితేశ్వరి తల్లిదండ్రుల బాధను ప్రతి విద్యార్థి ఊహించుకోవాలని సూచించారు. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. – కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో వైద్యవిద్యార్థులు క్రీడలతో పాటు ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు. కళాశాలలో జిమ్‌ను ఆధునీకరిస్తామని, యోగా, మెడిటేషన్ బందాలను ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాలలోని సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. – అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడారు. అనంతరం వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. – కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జోజిరెడ్డి, మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ మధుసూదన్‌రావు, ఫిజికల్ డైరెక్టర్ రామకష్ణప్రసాద్, ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో పతిభ చూపిన విద్యార్థులు ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పల్మనాలజి పీజీ విద్యార్థి డాక్టర్ పీడీ ఆంజనేయులు ఒక బంగారు, రెండు వెండిపతకాలు సాధించారు. క్రికెట్లో ఆర్. రాఘవప్రీతమ్, జి. సాయిమనీష్‌రెడ్డి, కె.భార్గవ్, సౌత్‌జోన్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్‌లో ఎన్ఆర్ హరీష్, వీడీఎల్ రాహుల్, బాల్‌బాడ్మింటన్,కబడ్డీలో బి. మహేష్‌నాయక్, తేనె సుధాకర్, కబడ్డీలో వై. గణేష్, తేనె సుధాకర్, మ్యాత్యూ, క్రికెట్లో పి. రాఘవప్రీతమ్, జి. సాయిమనీష్‌రెడ్డి, ఎ.రవికిరణ్, వాలీబాల్‌లో అనిరుద్నాయక్, ఆర్. వినయ్, ఆలిండియా చెస్ టోర్నమెంట్లో ఆర్. హేమంత్ పాల్గొని ప్రతిభ కనపరిచారు. -
కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవికాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.వెంకటేశ్వర్రావును పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు వెంకటేశ్వర్రావును రిజిస్ట్రార్‌గా మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా ఉన్న వెంకటేశ్వర్రావు 2015 జూలై 16న రిజిస్ట్రార్‌గా ఏడాది కాలానికి నియమితులయ్యారు. ఈ నెల 16తో ఆయన పదవికాలం ము గిసింది. ఈ క్రమంలో మరో ఏడాది పాటు ఆయన పదవిని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర్రావు పదవికాలం పొడిగింపు నిర్ణయం ఈనెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
నేడు, రేపు కేఎంసీ వార్షికోత్సవం
–హాజరుకానున్న డీఎంఈ సుబ్బారావు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల(కేఎంసీ) 59వ వార్షికోత్సవాన్ని ఈ నెల 28, 29వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. లక్ష్య–16 పేరుతో 28వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల 1975 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థి, ఆనాటి మిస్టర్ కేఎంసీ డాక్టర్ ఎ. శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు.మయూక–16 పేరుతో 29వ తేదిన సాయంత్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ ఎన్. సుబ్బారావు హాజరవుతారన్నారు. సినీ సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ ఎల్వీ. గంగాధరశాస్త్రి హాజరై వైద్యులు–మానవతావిలువల గురించి ప్రసంగిస్తారని వివరించారు. వీరితో పాటు గౌరవ అతిథులుగా రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, డీఐజీ రమణకుమార్, శ్రీశైలం దేవస్థానం ఈవో, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎన్.భరత్‌గుప్తా, నాటా ఓవర్సీస్ కో ఆర్డినేటర్ ఎస్. వెంకటరమణ హాజరవుతారన్నారు. వచ్చే ఏడాది 60వ వార్షికోత్సవాన్ని డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్గా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏడాది పొడవునా ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జోజిరెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలో ఇద్దరిని మింగిన డిఫ్తీరియా
