సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే..
ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు.
అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
జరిగింది ఇదే..
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment