‘పట్టా’భిషేకం | graduation day | Sakshi
Sakshi News home page

‘పట్టా’భిషేకం

Published Wed, Apr 12 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

‘పట్టా’భిషేకం

‘పట్టా’భిషేకం

-వారి పేరు ముందు ఇకపై ‘డాక్టర్‌’
–కేఎంసీలో  ఘనంగా స్నాతకోత్సవం
 
దాదాపు ఆరేళ్ల పాటు కలిసి మెలసి తిరిగారు.. ఒకరి భావాలు మరొకరు పంచుకున్నారు.. జూనియర్లు, సీనియర్లు అన్న తేడా లేకుండా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అధ్యాపకులను కన్నవారిలా భావించారు.. వారి చెప్పింది శ్రద్ధగా విన్నారు. రోగుల నాడీ పట్టుకున్నారు.. వారి బాగోగులు చూసుకున్నారు. విజయవంతంగా  వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్‌ పట్ట తీసుకున్నారు. బుధవారం  కర్నూలు మెడికల్‌ కళాశాలలో జరిగిన ఈ పట్టాభిషేకం (సా​‍్నతకోత్సవం) కార్యక్రమాన్ని చూసేందుకు వారి కుటుంబసభ్యులు, స్నేహితులు వచ్చారు. తమ వాడు/ఆమె పేరు ముందు ఇకపై ‘డాక్టర్‌’ అని రాసుకునే రోజు వచ్చిందని మురిసిపోయారు.  
 
 
కర్నూలు(హాస్పిటల్‌):  కర్నూలు మెడికల్‌ కళాశాలలోని నూతన ఆడిటోరియంలో 146 మంది 2011 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు ముఖ్యఅతిథి డీఐజీ రమణకుమార్, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ చేతుల మీదుగా వైద్యవిద్య పట్టాలను ప్రదానం చేశారు. పట్టాలు తీసుకున్నాక, తీసుకోకముందు ఆడిటోరియం ఆవరణలో వైద్యవిద్యార్థులు సందడి చేశారు. వైద్య విద్య పూర్తయిందన్న విషయాన్ని చెప్పడానికి చిహ్నంగా వారి పట్టాలను గాలిలోకి ఎగురవేశారు. కన్నవారు, కుటుంబసభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం భారమైన హృదయంతో కళాశాల నుంచి బయటకు అడుగులు వేశారు. 
 
 
వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానం
–కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌
వైద్యవృత్తిలో నైతిక విలువలు ప్రధానమని కర్నూలు రేంజ్‌ డీఐజీ బీవీ రమణకుమార్‌ చెప్పారు. కర్నూలు మెడికల్‌ కళాశాలలో బుధవారం జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యవృత్తి సమాజంలో ఓ నోబుల్‌ ప్రొఫెషన్‌ అని చెప్పారు. ఎంబీబీఎస్‌ అనంతరం కొందరు ఐఏఎస్‌లు కూడా అయ్యారని చెప్పారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన కర్నూలు మెడికల్‌ కళాశాల నుంచి 146 మంది వైద్య విద్యార్థులు ఈ రోజు బయటకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  సమాజంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రజలు గమనిస్తారన్నారు. వైద్యుడిగా మీరు నేర్చుకున్నది 25 శాతం మాత్రమేనని, ఇంకా 75 శాతం తెలుసుకోవాల్సి ఉందన్నారు. మీ కెరీర్‌ను మరింత మెరుగులు దిద్దుకోవాలని, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకోవాలన్నారు. అన్నింటికీ ప్రణాళిక అవసరమన్నారు. ప్రణాళికతో ముందుకు వెళితే విజయం ఖాయమన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రోగులను ఆదరించడం.. తల్లిదండ్రులను గౌరవించడం ఎప్పటికీ మరువకూడదన్నారు. మంచి నైపుణ్యాలు గల, మానవత్వంతో కూడిన వైద్యుడిగా సమాజంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
 
సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోంది
–ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌
సమాజం డాక్టర్ల నుంచి ఎంతో ఆశిస్తోందని కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ చెప్పారు.  దానికి అనుగుణంగా భావి వైద్యులు ముందుకు సాగాలన్నారు.  వైద్యులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(భావవ్యక్తీకరణ) ప్రధానమని,  రోగులకు మందులు రాసేటప్పుడు అది వారికి అవసరమా అని ఆలోచించుకోవాలన్నారు. మార్పును  ఆహ్వానిస్తూ జ్ఞానాన్ని ఇనుమడింపజేసుకుంటే మంచి డాక్టర్‌గా రాణిస్తారన్నారు. అనంతరం రిటైర్డ్‌ డీఎంఈ డాక్టర్‌ ఎస్‌ఏ సత్తార్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. చివరగా బంగారు పతకాలు సాధించిన 9 మంది వైద్య విద్యార్థులకు వాటిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ కృష్ణానాయక్, డాక్టర్‌ పి. చంద్రశేఖర్, మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 
 
గోల్డ్‌మెడల్‌ సాధించిన విద్యార్థులు
         విద్యార్థి పేరు          సబ్జక్టులు
డి. రాగదీపిక            అనాటమి, బయోకెమిస్ట్రీ, పెథాలజి, పీడియాట్రిక్స్‌
బి. శ్రవణ్‌కుమార్‌         ఫిజియాలజి
ఎ. నిహారిక              పెథాలజి, మైక్రోబయాలజి
వి. మనోజ్‌రెడ్డి           ఫోరెన్సిక్‌ మెడిసిన్‌
కె. రవీంద్రనాథ్‌రెడ్డి,  
 కేవీ హరీష్‌కుమార్‌          ఫార్మకాలజి
ఎస్‌. సుప్రియ                ఆఫ్తమాలజి
ఎం. జయరామకృష్ణ          ఆబ్‌స్ట్రిక్ట్‌ అండ్‌ గైనకాలజి
సి. సుధాప్రియ(బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌) బయోకెమిస్ట్రీ, ఎస్‌పీఎం, ఈఎన్‌టీ, మెడిసిన్, సర్జరీ  
         
నాన్న కల నెరవేర్చాను
ముల్లా జైతున్‌ రుమన్, వైద్యవిద్యార్థి
నాన్న ముల్లా అబ్దుల్‌ కలాం కలను నెరవేర్చాను. ఆయన నేను వైద్యవిద్యను అభ్యసించాలని ఎన్నో కలలు గన్నారు. ఈ రోజు కోసం ఎంతో కాలం ఎదురుచూశారు. కానీ దురదృష్టవశాత్తు నాన్న గత మార్చి నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశయాల మేరకు సోదరి సైతం ఎంటెక్‌ చదివి, గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఎంబీబీఎస్‌ పూర్తయిన వెంటనే నేను పీజీ ప్రవేశ పరీక్షలోనూ విజయం సాధించడం ఇంకా ఆనందంగా ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement