సాక్షి, వరంగల్: వరంగల్ కేఎంసీలో అస్వస్థతకు గురైన మెడికో స్టూడెంట్ లాస్య ఘటన తీవ్ర కలకలం రేపింది. మాత్రలు వేసుకొని అనారోగ్యానికి గురి కావడంతో సూసైడ్‌కు యత్నించిందని వదంతులు వ్యాపించాయి. మెడికో ప్రీతి సూసైడ్ ఘటన మరువకముందే మరో మెడికో అస్వస్థతకు గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య మైగ్రేన్ కారణంతో మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుంది. మైగ్రేన్ కంట్రోల్ కాకపోవడంతో మరో టాబ్లెట్ వేసుకోగా ఓవర్డోస్ తో అనారోగ్యానికి గురైంది.
మరో మెడికో అస్వస్థతకు గురై ఎంజీఎం లో చికిత్స పొందుతోందని తెలియగానే వైద్యవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రస్తుతం మెడికో లాస్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం సూపరిందెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం ఘటన జరగలేదని, అనారోగ్యం కారణంతోనే ఎంజిఎంలో ప్రథమ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా లాస్య హెల్త్ కండిషన్ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న లాస్య పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చామని అన్నారు.
మరోవైపు అనారోగ్యానికి గురైన లాస్య స్పందిస్తూ మైగ్రేన్ కారణంగానే మాత్రలు వేసుకోవడంతో ఓవర్డోస్ అయిందని, ఇతర కారణాలు ఏవీ లేవన్నారు. తన అనారోగ్య సమస్యను అనవసరంగా ఇష్యూ చేయొద్దని కోరారు. ఏదేమైనా మెడికో స్టూడెంట్ అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స తీసుకోవడం కేఎంసీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రీతి ఘటన మరువకముందే మరో విద్యార్థి అనారోగ్యానికి గురికావడంతో కేఎంసీలో ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. మొత్తానికి లాస్య ఈ ఘటనపై స్పందిస్తూ తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదని, స్వల్ప అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో కేఎంసీ యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment