ఘనంగా కేఎంసీ వజ్రోత్సవం
ఘనంగా కేఎంసీ వజ్రోత్సవం
Published Fri, Mar 3 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
డాక్టర్ దువ్వూరు భాస్కరరెడ్డి విగ్రహాం ఆవిష్కరణ
– గురువులకు ఘన సన్మానం
– అలరించిన సాంస్క్రృతిక కార్యక్రమాలు
కర్నూలు(టౌన్): కర్నూలు వైద్య కళశాల వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూ బ్లాక్ లెక్చరర్ గ్యాలరీలో, న్యూ ఆడిటోరియంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని గురువులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక న్యూ లెక్చరర్ గ్యాలరీలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరబాద్‌కు చెందిన ఏషియన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.రామప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామిలు ఘన స్వాగతం పలికారు.
గ్యాస్ట్రో ఎంటారాలజి ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ శర్మ తయారు చేయించిన మాజీ ప్రిన్సిపాల్, పెథాలజి విభాగం మాజీ అధిపతి డాక్టర్ దువ్వూరు భాస్కర్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన కుమారుడు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. వైద్య విజ్ఞాన సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నాగేశ్వరరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మెడిసిన్ డిపార్టుమెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ పి.సుధాకర్, కేఎంసీ అల్యుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.వెంకటరమణ, గ్యాస్ట్రో ఎంటారాలజి హెచ్‌ఓడి డాక్టర్ శంకర్ శర్మ, డెర్మాటాలజి హెచ్‌ఓడి డాక్టర్ ఐ.సి. రెడ్డి, మాజీ డియంఇ సత్తార్, డాక్టర్ జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను : డాక్టర్ నాగేశ్వరరెడ్డి
కర్నూలు వైద్య కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో లెక్చర్ ఇచ్చినా... ఇక్కడికి రావడం సంతృప్తిగా ఉంటుంది. కర్నూలు వైద్య కళాశాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గురువు చెప్పిన పాఠాలు, క్రమశిక్షణను అలవర్చుకుంటే ఉత్తమ వైద్య విద్యార్థిగా రాణించవచ్చు. ఎండోస్కోపి విభాగంలో అనేక నూతన మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు వైద్య విద్యార్థులు నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవాలి. డయాబెటిక్ చికిత్సలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. చిన్నపేగు ద్వారా మధుమేహన్ని ఎండోస్కోపి చేసి నియంత్రించవచ్చు.
ఘనంగా గురువులకు సన్మానం
సాయంత్రం స్థానిక న్యూ ఆడిటోరియంలో కర్నూలు వైద్య కళశాలలో చదివి ఉన్నత పదవుల్లో పదవీ విరమణ పొందిన మాజీ ప్రొఫెసర్లు, వైద్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ప్రభత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరస్వామి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథరెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ వెంకటరమణ తదితరుల పాల్గొన్నారు. అనంతరం సీనియర్ వైద్యులు, మాజీ కళశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. వజ్రోత్సవాల సందర్భంగా కళశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Advertisement