పదవుల పంపకంపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి:నామినేటెడ్ పదవుల పంపకంపై టీడీపీలో అసంతృప్తి జ్వాలలు తీవ్ర స్థాయిలో రగులుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని, సీనియర్లను కాదని ముఖ్య నేతల కోటరీకి దగ్గరగా ఉండే వారికి పదవులు కట్టబెట్టారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి దశలో భర్తీ చేసిన 21 కార్పొరేషన్లు, అందులోని ఏడు కార్పొరేషన్లలోని డైరెక్టర్ పదవుల భర్తీకి హేతుబద్ధత లేదని వాపోతున్నారు.
హవ్వ.. డైరెక్టర్ పదవులిస్తారా!
పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీపడ్డ వారిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించి పార్టీ పెద్దలు చేతులు దులిపేసుకున్నారు. ఇది వారిని అవమానించడమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. రంపచోడవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వంతల రాజేశ్వరిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ఎంపీ సీటు కోసం పోటీ పడిన గుడివాడకు చెందిన శిష్ట్లా లోహిత్‌కూ అదే కార్పొరేషన్‌లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును అందులోనే డైరెక్టర్‌గా నియమించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఒకసారి మంత్రిగా పనిచేసిన సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పరసా వెంకటరత్నానికి ఒక కార్పొరేషన్‌లో డైరెక్టర్ పదవి ఇవ్వడం అవమానించడం కాకపోతే ఏమిటనే ప్రశ్నలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
సీట్లు వదులుకున్న వారికి మొండిచేయి
గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు, ఇతర సమీకరణల వల్ల 36 మంది నేతలు సీట్లు వదులుకున్నారు. వారిలో మంతెన రామరాజు, పీలా గోవింద సత్యనారాయణకే ఈసారి అవకాశం కల్పించారు. వీరు కాకుండా సీట్లు ఆశించి భంగపడిన నేతలు మరో 50 మంది వరకూ ఉన్నారు. వారందరికీ పదవుల పంపకంలో మొండిచేయి ఎదురైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం సీటు వదులుకున్నా.. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఆయనకే ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జాబితాలో ఆయన పేరు లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో కాకినాడ జిల్లా పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉన్నా పక్కనపెట్టారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు అవకాశం కల్పించలేదు.
సీనియర్ల ఆశలు నెరవేరలేదు
మరోవైపు కచ్చితంగా తొలి దశలోనే తమకు పదవులు వస్తాయని భావించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, అశోక్‌బాబు, మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్, బుద్దా వెంకన్న వంటి నేతలను తొలి దశలో పరిగణనలోకి తీసుకోలేదు. కొమ్మారెడ్డి పట్టాభికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ఆయనకు దక్కలేదు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తొలి దశలోనే తనకు అవకాశం దక్కుతుందని చెప్పుకున్న ఆనం వెంకటరమణారెడ్డిఇ మొండిచేయే ఎదురైంది. ఇంకా వివిధ జిల్లాల్లో అనేక మంది నేతల ఆశలు నెరవేరలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పదవులను భర్తీ చేశారో చెప్పాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం తనయుడు లోకేశ్ కోటరీ సూచనల ప్రకారమే పదవులు కట్టబెట్టారని, ఆయన దృష్టిలో ఉన్న వారికి తప్ప మిగిలిన వారిని పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment