ఆపరేషన్ అనంతరం సాజిదాబీతో వైద్యులు, సిబ్బంది
హృదయం.. విజయనాదం
Published Fri, Sep 23 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
– గుండెచప్పుళ్లతో మారుమోగిన కేఎంసీ
– తొలిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ
– కల సాకారం చేసిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు మెడికల్ కళాశాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఓ వైద్యుడి కృషి కేఎంసీని ఖ్యాతిని కీర్తిపతాకాన నిలబెట్టింది. ఎన్నో అవమానాలు.. హేళలను భరించి తాను విద్యనభ్యసించిన కళాశాలలో ఓపెన్ హార్ట్ సర్జరి చేయాలనే కసి అతనిలో పెరిగింది. ఆయన మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. పేద హృద్రోగులకు మెరుగైన సేవలందించే అవకాశం ఏర్పడింది. ‘నా అమృత హస్తాల్లో మీరు క్షేమం’ అని మరో సారి కర్నూలు పెద్దాసుపత్రి స్టెత్ ఎగరేసి భరోసా నిచ్చింది. కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు పెద్దాసుపత్రిలో మొదటిసారి నగరంలోని వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన సాజిదాబీ(22)కి గురువారం రాత్రి నిర్వహించిన ఓపెన్‌హార్ట్ సర్జరీ విజయవంతమైంది. ఎందరో డాక్టర్ల గుండెచప్పుళ్లు విజయ నాదంతో మారుమోగాయి. ఈ సందర్భంగా శుక్రవారం కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన భావోద్వేగతంతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..
– కర్నూలు(హాస్పిటల్)
‘ఏమయ్యా 60 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నావు...ఇంకా కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజి)లో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయడం లేదా...అని హైదరాబాద్‌లోని గాం«ధీ హాస్పిటల్‌లో హేళన చేసేవారు. వైజాగ్‌లోనూ ఇదే విధంగా అవమానపరిచారు. చివరకు ఈ ఆసుపత్రిలోనూ నన్ను కొందరు అడుగుపెట్టనీయడానికి ఇష్టపడలేదు. నాకు వార్డునిచ్చేందుకు కూడా అడ్డుపడ్డారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ నాకు వార్డు చూపించారు. మూడేళ్ల కాలంలో దాన్ని ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసే స్థాయికి తీసుకొచ్చాను. ఆనాడు చేసిన హేళనలు, చిన్నచూపు నాలో కసిని పెంచాయి. ఆ కసితోనే మొదటిసారి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించాను. ఎంతో ఆనందగా ఉంది. కేఎంసీ చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నా గురువులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ డబ్లు్య సీతారామ్, డాక్టర్ సుదర్శన్‌ల నుంచి స్నేహం, సేవాగుణం, ఆపరేషన్‌కు ముందు చేసే హోమ్‌వర్క్ వంటి అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా నాకు విద్యాబుద్ధులు చెప్పిన కేఎంసీపైనే ధ్యాస ఉండేది. నేను చదివిన కాలేజిలో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాలని భావించి ఇక్కడికి బదిలీపై రావాలని ఫైలు చంకనపెట్టుకుని అధికారుల చుట్టూ తిరిగాను. ఈ సందర్భంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌తో పాటు కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రోత్సాహంతో ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్ ఏర్పాటైంది. కళాశాల డైమండ్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఓపెన్‌హార్ట్ సర్జరీ ఒక బహుమతిగా ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు చివరగా ఉంది, మరోవైపు తెలంగాణా రాష్ట్రంలోనూ ఇక్కడి రోగులకు చికిత్స అందించడం లేదు, ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇక్కడి పేదరోగులకు నాణ్యమైన హృద్రోగసేవలందించాలనే ఉద్దేశంతో ఓపెన్‌హార్ట్ సర్జరీ ప్రారంభించాం’.
ఇద్దరి పట్టుదలతోనే ఆపరేషన్లు ప్రారంభం: ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి
కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పట్టుదలతోనే తక్కువ సమయంలోనే ఈ విభాగం ఏర్పాటై, గుండె ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసేందుకు ఎంతో శ్రమించాం. అందరి సహకారంతో ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్రంలోనే నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కర్నూలు ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం.
వెయ్యికి పైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యికిపైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఆయన కర్నూలు మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్, జనరల్ సర్జరీలో పీజీ చదివారు. అనంతరం జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో కొంతకాలం జనరల్ సర్జన్‌గా, కోడుమూరు పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇదే సమయంలో పత్తికొండ సీహెచ్‌సీలోనూ వారానికి రెండుసార్లు వెళ్లి ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించేవారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజిలో కార్డియోథొరాసిక్ కోర్సును అభ్యసించారు. ఆతర్వాత కర్నూలు మెడికల్ కాలేజిలో కార్డియోథొరాసిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గాంధి, వైజాగ్, నెల్లూరులో పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యికి పైగా ఓపెన్‌హార్ట్ సర్జరీలు నిర్వహించారు.
Advertisement
Advertisement