తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మార్కెట్‌యార్డుల పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. చిలకలూరిపేట, తెనాలి నియోజకవర్గాల నేతల ప్రయత్నాలు సామాజిక వర్గాల మధ్య విభేదాలను పెంచుతుంటే, పిడుగురాళ్ల కమిటీ డెరైక్టర్ పదవిని ఆశిస్తున్న నేతపై ఏకంగా హత్యాయత్నమే జరిగింది. వినుకొండలో ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పోటీ పార్టీలో విభేదాలకు దారి తీస్తోందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. అయితే అతిపెద్ద గుంటూరు మార్కెట్‌యార్డు పదవిపై ఏకాభిప్రాయం కుదిరినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డికి దాదాపు ఖరారైనట్టుగా వినపడుతోంది. ఈ పదవి కోసం పలువురు నాయకులు పోటీపడుతున్నా, సాంబశివారెడ్డికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు.
చిలకలూరిపేట మార్కెట్ యార్డు కమిటీ ఎంపిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పురుషోత్తమపట్నంకు చెందిన విడుదల లక్ష్మీనారాయణ, మరో వర్గం నుంచి మల్లెల రాజేష్ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య పోటీ పార్టీలో ఆసక్తిగా మారితే, కమ్మ,ై మెనార్టీ వర్గాల నేతలు కూడా పోటీ పడుతున్నారు. పిడుగురాళ్ల డెరైక్టర్ పదవి కోసం హత్యాయత్నమే జరిగింది.
గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన చలవాది గురువులును డెరైక్టర్‌గా నియమిస్తున్నట్లు ఓ పత్రికలో వార్త రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న జి. చిన ఓబయ్య తనకు మార్కెట్‌యార్డు డెరైక్టర్ పదవి దక్కదనే అక్కసుతో గురువులుపై హత్యాయత్నానికి పథకం పన్నారు. మరో ఇద్దరి సహకారంతో వేటకొడవళ్లతో ఇంటిలోనే దాడిచేశారు.గురువులు తల్లి రాములమ్మ పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. గురువులు తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతడి భార్య వెంకటరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెనాలి మార్కెట్‌యార్డు పదవిని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు రావి రామ్మోహనరావు(కమ్మ), గడవర్తి సుబ్బయ్య(యాదవ) ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు రామ్మోహనరావు సన్నిహితుడు. ఇదే పదవిని ఆశిస్తున్న సుబ్బయ్య మాత్రం తాను వెనక్కి తగ్గేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. తెనాలి వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకవర్గ చైర్మన్ పదవి ఇస్తామని ప్రతిపాది ంచినా వద్దని తేల్చి చెప్పేశారు. ఈ కుమ్ములాటల కారణంగా ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు.
బాపట్ల మార్కెట్‌యార్డు అధ్యక్ష పదవి కోసం బాపట్ల మండల అధ్యక్షుడు రావిపూడి నాగమల్లేశ్వరరావు, అప్పికట్ల గ్రామసర్పంచ్ ఇనగంటి గాంధీ పోటీపడుతున్నారు. రావిపూడి నాగమల్లేశ్వరరావుకు స్థానిక ఇన్‌చార్జి అన్నం సతీష్‌ప్రభాకర్ మద్దతు ఉండగా, ఇనగంటి గాంధీకి రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వినుకొండ నియోజకవర్గ పరిధిలో వినుకొండ, ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలు ఉన్నాయి.
ఈ రెండు కమిటీ చైర్మన్ పదవులకు పది మందికిపైగానే పోటీపడుతున్నారు. పొన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పార్టీ సీనియర్ నేత మాదాల వెంకటేశ్వరరావుకు వచ్చే అవకాశాలున్నాయని వినపడుతోంది. రాష్ట్ర స్థాయిలో అనేక పార్టీ పదవులు నిర్వహించిన మాదాలకు సంబంధించిన సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించి ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తోంది.