‘కోట్లా’ట
‘కోట్లా’ట
Published Thu, Jun 15 2017 12:31 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
కార్పొరేషన్‌లో నామినేషన్ దందా!
- మొత్తం పనులు తనకే కావాలంటున్న ఎమ్మెల్యే
- తమ సంగతేమిటంటున్న ఎంపీ, మాజీ మంత్రి వర్గీయులు
- రూ.5.65 కోట్ల పనుల చుట్టూ విభేదాలు
- ‘అత్యవసర’ పనులకు తొలగని అడ్డంకులు
- ఎవరు చేపట్టాలనే విషయంలో పంతాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ పనుల దందా మళ్లీ తెరమీదకు వచ్చింది. గతంలో ఉన్న కమిషనర్ ఆరు నెలల కిందట ఇచ్చిన ఆదేశాల మేరకు నామినేషన్ పనులు చేపట్టాలని అధికార పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. నామినేషన్ పద్ధతిలో ఒక్కో పని రూ.5 లక్షల విలువతో మొత్తం 113 పనులను చేపట్టేందుకు గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. ప్రధానంగా ఈ పనులను ఎవరు చేపట్టాలనే విషయంలో అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో అడుగు ముందుకు పడలేదు.
తాజాగా కొత్త కమిషనర్ వచ్చిన నేపథ్యంలో ఈ నామినేషన్ల పనుల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. మొత్తం 113 పనుల్లో 87 పనులు తనకే కావాలంటూ ఎమ్మెల్యే ఎస్వీ పట్టుబడుతున్నారు. కచ్చితంగా అందరూ సమానంగా తీసుకుని కార్యకర్తలకు ఇవ్వాల్సిందేనని ఎంపీ టీజీ.. పాణ్యం ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఏరాసు పేర్కొంటున్నారు. దీంతో ఈ పనులు కాస్తా ప్రారంభం కావడం లేదు. మొత్తం మీద రూ.5.65 కోట్ల విలువైన నామినేషన్ పనులను దక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఆరు నెలలు గడిచినా..
అధికార పార్టీ నేతలకు నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ నామినేషన్ పనులను ఎస్‌హెచ్‌జీ, ఎన్‌జీఓల ద్వారా మాత్రమే చేపట్టాలని పేర్కొన్నారు. ఈ ముసుగులో అధికార పార్టీ నేతలకు అప్పగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా కర్నూలు కార్పొరేషన్‌లో ఏకంగా 113 పనులను నామినేషన్‌పై అప్పగించేందుకు వీలుగా 31 డిసెంబర్ 2016న అప్పటి కమిషనర్ రవీంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. అత్యవసరంగా చేపట్టాలని పేర్కొంటూ ఈ పనులను నామినేషన్‌పై అప్పగించాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలతో ఈ పనులు కాస్తా ముందుకు సాగలేదు. తాజాగా మళ్లీ ఈ నామినేషన్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. మొత్తం పనుల్లో తనకే మెజార్టీ వాటా అని ఎమ్మెల్యే పేర్కొంటుండగా.. తమ సంగతేమిటని అటు ఎంపీ, ఇటు మాజీ మంత్రి మండిపడుతున్నారు. దీంతో ఈ పనులు కాస్తా ముందుకు సాగేలేదు. కొత్త కమిషనర్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ ఈ నామినేషన్ దందా తెరమీదకు వచ్చింది.
అత్యవసరమైతేనే..
వాస్తవానికి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం కేవలం అత్యవసర పనులకు మాత్రమే నామినేషన్ పద్ధతిని ఎన్నుకోవాలని పేర్కొంది. అత్యవసర సమయాల్లో చేయాల్సిన పనులకు టెండర్లు పిలవడం ద్వారా సమయం వృథా అవుతుందనుకున్న సందర్భాల్లో ఈ విధానాన్ని ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ పనులను స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ), స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీఓ) ద్వారా మాత్రమే చేపట్టాలని కూడా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తోసిరాజని సాధారణ పనులను కూడా నామినేషన్ పద్ధతిలో అప్పగించేందుకు వీలుగా వ్యవహారం తెరమీదకు వచ్చింది. అసలు ఆరు నెలల కిందట అప్పగించిన పనులను ఇప్పుడు చేయడం ద్వారానే అవి అత్యవసరం కాదనే విషయం అర్థమవుతోంది. అయినప్పటికీ కేవలం కమీషన్ల కోసమే ఈ నామినేషన్ దందా తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
Advertisement