
కార్యకర్తలు సాధికారత సాధిస్తేనే పార్టీ బలోపేతం
కింద స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పనిచేశారో తెలుసుకుంటున్నా
కష్టపడి పనిచేసినవారికి పదవులు ఇస్తా
ఎమ్మెల్యేలు.. కార్యకర్తలను విస్మరించొద్దు
టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి ఎవరు, ఎక్కడ ఏం పని చేశారో తెలుసుకుంటున్నానన్నారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తేనే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు శనివారం తొలిసారి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పలువురు నాయకులు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు.
అనంతరం టెలీకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. తాను ఇకపై తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి, జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతానని తెలిపారు. గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామని, ఇక ముందు కూడా ఇలాగే ఆదుకుంటానన్నారు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు.. నాయకులు, కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చేయొద్దని హెచ్చరించారు.
కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం.. కృషి ఎంతో ఉన్నాయన్నారు. కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను సాధించిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ఐదో సంతకం చేశానని తెలిపారు.
యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తామన్నారు. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2014–2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో, వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్తామని చెప్పారు.
వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ
ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్దిష్ట సమయంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయానికి రాకపోకలు కొనసాగించేందుకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయన్నారు. విధ్వంస పాలనకు గుర్తుగా ప్రజా వేదిక శిథిలాలను అలాగే ఉంచుతామని, తొలగించేది లేదని వెల్లడించారు.