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం కర్నూలు(హాస్పిటల్): ‘అయ్యా నా పెద్దకుమారుడు వారం క్రితమే ఇదే రోగంతో చచ్చిపోయాడు. ఇప్పుడు అదే రోగం నా చిన్నకుమారున్నీ పట్టుకుంది. ఈ ఆసుపత్రిలో చూస్తే డాక్టర్లు మందులు లేవంటున్నారు. అప్పులు చేసి ముంబయి నుంచి రూ.18వేలు పెట్టి మందులు తెప్పించినాము. నా బిడ్డను ఎలాగైనా బతికించండయ్యా...’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఓ పేద కుటుంబం మొరపెట్టుకుంది. వారి మాటలు చెవికెక్కించుకోకుండానే మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. పేద కుటుంబం తెచ్చుకున్న ఖరీదైన మందులను సైతం వెంటనే వాడకుండా వైద్యులు తాత్సారం చేశారు. ఫలితంగా ఆ పేద కుటుంబం రెండో కుమారున్ని కూడా పోగొట్టుకుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన ఎంగన్న, నాగలక్ష్మమ్మల పెద్ద కుమారుడు శివయ్య రెండు వారాల క్రితం డిఫ్తీరియాతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయాడు. ఇదే వ్యాధి వారి చిన్న కుమారుడు శివరాముడుకు కూడా సోకింది. అతన్ని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం మళ్లీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఖరీదైన మందులు వాడితే గానీ రోగం తగ్గదని, ఆ మందులు ఇక్కడ లేవని డాక్టర్లు చెప్పడంతో వారి గుండెపగిలిగింది. ఊళ్లో అప్పులు చేసి డాక్టర్లు చెప్పిన మేరకు మందులను ముంబయి నుంచి ఆఘమేఘాలపై తెప్పించారు. అప్పటికే వారు బాలుని ఆరోగ్యం కోసం రూ.30వేల దాకా ఖర్చు చేశారు. పెద్దకుమారుని కోసం మరో రూ.10వేలు ఖర్చు పెట్టారు. ఇదే తరుణంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 11న ఆసుపత్రిని తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు శివరాముడును చూసి అతనికున్న వ్యాధి గురించి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా బాలుని తల్లిదండ్రులు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాగా.. అనే నిట్టూర్పుతో మంత్రి సరిపెట్టారు. బాలుని ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండన్న భరోసాను అధికారులకు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అంత ఖరీదైన మందులు ఎవరు కొనమన్నారంటూ శివరాముడు తల్లిదండ్రులను వైద్యులు నిలదీశారు. డాక్టర్లు చెప్పినందుకే కొన్నామని చెప్పినా పట్టించుకోలేదు. పైగా తెచ్చిన మందులను సైతం కొన్నాళ్ల పాటు వాడకుండా పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. ఈలోగా బాలుని ఆరోగ్య పరిస్థితి వికటించి మంగళవారం మతి చెందాడు. మంత్రి, అధికారులు స్పందించి ఉంటే తమ కుమారుడు దక్కేవాడని, మాయదారి రోగానికి తమ ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నామని బాలుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డిప్తీరియా వ్యాధి లక్షణాలతో గత సంవత్సరం 47 మంది, ఈ యేడాది 15 మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందారు. వీరి గళ్లను పరీక్షించిన కర్నూలు మెడికల్ కాలేజి మైక్రోబయాలజి ల్యాబ్ అధికారులు ఏ ఒక్కరికీ డిఫ్తీరియా సోకలేదని నివేదిక అందజేశారు. అయితే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారో మాత్రం చెప్పలేకపోతున్నారు. -
పడిగాపులు
తమ వాళ్ల కడచూపు కోసం రాయపేట మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. మృత దేహాలను గుర్తించడం, పోస్టుమార్టం, సమగ్ర విచారణ అనంతరం అప్పగించడంలో జాప్యం నెలకొంటోంది. దీంతో మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగి ఉన్నాయి. సాక్షి, చెన్నై:మౌళివాకం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి 27 మృతదేహాలను ఆ మార్చురీకి తరలించారు. అయితే, కొన్ని మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో గుర్తించడం కష్టతరంగా మారుతోంది. తమ వాళ్ల కోసం మార్చురీ వద్దకు పరుగులు తీస్తున్న వాళ్లకు ఆ మృతదేహాలను చూపిస్తున్నారు. అయితే, గుర్తించడం కష్టతరం అవుతుండడంతో కొన్ని మృతదేహాల ఆచూకీ, వివరాలు కనుగొనడంలో ఆటంకం ఏర్పడుతోంది. అదే సమయంలో తమ వాళ్లు మరణించారన్న సమాచారం ఉన్నా, వారి మృతదేహాలు రాయపేటలో ఉన్నాయా? కేఎంసీలో ఉన్నాయా? లేదా రామచంద్ర ఆస్పత్రిలో ఉన్నాయా? అన్నది తేల్చుకునేందుకు అక్కడక్కడ పరుగులు పెట్టే వాళ్లూ ఉన్నారు. ఇక, తమ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉండటంతో పరిశీలన, పోస్టుమార్టం ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు అప్పగిస్తారో తెలియక రాయపేట మార్చురీ వద్ద తీవ్ర మనో వేదనతో పడిగాపులు కాస్తున్న కుటుంబాలు అనేకం. మరి కొందరికి మృతదేహాలు చూసే అవకాశం దక్కడం లేదు. ఆంధ్ర రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళంవాసులే కాకుండా, తమిళనాడుకు చెందిన బాధితులు సైతం ఇక్కడ మృత దేహాల కోసం వేచి ఉన్నారు. సుమారు పదిహేనుకు పైగా కుటుంబాలు ఇక్కడ తమ వాళ్ల కడచూపు కోసం ఎదురు చూపుల్లో ఉన్నాయి. మృత దేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆర్థిక కష్టాలు : అనేక తెలుగు కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మార్చురీ వద్ద తీవ్ర మనోవేదనలో మునిగి ఉన్నాయి. వేతనం రోజునే ప్రమాదం జరిగిన దృష్ట్యా, చేసిన కష్టానికి ప్రతి ఫలం లేక కొందరు, తెచ్చుకున్న డబ్బులు సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి అంటూ అక్కడా..ఇక్కడ తిరగడంతో అయిపోయూయి. ఇలా అనేక కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా కన్నీటి పర్యంతమవుతున్నారు. హెల్ప్‌లైన్ వద్ద ఇచ్చే అన్నం, నీళ్ల ప్యాకెట్లతో కడుపు నింపుకుంటూ మృత దేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బరువెక్కిన గుండెతో చెట్ట నీడన కూర్చుని ఉన్నారు. దుర్గంధం : మార్చురీ వద్ద బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడు అధికారులు, అటు ఆంధ్రా నుంచి వచ్చిన రెస్క్యూ టీం అధికారి, విజయనగరం హౌసింగ్ విభాగం డెప్యూటీ ఇంజనీర్ మురళీ మోహన్ తమకు అందిన సమాచారాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే, ఆ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన పరిసరాలు, మార్చురీ మార్గాలు ఉద యాన్నే దుర్గంధంగా మారాయి. దీంతో అక్కడ ఆగమేఘాలపై బ్లీచింగ్, క్రిమి సంహారక మందులు చల్లారు. హెల్ప్‌లైన్ అధికారులతో పాటుగా, అక్కడున్న బాధిత కుటుంబాలకు మాస్కులు అందజేశారు. గుర్తించ లేనివి : పన్నెండు మృత దేహాలు గుర్తించలేని రీతిలో చితికిపోయినట్టు మార్చురీ వర్గాలు, వైద్య బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ మృతదేహాలను బాధిత బంధువులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిని గుర్తించినా, ఎక్కడో మెలిక పెడుతుండడంతో, అనుమానంతో తదుపరి ఆ మృత దేహం కోసం ఎవరైనా వస్తారా? అన్న ఎదురు చూపుల్లో మార్చురీ వర్గాలు ఉన్నాయి. 27 మృతదేహాల్లో 18 పురుషులు, 9 మహిళలవి. ఇప్పటి వరకు ఒడిశాకు చెందిన నాలుగు, విల్లుపురానికి చెందిన రెండు, అంబత్తూరు, విజయనగరానికి చెందిన ఓ మృత దేహాన్ని ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు అప్పగించారు. గుర్తించని 12 మృతదేహాల్లో ఐదు స్త్రీలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో అంబులెన్స్‌లలో పంపిస్తున్నారు. ఎదురు చూస్తున్నాం మా బంధువు పద్మ ఈ ప్రమాదంలో మరణించింది. ఆమెను గుర్తించాం. అయితే, పోస్టుమార్టం అనంతరం మృత దేహం అప్పగిస్తామన్నారు. నేను ఒరగడంలో పనిచేస్తుంటాను. బంధువులు అప్పన్న, పద్మలు ప్రమాదం జరిగిన చోట రెండు నెలలుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పన్న ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పద్మ మరణించడంతో ఆమె మృత దేహం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో...ఎప్పుడు మా ఊరెళ్లాలో తెలియడం లేదు. - సూర్యనారాయణ, నర్సన్న పేట మండలం, శ్రీకాకుళం మరదలు చనిపోయింది అమ్మ, నాన్నతో పాటుగా మరదలు దుర్గా ప్రమాదం జరిగిన భవనంలో పనిచేశారు. దుర్గా మరణించినట్టు అధికారులు చెప్పారు. అయితే, అమ్మ నాన్నలు అప్పలరాము, లక్ష్మిల జాడ ఇంకా తెలియలేదు. దుర్గా మృత దేహాన్ని మార్చురీలో గుర్తించాను. ఇంకా, అమ్మనాన్నల జాడ తెలియలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇక్కడ తిరుగుతున్నాను. అన్ని ఏర్పాట్లు చేశాం శ్రీకాకుళం, విజయనగరం బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మృత దేహాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి, బంధువులకు వాటిని చూపించి గుర్తు పట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మృత దేహాలు గుర్తించాల్సి ఉంది. ఇక్కడికి వచ్చే తెలుగు బాధితుల కుటుంబాలకు పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఆహారం అందిస్తున్నాం. మృత దేహాల్ని అంబులెన్స్‌లో స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశాం. బాధిత కుటుంబాలకు ఖర్చులకు గాను రూ.రెండు వేలు ఇచ్చి పంపుతున్నాం. పది మంది మృత దేహాలు ఆంధ్రాకు చెందిన వారివి గుర్తించాల్సి ఉంది. విజయ నగరానికి చెందిన సింహమ్మ మృత దేహాన్ని వారి స్వగ్రామానికి పంపించాం. మిగిలిన వారిని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు పంపుతాం. - మురళీ మోహన్ విజయనగరం డీఈ. హౌసింగ్ విభాగం ఇంజనీర్